మోడీ నియోజకవర్గంలో ‘స్వచ్ఛ భారత్’ వాస్తవ రూపం
వారణాసిలో పారిశుధ్య కార్మికుల గోడు
వేతన పెంపు కోసం రోడ్డెక్కిన కాంట్రాక్ట్ కార్మికులు
అయినా.. అమలు కాని యూపీ సీఎం హామీ
దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ పేరుతో పరిశుభ్రతపై ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల గోడు పట్టించుకోవడం లేదు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనే వారు తమ సమస్యలను నిరసనల రూపంలో వెలిబుచ్చుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డుపై చెత్త పోసి వారు తమ నిరసనను తెలియజేశారు. తక్కువ వేతనాలు, జీతాల ఆలస్యం, సామాజిక భద్రతలపై అనిశ్చిత, సెలవుల సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల అస్థిరతతో విసిగిపోయిన సుమారు వంద మంది కార్మికులు మే 13న బీహెచ్‌యూ సమీపంలో చెత్తను రోడ్డుపై వేసి వినూత్న రీతిలో నిరసన చేశారు. ‘పరిశుభ్ర నగరం’ వెనుక తమ జీవితాలు మాత్రం ఎందుకు మురికిలోనే ఉండాలంటు వారు ప్రశ్నించారు.
లక్నో : ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ‘స్వచ్ఛ భారత్’ వాస్తవ రూపం బయటపడింది. నగరాన్ని ప్రతిరోజూ శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులే తమ కనీస జీవన అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని చెప్తున్నారు. మే 13న సుమారు 100 మంది కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు బీహెచ్‌యూ సమీపంలోని మాలవీయ చౌరాహా వద్ద రోడ్డుపై చెత్త పోసి నిరసనకు దిగారు. అయినప్పటికీ యూపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు కావటం లేదు.
రూ.10,700 జీతం.. రూ.2,500 పెట్రోల్‌కే!
సన్నీ కుమార్ రావత్ (29) సామాజిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్. భార్య పూనమ్‌తో కలిసి వారణాసిలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నారు. సారనాథ్‌లో నివసించే సన్నీ ప్రతిరోజూ భార్యతో కలిసి బైక్‌పై సుమారు 26-30 కిలో మీటర్లు ప్రయాణించి విధులకు హాజరవుతున్నారు. తనకు నెలకు రూ.10,700 మాత్రమే వస్తుందనీ, కోతల తర్వాత అది కొనిసార్లు రూ.9-8 వేలకే పడిపోతుందని ఆయన తెలిపారు. అందులోనే నెలకు రూ.2500 వరకు పెట్రోల్ ఖర్చవుతోందని చెప్పారు. భార్యాభర్తలిద్దరూ పని చేస్తున్నా… పిల్లల చదువు, రవాణా, ఇంటి ఖర్చులు భరించడం కష్టంగా మారిందని సన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లల విద్య, స్కూల్ బస్ కోసం నెలకు సుమారు రూ.3వేలు ఖర్చవుతోందని తెలిపారు.
యూపీ సీఎం హామీ ఎక్కడ
గతేడాది అక్టోబరులో వారణాసిలో జరిగిన స్వచ్ఛతా మిత్ర సన్మాన్ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పారిశుధ్య కార్మికులకు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని ప్రకటించారు. అయితే ఆ ప్రకటనను వేతన పెంపు హామీగా భావించిన కార్మికులకు నిరాశే మిగిలింది. మే 13న నిరసన తర్వాత వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఔట్‌సోర్స్ పారిశుధ్య కార్మికుల గౌరవ వేతనాన్ని ఏప్రిల్ 1 నుంచి పెంచుతున్నట్టు ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.13,006 చెల్లించనున్నారు. అయితే కార్మికులు మాత్రం తమకు కనీసం రూ.18వేలైనా వేతనం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదంలో చనిపోతే పరిహారం ఎమూక్కడీ
పారిశుధ్య కార్మికుల పని అత్యంత ప్రమాదకరంగా ఉంటోంది. మ్యాన్ హౌళ్లలోకి దిగడం, మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెత్త సేకరించడం, రోడ్లను శుభ్రం చేయడం వంటి పనులు ప్రతి రోజూ చేయాల్సి ఉంటుంది. ఒక కార్మికుడు మ్యాన్ హౌల్లోకి దిగినప్పుడు లేదా విద్యుత్ షాక్‌తో విధుల్లోనే మరణిస్తే కాంట్రాక్టర్ లేదా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పరిహారమూ లభించదని ఓ అసిస్టెంట్ సూపర్వైజర్ వెల్లడించడం గమనార్హం. అయితే ఇదే నిజమైతే ‘స్వచ్ఛ భారత్’ను నడిపిస్తున్న కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
’మా గొంతు వినిపించడానికి భయపడుతున్నాం’
కార్మికుల సమస్యల్లో మరో ముఖ్యమైన అంశం ఉద్యోగ భద్రత. ప్రయివేటు ఏజెన్సీల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరగడంతో టెండర్లు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారే పరిస్థితి ఉంది. దీంతో ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఆందోళన నెలకొంది. తమపై జరుగుతున్న దోపిడీ గురించి బహిరంగంగా మాట్లాడితే తమ గొంతును అణచివేస్తారన్న భయంతో చాలా మంది మాట్లాడేందుకు వెనుకాడుతున్నారని కార్మికులు చెప్తున్నారు.
ఒకే పని.. వేతనాల్లో భారీ తేడా
శాశ్వత పారిశుధ్య ఉద్యోగులు నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదిస్తున్నారు. అయితే తాత్కాలిక, కాంట్రాక్టు కార్మికులు మాత్రం రూ.18వేల నుంచి రూ.21 వేల వరకు మాత్రమే పొందుతున్నారు. మరికొందరు ఔట్‌సోర్స్ కార్మికులకు ఇది రూ.10,700 మాత్రమే. ”మేమూ చెత్తనే శుభ్రం చేస్తున్నాం. మురుగు కాలువల్లోకి దిగుతున్నాం. వీధులను శుభ్రం చేస్తున్నాం. మరి మా వేతనం ఎందుకు ఇంత తక్కువ?” అన్న ప్రశ్న కార్మికుల నుంచి వినిపిస్తోంది.
ఈఎస్ఐసీ కోతలు.. కార్డు మాత్రం లేదు!
కార్మికుల ఆవేదన వేతనంతోనే ఆగిపోలేదు. తమ జీతాల నుంచి ఈఎస్ఐసీ కోసం డబ్బులు మినహాయిస్తున్నప్పటికీ.. వైద్య సేవలు పొందేందుకు అవసరమైన ఈఎస్ఐసీ కార్డు కానీ, ఇతర పత్రాలు కానీ తమకు అందలేదని పలువురు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని విశాల్ అనే కార్మికుడు తెలిపారు.



