Sunday, August 23, 2026
E-PAPER
Homeసోపతిపాలు ఎందుకు పొంగుతాయి?

పాలు ఎందుకు పొంగుతాయి?

- Advertisement -

మీకు తెలుసా?

నిత్య జీవితంలో మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. వాటిని మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ వాటి వెనుక దాగి ఉన్న అసలు కారణాలను పెద్దగా పట్టించుకోం. అలాంటి వాటిలో పాలు పొంగడం కూడా ఒకటి. ఎప్పుడైనా ఇంట్లో పాలు వేడి చేస్తుంటే గమనించారా? మనం స్టవ్‌ దగ్గరే ఉన్నా సరే, కాస్త పక్కకు తిరిగి ఇటు చూసేలోపు క్షణంలో పొంగిపోతుంటాయి కదా! అదే నీళ్ల విషయానికొస్తే ఎంత మరిగించినా, బుడగలు వస్తూ మరుగుతాయే తప్ప అస్సలు పొంగవు. అయితే చాలా మందికి పాలు మాత్రమే ఎందుకు పొంగిపోతాయి? నీళ్లేందుకు పొంగవు? అనే సందేహం వస్తుంటుంది. మీకూ ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్‌ వచ్చే ఉంటుంది కదా! ఇంతకీ పాలు మరిగిస్తే వెంటనే పొంగడం, నీళ్లు ఎంత మరిగించినా పొంగకపోవడం వెనుక దాగి ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం..

నార్మల్‌గా పాలలో 13శాతం వరకు ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, మినరల్స్‌, లాక్టోజ్‌ అనే చక్కెర పదార్థాలుంటాయి. అందులో ఉండే 87శాతం నీటిలో అవన్నీ సమంగా కలిసిపోతాయి. అయితే పాలు వేడి చేస్తున్నప్పుడు అందులోని రసాయన నిర్మాణం మెల్లగా మారడం మొదలవుతుందంటున్నారు నిపుణులు. పాలలో తేలియాడే కొవ్వులు, ప్రోటీన్లు పైభాగానికి చేరి ఒక సన్నని పొర వంటిది ఏర్పడుతుంది. మనం దాన్నే ‘మీగడ’ అని అంటుంటాం. దాని కింద పాలు ఇంకా వేడెక్కుతున్నప్పుడు, అందులోని నీటి ఆవిరి పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుందంటున్నారు. కానీ అప్పటికే పాల పైభాగంలో ఏర్పడిన మీగడ పొర అనేది దాన్ని ఆపేస్తుంది. దాంతో వాటి మధ్య ఒత్తిడి జరుగుతుందంటున్నారు. పాల నుంచి వచ్చే ఆవిరి మీగడను మీదకు నెట్టే కొద్దీ, గిన్నె అడుగు భాగంలో బుడగలు ఏర్పడతాయి. అప్పుడు ఒత్తిడి మరింత పెరిగి, పాలు పొంగిపోతాయని చెబుతున్నారు నిపుణులు.

ఇక నీళ్లు ఎంత మరిగించినా ఎందుకు పొంగిపోవంటే.. నీటిలో కొవ్వులు, ప్రొటీన్లు అనేవి ఉండవు. కాబట్టి నీళ్లను వేడి చేస్తున్నప్పుడు వాటి ఉపరితలం మీద ఎలాంటి పొరలు ఏర్పడవు. దాంతో నీళ్లు మరుగుతున్నప్పుడు వచ్చే ఆవిరి, ఏ అడ్డంకులు లేకుండా పైకి నేరుగా వెళ్లిపోతుంది. నీరు వేడి చేస్తున్నప్పుడు గిన్నె అడుగు భాగంలో బుడగలు ఏర్పడినప్పటికీ, పైకి రాగానే పగిలిపోయి ఆవిరిలో కలుస్తాయని చెబుతున్నారు నిపుణులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -