Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంరామా..కనవేమిరా!

రామా..కనవేమిరా!

- Advertisement -

అసలు దోషులను వది లిపెట్టేశారు..
ట్రస్టు విరాళాల వివాదం దర్యాప్తు తీరుపై విమర్శల వెల్లువ
భక్తుల్లో ఆవేదన, ఆగ్రహ జ్వాలలు
నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్‌..అయోధ్యలో తగ్గిన భక్తుల రద్దీ!
మీడియాపై యోగి సర్కారు కొత్త రకం ఆంక్ష‍లు

​లక్నో : యూపీలోని అయోధ్యలో రామ మందిర విరాళాల వివాదం విషయంలో జరుగుతున్న దర్యాప్తుపై అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. రామాలయానికి వస్తున్న భక్తులు సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో అసలు దోషులను తప్పించే చర్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. సంఘ్‌ ఆదేశాల ప్రకారం నడుచుకునే యూపీలోని బీజేపీ ప్రభుత్వం వారి పేర్లు బయటకు రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. సీనియర్‌ జర్నలిస్టు పి. రామన్‌ తన కాలమ్‌లో… ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండానే 12 రోజుల పాటు విచారణ జరగడం అనుమానాస్పదమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయని విమర్శిం చారు. అలాగే…మాజీ కరసేవకుడు సంతోశ్‌ దూబే, కాంగ్రెస్‌ నేత శరద్‌ శుక్లా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఇచ్చిన మూడు ఫిర్యాదులపై తొలుత పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని a విదితమే.

​‘బీజేపీ పేరు మసకబారింది’
సంఘ్‌, బీజేపీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులకు ఈ కేసులో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు రామాలయం పేరుతో గొప్పలు చెప్పుకున్న బీజేపీకీ.. తాజా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. ఆలయ సమీపంలో వ్యాపారం చేస్తున్న కేపీ పాండే మాట్లాడుతూ… ఈ ఘటనతో బీజేపీ పేరు దెబ్బతిందని చెప్పారు. గత వారం రోజులుగా భక్తుల సంఖ్య తగ్గిపోతోందని తెలిపారు. జూన్‌ 26న రామజన్మభూమి పోలీస్‌ స్టేషన్‌లో ఆలయ ట్రస్ట్‌ విరాళాల దుర్వినియోగానికి సంబంధించి ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ వివాదాన్ని ఎలా చూస్తున్నారో తెలుసుకునేందుకు ‘ది వైర్‌’ వారితో మాట్లాడింది.

​​కాంగ్రెస్‌ ‌విమర్శలు
రామాలయ నిధుల అవకతవకల వివాదం ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్‌, సమాజ్‌‌వాదీ పార్టీ (ఎస్పీ) సహా పలు ప్రధాన పార్టీలు సంఘ్‌, బీజేపీ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఈ అంశంపై స్పందించారు. బీజేపీ, సంఘ్‌కు చెందినవారు 43 రోజుల్లో రామాలయాన్ని 70 సార్లు దోచుకుని కొత్త చరిత్ర సృష్టించారని సామాజిక మాధ్యమం వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా సిట్‌ ఇప్పటికే తన ప్రాథమిక నివేదికను యూపీ సర్కారుకు అందించింది. ఇందులో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం… ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 మధ్య 39 రోజుల్లో 70 సార్లు నగదు దుర్వినియోగం జరిగినట్టు సీసీటీవీ విశ్లేషణలో బయటపడినట్టు సిట్‌ ప్రాథమిక నివేదిక చెప్తోంది. ఇటు యూపీలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష‍ం ఎస్పీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. సీఎం యోగీ, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ ‌మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే అయోధ్యను ఆదర్శ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అఖిలేశ్‌ ‌చెప్పారు. విరాళాల వివాదం విషయంలో బీజేపీ, సంఘ్‌ ‌పాత్రను తీవ్రంగా తప్పుబట్టారు.

​మీడియాపై కొత్త ఆంక్షలు
ఇటు మీడియా పైనా యోగి ప్రభుత్వం కొత్త రకం ఆంక్ష‍లు విధించింది. గతనెల 29న భారత్‌ సమాచార్‌ జర్నలిస్టు సందీప్‌ ఖేర్‌ ఆలయ ప్రాంగణంలో రిపోర్టింగ్‌ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చిత్రీకరణ చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసులు ఆయనకు తెలిపారు. దీనిపై సందీప్‌ ఖేర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నిజాలు బయటకు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అని పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. అయితే ఆలయ ప్రవేశ బారీకేడ్ల వెలుపల మాత్రం రిపోర్టింగ్‌కు అనుమతి ఉందని పోలీసులు చెప్పారు. కాగా ‘ది వైర్‌’ ఈ ఆంక్షలు అమల్లోకి రాకముందే జూన్‌ 26, 27 తేదీల్లో ఆలయ ప్రాంగణంలోకి వెళ్లి భక్తులతో మాట్లాడింది.

రాంపథ్‌పై వెలవెలబోతున్న జనసందోహం
రామమందిరానికి వెళ్లే రాంపథ్‌ రహదారి సాధారణంగా భక్తులతో కిక్కిరిసి కనిపించేది. కానీ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని ఆలయ సమీపంలో ప్రసాదం విక్రయించే వ్యాపారులు చెప్తున్నారు. ఒక ప్రసాద విక్రేత మాట్లాడుతూ… ‘‘భక్తుల సంఖ్య కనీసం సగానికి తగ్గింది. ఇంతకుముందు బారీకేడ్ల ఇరువైపులా జనంతో నిండిపోయేది’’ అని తెలిపారు. అయితే స్థానిక పరిపాలనా యంత్రాంగం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో సదరు వ్యక్తి తన పేరు వెల్లడించడానికి నిరాకరించడం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.

మంచి చేయకున్నా..చెడైతే చేయకండి
ఐఐఎం లక్నో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన అధ్యయనం ప్రకారం… 2024 జనవరిలో ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత తొలి ఆరు నెలల్లో 11 కోట్ల మంది అయోధ్యను సందర్శించారు. స్థానిక వ్యాపారుల ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రకారం… 2020లో అయోధ్యకు వచ్చిన భక్తులు 60 లక్షలు కాగా… 2024లో అది16 కోట్లకు చేరుకుంది. అయోధ్యలోని కపాసీ గ్రామానికి చెందిన ఆశాదేవి మాట్లాడుతూ… ‘‘విరాళాల చోరీ గురించి విన్నాను. కానీ పూర్తి వివరాలు తెలియవు. ఆలయానికి మేలు చేయలేకపోతే.. కనీసం చెడు పనులు చేయకండి’’ అని అన్నారు. ఇతరులు భక్తితో ఇచ్చిన డబ్బును తీసుకోవడం మహాపాపమనీ, నిందితులకు కఠిన శిక్ష‍ పడాలని డిమాండ్‌ ‌చేశారు.

విరాళాల లెక్కలు బహిర్గతం చేయాలి
ఆజమ్‌గఢ్‌కు చెందిన ఆదిత్య సింగ్‌ మాట్లాడుతూ… ‘‘దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నిజాలు బయటకు రావాలి’’ అని అన్నారు. ‘‘ఆలయానికి ఎంత బంగారం వచ్చింది? ఎంత నగదు వచ్చింది? మొత్తం లెక్కలు ప్రజలకు వెల్లడించాలి’’ అని ఆయన తెలిపారు. రాముడి ముందు తప్పు చేసినవారు శిక్ష‍ అనుభవిస్తారని అహ్మదాబాద్‌‌కు చెందిన వ్యాపారి పరిన్‌‌భాయ్‌ ‌ధాకడ్‌ అన్నారు. ఆలయానికి వచ్చిన విరాళాల్లో కొంత భాగాన్ని పేదల కోసం కూడా వినియోగించా లని పూణేకు చెందిన సునీతా ప్రతాప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయోధ్యకు చెందిన సోనా దేవీ తాజా వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఆలయానికి వచ్చిన డబ్బు ఆలయానికే ఖర్చు కావాలి. ఎవరు విరాళం ఇచ్చినా రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి. దేవుడి డబ్బు దొంగిలించినవారు ఎవరూ తప్పించుకోలేరు’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న చేపలే అరెస్టయ్యాయి
యూపీలోని సుల్తాన్‌‌పూర్‌‌నకు చెందిన రాజేంద్ర దూబే.. అయోధ్య రామాలయ విరాళాల వివాదం విషయంలో ఇప్పటి వరకు అరెస్టైన వారు చిన్న చేపలేననీ, అసలు మొసళ్లు ఇంకా బయటే ఉన్నాయని ఆరోపించారు. చంపత్‌‌రాయ్‌ ‌రాజీనామా చేసినా.. ఇంకా అరెస్ట్‌ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాగా.. చంపత్‌‌రాయ్‌ ‌రాజీనామాపై తమకు సమాచారం లేదని వీహెచ్‌‌పీ చెప్తుండగా.. ట్రస్ట్‌ ‌మాత్రం చంపత్‌‌రాయ్‌, అనిల్‌ ‌మిశ్రా రాజీనామాలు అందాయని, తదుపరి సమావేశంలో వాటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

​అయోధ్య రామమందిర ట్రస్ట్‌ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు ఆలయ ప్రతిష్ఠనే కాదు, భక్తుల రాకపోకలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆలయానికి వెళ్లే రాంపథ్‌ రహదారిపై ఒకప్పుడు కనిపించిన భారీ రద్దీ ఇప్పుడు సగానికి తగ్గిందని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. భక్తుల్లో చాలామంది ఈ విరాళాల వివాదంపై తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో పారదర్శకత, విరాళాల లెక్కల బహిరంగ ప్రకటన, అసలు సూత్రధారుల అరెస్టు వంటి డిమాండ్లు కూడా భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు యూపీలోని యోగి సర్కారుకు, కేంద్రంలోని ఎన్డీఏకు హెచ్చరికలుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -