నారదుడు ఆకాశమార్గాన వెళుతూ, ఆంజనేయుడు కోసం వెదుకుతున్నాడు. ఎక్కడో గంధమాధన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే అక్కడ దిగిపోయాడు. అక్కడ వాతావరణం నారదుడిని ఎంత ఆశ్చర్యానికి, ఆనంనదానికి గురి చేసింది! అంతా రామ నామ స్మరణే. మూరు మోగుతున్నది. ఆంజనేయుడు తపస్సు చేసుకుంటున్న చోటుకి చేరుకున్నాడు. తనకి అలవాటైన విధంగా ”నారాయణ నారాయణ” అన బోయాడు కాని నారదుడి నోరు పెగలటం లేదు. మళ్ళీ ప్రయతినంచాడు కాని ప్రయత్నించినా లాభం లేక పోయింది. చుట్టు పక్కలంతా రామనామమే పలుకుతున్నప్పుడు తన ప్రయత్నం వృధా అని నారదుడికి తెలిసిపోయింది. వెందుకే రామరామ అన్నాడు. బెంటనే ఆంజనేయుడు కళ్ళు తెరిచాడు.
”నారద మునీంద్రా! నమస్కారములు అంతా కుశలమేనా”! అంటూ నమస్కరించాడు ఆంజనేయుడు.
”ఆ, నేను కుశలమే, నీకు ఆనందం కలిగించే ఒక శుభవార్త తెలపాలని వచ్చితిని!’ అన్నాడు నారదుడు.
”నాకు కొత్తగా ఆనందం కలిగే వార్తేమున్నది. సదా రామనామం జపిస్తూ నేను ఆనందంగానే ఉన్నాను కదా! అన్నాడు ఆంజనేయుడు.
”కానే కాదు!ఈ వార్త వింటే నీవు ఎగిరి గంతు వేస్తావు! అంత గొప్ప శుభవార్తను తీసుకుని వచ్చాను!” అన్నాడు నారదుడు.
”నీవు ఇంతగా చెబుతున్నావంటే అది నిజంగా శుభవార్తే అయ్యి ఉంటుంది! అదేమిటో సెలవియ్యి మునీంద్రా!” అన్నాడు ఆంజనేయుడు కుతూహలంగా.
”అయోధ్యలో నీ రాముడికి, కలియుగంలో గుడి కట్టలేదు! ఇన్నాళ్ళకి మహాధ్బుతమైన గుడి నిర్మించుకున్నారు. త్వరలోనే ప్రారంభం కూడా జరపబోతున్నారు!” అన్నాడు నారదుడు.
ఈ వార్త వింటూనే ఆంజనేయుడు ఆనందంతో గంతులు వేశాడు.
”మునీంద్రా! ఇది నిజంగానే గొప్ప శుభవార్త! అంటూ నారదుడిని భుజాల మీదికి ఎత్తుకున్నాడు.
”ఆంజనేయా! నీ ఉత్సాహం చూస్తుంటే ఇదే ఊపు నన్ను ఇలాగే ఆయోధ్యకు తీసుకెళ్ళేలా ఉన్నావే! అన్నాడు నారదుడు.
అంతకన్నా భాగ్యమా! మునీంద్రా పదండి వెళ్దాం! అంటూ ఆంజనేయుడు ఆకాశ మార్గాన, నారదుని భుజాల మీదనే కూర్చోబెట్టుకుని అయోధ్య చేరుకున్నాడు.
”మునీంద్రా! మనం ఇలాగే అయోధ్య లోకి ప్రవేశిస్తే మనల్ని గుర్తించి స్వాగత సత్కారాలు, పూజలు చేయవచ్చు. అందుకే ప్రజలు మనను గుర్తించకుండా మారు వేషలలో సంచరించుదాము! అన్నాడు – ఆంజనేయుడు.
నారదుడు సరేనన్నాడు! ఇద్దరూ మారు వేషలలో ఆయోధ్య పుర వీధులలో సంచరించసాగారు! అయోధ్యలో తిరుగుతున్న కొద్ది ఆంజనేయుడికి క్రమంగా అసహనం పెరిగింది.
మునీంద్రా! ఇది అయోధ్యయేనా! పొరపాటున మనం వేరే పురమును చేరుకుంటిమా! నేను అయోధ్యకు రాక చిరకాలము గతించింది! దారి తప్పినట్లున్నది” అన్నాడు ఆంజనేయుడు అసహనమూ అనుమానమూ కలగలిపి.
”ఆంజనేయా! ఇది ఆయోధ్యే! అనుమానము వలదు. నీవు అయోధ్యలో నివసించినది త్రేతా యుగమందున. ఇది కలియుగము మార్పు అనివార్యము కదా!” అన్నాడు నారదుడు.
”ఆ మాత్రము గ్రహించలేనా మునీంద్రా! అయోధ్యలో నా రాముడి చిహ్నాలేమీ కనబడుట లేదు! ఎక్కడా రామానామము కనబడుట లేదు! ఎవరీ నూతన ముని తెల్లటి గడ్డంతో కనబడుతున్నాడు. వశిష్టుడే అని భ్రమ పడ్డాను! కాని వశిష్టుడు కాదు! రామ నామమునకు బదులుగా నమో! ఆని వినబడుచున్నది! ఇది ఏమి మంత్రము కొత్తగా ఉన్నది” అన్నాడు ఆంజనేయుడు.
”నిజమే ఆంజనేయా! పురజనులతో చర్చించుదాము!” అంటూ కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక భక్తుడిని పలకరించినాడు నారదుడు.
‘భక్తా! ఇక్కడ రాముల వారి ఆలయం నిర్మించుతున్నారు కదా! ఆ చిహ్నాలేమీ కనబడటం లేదు! తెల్లటి గడ్డం గల ఆ ముని ఎవరు? నమో! మంత్రానికి అర్థమేమిటి?” ప్రశ్నల వర్షం కురిపించాడు.
నారదుడి ప్రశ్నలకు, ఆ భక్తుడు పగలబడి నవ్వాడు. అంతేకాదు తోటి భక్తులను కూడా పిలిచి విషయం చెప్పాడు. దాంతో వారందరు కూడా నవ్వారు.
”ఇందులో నవ్వవలసిన విషయమోమున్నది?” అన్నాడు నారదుడు.
”నవ్వవలసినది కాక పేరెమున్నది? ప్రపంచమే అంగీకరించిన నాయకుడి ఫోటో చూసి, మీరు ముని అంటున్నారు! ఆయన పేరే మీరు వింటున్న నమో! అన్నాడు ఆ భక్తుడు.
”ఆయోధ్యలో వినిపించవలసింది, రామ నామము, కన్పించ వలసింది రామ చిత్రము మాత్రమే! నడుమ ఈ నమో ఎవ్వరు? అన్నాడు ఆంజనేయుడు కోపంగా.
”నమో ! ఎవ్వరంటావేమిటి? ఆయన అవతార పురుషుడు! అలాంటి అవతార పురుషుడి గురించి అడ్డంగా మట్లాడుతున్నారు. ఎవర్రా మీరు పాకిస్తాన్ నుండి వచ్చారా? లేక చైనా నుండి వచ్చారా?” అన్నాడొక భక్తుడు.
దాంతో ఆంజనేయుడు, నారదుడు తమ నిజరూపాలు దాల్చారు.
”నేను నారదుడను, ఆయన ఆంజనేయుడు! అన్నాడు నారదుడు.
”ఈయన ఆంజనేయుడు ఎందుకవుతాడు! ఇదిగో చూడు ఆంజనేయుడు ఇలా ఉంటాడు! అంటూ తన ఫోన్లోని ఆంజనేయుడి ఫోటో చూపాడు మరో భక్తుడు.
ఆ ఫోటోను నారదుడు, ఆంజనేయుడు చాలా సేపు చూశారు
ఇంతకూ ఇది నా చిత్రమేనా, రాక్షసుల మీద యుద్ధం చేసే సమయంలో కూడా ఇంత క్రూరంగా కన్పించలేదు!” అన్నాడు ఆంజనేయుడు.
”అదే నేనూ చెప్పేది! ఇదే ఆంజనేయుడి ఫోటో! ఫోటోలా నీవు లేవు కాబట్టి నీవు ఆంజనేయుడివి కాదు! ఇక వెళ్ళు!” అన్నాడా భక్తుడు.
”ఇది అయోధ్య కదా! మరి రాముడి చిత్రము లేవీ కనబడుట లేదు! మొత్తం ఆ నమో చిత్రాలే కన్పిస్తున్నాయి!” అన్నాడు అనుమానంగాఆంజనేయుడు.
”పిచ్చివాడా! నీవు ఈ దేశ వాసివి కానట్లు ఉన్నావు. రాముడి ఫోటోలు ఇక్కడెందుకు ఉంటాయి. అదిగో ఆ గుడిలో ఉంటాయి! రాముడికి గుడి కట్టిస్తున్నాడు మా నమో! అంటే
రాముడి కన్నా నమోనే గొప్పవాడని తెలుస్తోంది కదా! అందుకే అయోధ్యలోనే కాదు ఈ దేశమంతా నమో ఫోటోలు పెడుతున్నాము! రాముడి గుళ్ళో కూడా రామ్‌లల్లా విగ్రహం, మూడడుగులు, నమో విగ్రహం ఎనిమిది అడుగులు ఉంటాయి. రామ్‌లల్లా ఒక చేతి వేలు నోట్లో వేసుకుని, మరో చేత్తో నమో చేయి పట్టుకుని ఉండేలా డిజైన్ చేస్తున్నాము!” అన్నాడు భక్తులు ముక్తకంఠంతో.
చివరి వాక్యం వింటూనే, ఆంజనేయుడు, నారదుడు కళ్ళు తిరిగి పడిపోయారు!.
– ఉషా కిరణ్