Thursday, July 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్కూళ్ల మూసివేత!?

స్కూళ్ల మూసివేత!?

- Advertisement -

ప్రభుత్వ విద్యను రాష్ట్రంలో పరిమితం చేసే అవకాశం కనిపిస్తున్నది. స్కూళ్ల హేతు బద్దీకరణ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను సమీప స్కూళ్లలో విలీనం చేయాలనే ప్రణాళికతో సర్కార్ అడుగులేస్తున్నది! అదే సమయంలో కేంద్రీకృత, సమీకృత ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రయత్నం చేస్తున్నది. స్కూళ్లను తగ్గించడం ద్వారా సర్కారీ విద్యను పున:నిర్మాణం చేస్తామం టున్నది. పిల్లల్లేని వేలాది చిన్న పాఠశాలలను నడిపే కంటే, ఆధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత పాఠశాలలను స్థాపించడంపై దృష్టి పెట్టింది. కొరతను అధిగమించడానికి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా పాఠశాలల నుంచి మిగులు ఉపాధ్యాయులు, సిబ్బందిని , సహాయక పోస్టులను డిమాండ్‌ ఎక్కువగా ఉన్న పాఠశాలల్లోకి సర్దుబాటు చేస్తున్నది. ఇది రాష్ట్ర, జాతీయ విద్యాహక్కు (ఆర్‌‌టీఈ) చట్టానికి వ్యతిరేకం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన పాలకా గణం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల విద్యా వేత్తల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక, మూడు కి.మీ. ప్రాథమికోన్నత, ఐదు కి.మీ.ల్లో ఉన్నత పాఠశాలు ఉండాలి. కొత్త విధానం పేరుతో పాఠశాల లను మూసివేయడం దారుణం.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్‌‌పై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రాధాన్యత ఎంతటిదో అందరికి తెలిసిందే. రేషనలైజేషన్‌ ‌మూలంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో అణగారిన తరగతుల కు విద్య అందదు. అంతేగాక తక్కువ ఆదాయ కుటుంబాలను సరైన ఫీజు నియంత్రణ లేని ఖరీదైన ప్రయివేటు, కార్పొరేట్‌ ‌పాఠశాలలవైపు బలవంతంగా నెట్టడమే అవుతుంది. స్కూళ్ల మూసివేతకు బదులుగా ఉపాధ్యా య ఖాళీలను భర్తీ చేయడం, మౌలిక సదుపాయాలను కల్పించాలి. రాష్టంలోని 28 వేల స్కూళ్లకు గాను నాలుగు వేలకు కుదించాలని ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం ప్రకటించడం గమనార్హం. టీచర్‌ ‌పోస్టుల్నీ రేషనలైజేషన్‌ ‌చేయడం ఒక భాగమైతే, దాని ప్రభావం పేదలను చదువుకు సాంతం దూరం చేయడమే అవుతుంది. ఎందుకంటే అందుబాటులో స్కూల్‌ ‌లేకపోతే బడి మానేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రతియేటా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మి షన్లు తగ్గుతున్నాయి. రెండేండ్లుగా వేల పాఠశాలల్లో ‘జీరో’ అడ్మిషన్లు రావడాన్ని కారణంగా చెబుతూ ఆరుట్ల మోడల్‌‌ను సర్కార్‌ ముందు కు తెచ్చింది. ఆనక స్కూళ్ల సంఖ్యను తగ్గింపునకు శ్రీకారం చుట్టింది. ఇందుకు విద్యా కమిషన్‌ ‌నివేదికను అడ్డం పెట్టుకుంది. ఒక్కో పాఠశాలలో ‌పదిహేను వందల నుంచి రెండు వేల మంది విద్యార్థులు చదవుకునేలా ప్రతి మండలానికి రెండు నుంచి మూడు బడులుంటే చాలనే ఆలోచనతో ముందుకు పోతున్నది.

కాగా ‌‘క్యూర్‌‘ పరిధిలో భారీగా జనాభా పెరుగుతున్నది. అంతేగాక పల్లెల నుంచి పట్టణాలకు, ప్రధానంగా రాజధానికి ఉపాధి కోసం లక్ష‍ల కుటుంబాలు వస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌‌గిరి జిల్లాల్లో నివసించే వారి పిల్లలకు కొత్త స్కూళ్లు పెట్టే ప్రయత్నమే లేదు!? వారంతా ప్రయివేటుకు వెళ్లాల్సిన పరిస్థితి సర్కారే కల్పిస్తున్నది. ఇది ప్రయివేటును ప్రోత్సహించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడమే అవుతుంది.
విద్యకు చేసే ఖర్చును పెట్టుబడిగా మాత్రమే చూస్తానన్న సీఎం, ప్రయివేటు, కార్పొరేట్‌ ‌స్కూళ్లకు దన్నుగా నిలవడం విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చడమే తప్ప వేరేకాదు. నాణ్యమైన విద్య కోసం ఉన్నవాటితో పాటు కొత్త స్కూళ్లు తేరవాలి. పంచాయతీకి ఒక స్కూల్‌ ఉండాలి. లేకపోతే డ్రాపౌట్లు అడ్డగోలుగా పెరుగుతాయి. భారీ స్కూళ్లకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత నిర్వహించలేక ప్రయివేటుకు అప్పగించే ప్రమాదం పొంచిఉందని విద్యానిపుణుల అభిప్రాయం. ప్రభుత్వ విద్యను ఉద్దరించడమంటే ఎన్‌‌జీవోలకు ధారాదత్తం చేయడం కాదు.

విద్యా సంస్కరణలు ఆడంబరం కాకూడదు. మార్పునకు నాంది కావాలి. ప్రభుత్వ సారథ్యంలో ప్రీప్రైమరీ విధానం తేవాలి. లేకపోతే ఎన్ని బడిబాటలు చేసినా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగవు. నాణ్యమైన విద్య కావాలంటే క్లాస్‌తో పాటు సబ్జెక్టు టీచర్లను నియమించాలి. పటిష్టంగా పర్యవేక్ష‍ించాలి. ఉపాధ్యాయులూ బాధ్యతగా మెలగాలి. రాష్ట్రంలో ఇరవైయేండ్లుగా డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదు. కొఠారి కమిషన్‌ ‌నివేదిక ప్రకారం విద్యకు బడ్జెట్‌‌లో 30 శాతం నిధులు కేటాయించాలి. గత రెండేండ్లుగా కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోలో చెప్పిన మేరకు పదిహేను శాతం కూడా ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం ఎనిమిది శాతమే. పద్దెనిమిది శాతం కేటాయించాలని విద్యా కమిషన్‌ సైతం సూచించింది. నిధుల్వికుండా ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు విజయవంతం అసాధ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -