Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: టీజీ ఈజేఏసీ

పెండింగ్ డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: టీజీ ఈజేఏసీ

- Advertisement -

ఆగస్టు 27న నారాయణపేట జిల్లా కేంద్రంలో ధర్నా
నవతెలంగాణ-మక్తల్

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ (టీజీ ఈజేఏసీ) భాగస్వామ్య సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 27న నారాయణపేట జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్కు (మున్సిపల్ పార్కు) వద్ద ఉదయం 10 గంటల నుంచి భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

మక్తల్ పట్టణంలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో టీజీ ఈజేఏసీ భాగస్వామ్య సంఘాలు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జేఏసీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేసి, వేతన సవరణ సంఘం నివేదికను ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా 317 జీవో సమస్యను పరిష్కరించి, శాశ్వత పరిష్కారం చూపాలని, విద్యాశాఖలోని 25వ జీవోను సవరించి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్ 1కు ముందు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడిన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని నాయకులు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వాయిదా పడిన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని, ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

ఆగస్టు 27న నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాకు జిల్లాలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు బాధ్యతగా హాజరై విజయవంతం చేయాలని టీఎన్‌జీఓ మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులు మున్వార్ అలీతో పాటు జేఏసీలోని భాగస్వామ్య సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ధర్నాను విజయవంతం చేసేందుకు ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడిని కార్యక్రమానికి తరలించేలా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ అదనపు ప్రధాన కార్యదర్శి వై. జనార్దన్ రెడ్డి, కో-చైర్మన్లు వెంకటస్వామి, సూర్యచంద్ర, రామ్‌గోపాల్, శ్రీనివాస్, దామోదర్, హైమావతి మునెప్ప, జయశ్రీ, అశోక్, వెంకటేష్, శ్రీధర్ కుమార్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.అలాగే పరంధాములు శ్రీ విద్య తిమ్మప్ప, బాబు, భాస్కర్ సుజాత సులోచన యాదగిరి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -