భారత్‌కు అమెరికా సమగ్ర ప్రతిపాదనలు
శాంతి ముసాయిదా నియమ నిబంధనలకు పాతర
దేశంలోని ప్రభుత్వరంగంలో ఉన్న సంస్థల్ని హోల్ సేల్ గా ప్రయివేటుకు కట్టబెట్టడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయివేటు వ్యాపారానికి మరిన్ని అప్పగించేలా ట్రంప్ సర్కార్ సమగ్ర ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్ కోకాపేటలో ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే…మరోవైపు దేశానికే కీలకమైన అణుశక్తి రంగంలోకి కార్పోరేట్లు చొరబడేలా అమెరికా రూట్ మ్యాప్ ను ఖరారు చేసింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
న్యూఢిల్లీ : అణుశక్తి రంగంలో ప్రయివేట్ భాగస్వామ్యానికి అనుమతిస్తూ తెచ్చిన శాంతి చట్టం అమలుకు సంబంధించిన ముసాయిదా నియమ నిబంధనలపై అమెరికా అణు పరిశ్రమ భారత్‌కు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించనుంది. గత వారం ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ (శాంతి) చట్ట ముసాయిదా నియమ నిబంధనలను విడుదల చేసింది. దీనిపై ఏవైనా సూచనలు, అభిప్రాయాలు ఉంటే సెప్టెంబర్ 4లోగా తెలియజేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ మేరకు ప్రతిపాదనలు పంపించింది.
గుట్టుచప్పుడు కాకుండా డీల్
పౌర అణు రంగంలో అవకాశాలను అన్వేషించడానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధుల బృందానికి యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) నాయకత్వం వహించింది. తాజాగా అదే బృందం గురువారం భారతదేశంలోని న్యాయ నిపుణులు, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌తో చర్చలు జరిపింది. ఇటీవల విడుదలైన శాంతి ముసాయిదా నియమ నిబంధనలపై యూఎస్ఐఎస్‌పీఎఫ్ తన అణు పరిశ్రమ కమిటీ కోసం ఒక వర్చువల్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఢిల్లీకి చెందిన పీఎల్ ఆర్ ఛాంబర్స్‌కు చెందిన సుహాన్ ముఖర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌లో జాతీయ భద్రత, అంతర్జాతీయ కార్యక్రమాల సీనియర్ డైరెక్టర్ టెడ్ జోన్స్ వంటి నిపుణులు ఈ వర్చువల్ సమావేశంలో ప్రసంగించారని అది తెలిపింది.
అడ్డదారిలో…
“సెప్టెంబర్ 4వ తేదీ గడువులోగా భారత అణుశక్తి విభాగానికి ( డీఏఎఫ్) ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించేందుకు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ సమన్వయం చేస్తోంది. ఈ వర్చువల్ సమావేశంలో న్యూక్లియర్ సప్లై చైన్లోని వివిధ రంగాలకు చెందిన పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ఇందులో ముసాయిదా శాంతి నియమాలు, కీలక నిబంధనలు- పరిశ్రమకు వాటి అర్థం ఏమిటి? ప్రయివేట్ రంగ ప్రవేశం, లైసెన్సింగ్, బాధ్యత, ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభావాలు, పరిశ్రమ దృష్టి సారించాల్సిన రంగాలు, ప్రభుత్వానికి అందించే అభిప్రాయాలు వంటి అంశాలపై చర్చించారు.” అని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.
ప్రయివేటు వైపే మోడీ చూపు
ఇప్పటివరకు భారత పౌర అణుఇంధన రంగం అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఇకపై ప్రభుత్వ – ప్రయివేటు భాగస్వామ్యంలో ఆ రంగంలో పనిచేయొచ్చు. ఇకపై న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్లో భారతీయ ప్రయివేటు కంపెనీలు 49 శాతం దాకా వాటాలను కలిగి ఉండొచ్చు. ఇందుకోసం 2025 డిసెంబరులో శాంతి చట్టానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2010 నాటి అణు విద్యుత్ బాధ్యత పౌర బాధ్యత చట్టం స్థానంలో వచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతి ) చట్టం ప్రయివేట్ కంపెనీలను పౌర అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడం, సొంతం చేసుకోవడం, నిర్వహించడం, అణు పరిశోధన, అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రయివేట్ సంస్థలను అణు ఇంధనాన్ని తయారు చేయడానికి, వైద్యం, వ్యవసాయం, ఇతర పరిశ్రమల్లో విద్యుత్ ఉత్పత్తియేతర పనుల కోసం అయనీకరణ వికిరణాన్ని ఉపయోగించడానికి కూడా అనుమతిస్తుంది. ఇది దేశ ప్రజలపై మరింత భారంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాంతి చట్టంలో సప్లయర్ లయబిలిటీ క్లాజ్ తొలగింపు
2033 నాటికి 300 మెగావాట్లు, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన స్వదేశీ టెక్నాలజీతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను నిర్మించడానికి 2025-2026 కేంద్ర బడ్జెట్‌లో రూ.20వేల కోట్లను కేటాయించారు. 2033కల్లా కనీసం 5 స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను నిర్మించాలనే టార్గెట్‌తో భారత్ ఉంది. శాంతి చట్టం ద్వారా సప్లయర్ లయబిలిటీ అనే క్లాజ్‌ను తొలగించారు. దీంతో అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్, ఫ్రాన్స్‌కు చెందిన ఈడీఎఫ్, రష్యాకు చెందిన రొసాతోమ్ కంపెనీలతో గతంలో కుదిరిన ఒప్పందాల పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ట్రంప్ ముందు సాగిలపడుతున్నది. తాజాగా అణుశక్తి రంగంలో అమెరికా సూచించినట్టు కనుక..ప్రయివేట్ భాగస్వామ్యం కల్పిస్తే
దేశ భవిష్యత్ అమెరికా చేతిలో రిమోట్ గా మారటం ఖాయమని అణురంగ విశ్లేషకులు పేర్కోంటున్నారు.
ప్రయివేట్‌కు అణుశక్తి రంగం
- Advertisement -
- Advertisement -



