Sunday, August 23, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కొంచెం అవగాహన... మరికొంచెం శ్రద్ధ...

కొంచెం అవగాహన… మరికొంచెం శ్రద్ధ…

- Advertisement -

వర్షం అంటే మనకు చల్లదనం.. పచ్చదనం.. ఆనందం. కానీ ఇదే వర్షాకాలం కొన్ని వ్యాధులకు కూడా అనుకూలమైన కాలం. ఇంటి చుట్టూ నిలిచే నీరు దోమలకు ఆవాసంగా మారుతుంది. కలుషితమైన నీరు, సరిగా నిల్వ చేయని ఆహారం కడుపు సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. తడిగా ఉండే వాతావరణం చర్మవ్యాధులు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. రోడ్లపై నిలిచిన మురుగునీటిలో నడవడం వల్ల చర్మం, పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే కేవలం జ్వరం వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కాదు. వ్యాధి రాకముందే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం.

వర్షాలు పడిన తర్వాత వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. నీరు నిలిచిపోవడం, తేమ పెరగడం, దోమలు పెరగడం, తాగునీరు కలుషితం కావడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటి పరిసరాల్లో చిన్న పాత్రలో నిలిచిన నీరు కూడా దోమల పెరుగుదలకు కారణం కావచ్చు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తి చేసే Aవసవర దోమలు పెద్ద నీటి గుంతల కంటే చిన్నచిన్న నీటి నిల్వల్లో కూడా పెరుగుతాయి. అందుకే దోమల నియంత్రణకు కేవలం ఇంట్లో దోమల మందు కొట్టడం సరిపోదు. దోమలు పెరిగే ప్రదేశాలను తొలగించడం మరింత ముఖ్యమైనది.

జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దు : వర్షాకాలంలో జ్వరం రావడం సాధారణమే అని చాలామంది భావిస్తారు. కానీ ప్రతి జ్వరాన్ని ఒకే విధంగా చూడకూడదు.
డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు కూడా జ్వరంతోనే ప్రారంభమవుతాయి. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా యాంటీబయాటిక్స్‌ లేదా ఇతర మందులు ప్రారంభించడం మంచిది కాదు. డెంగ్యూ అనుమానం ఉన్నప్పుడు రక్తస్రావం వంటి లక్షణాలను ప్రత్యేకంగా గమనించాలి. చిగుళ్ల నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తస్రావం, వాంతుల్లో లేదా మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.
దోమలపై యుద్ధం ఇంటి నుంచే మొదలు కావాలి దోమలను తగ్గించడానికి ప్రతి కుటుంబం వారానికి కనీసం ఒకసారి ఇంటి పరిసరాలను పరిశీలించాలి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు: బ కూలర్‌లో నీరు నిల్వ ఉండనివ్వకండి,
– పూల కుండీల కింద ఉండే ప్లేట్లలో నీరు నిలవకుండా చూడండి,
– పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, బకెట్లు వంటి వాటిని బయట పడేయకండి,
– నీటి ట్యాంకులు, డ్రమ్ములు, బిందెలను మూతపెట్టి ఉంచండి,
– ఇంటి చుట్టూ నీటి గుంతలు ఉంటే వాటిని తొలగించండి,
– అవసరమైనప్పుడు దోమతెరలు, కిటికీ జాలీలు, దోమల నివారణ పద్ధతులను ఉపయోగించండి,
– ఒక చిన్న నీటి నిల్వను తొలగించడం కూడా దోమలు పుట్టకుండా అడ్డుకోవచ్చు.



తాగునీరు.. ఆరోగ్యానికి మొదటి రక్షణ
వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా పైపులైన్లు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో కలుషిత నీరు తాగునీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అందుకే సురక్షితమైన నీటినే తాగాలి. ఇంట్లో నీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేయాలి. నీటిని తీసుకునేటప్పుడు చేతులు నేరుగా నీటిలో పెట్టకుండా గ్లాసు లేదా గరిటె ఉపయోగించాలి. కలుషితమైన నీటి ద్వారా అతిసారం, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ A, హెపటైటిస్‌ జు వంటి వ్యాధులు వ్యాపించవచ్చు.

విరేచనాలు వస్తే మొదటి జాగ్రత్త ఏమిటి?
విరేచనాలు వచ్చినప్పుడు చాలామంది మొదట ఆహారం పూర్తిగా మానేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రధాన ప్రమాదం శరీరంలో నీరు, లవణాలు తగ్గిపోవడం. అందువల్ల తగినంత ద్రవాలు తీసుకోవాలి. అవసరమైనప్పుడు ఉ=ూ ఉపయోగించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనంగా ఉన్నవారిలో నీరసం త్వరగా ఏర్పడవచ్చు. కళ్లు లోపలికి వెళ్లడం, నోరు ఎండిపోవడం, మూత్రం బాగా తగ్గడం, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
బయట తినే ఆహారంలో మరింత జాగ్రత్త : వర్షాకాలంలో ఆహారం త్వరగా కలుషితం కావచ్చు. రోడ్డు పక్కన ఎక్కువసేపు ఉంచిన ఆహారం, కోసి పెట్టిన పండ్లు, పరిశుభ్రతపై నమ్మకం లేని చోట తయారైన ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. వేడి వేడిగా, తాజాగా తయారైన ఆహారం తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి ఉపయోగించాలి. వండే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకుండా సరైన విధంగా భద్రపరచాలి.

చేతులు కడుక్కోవడం : ఇది చిన్న అలవాటే.. కానీ పెద్ద రక్షణ ఇస్తుంది. సబ్బుతో చేతులు కడుక్కోవడం అనేది వర్షాకాలంలో మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ ముఖ్యమే. ముఖ్యంగా భోజనం ముందు, వంట చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, పిల్లలకు ఆహారం పెట్టే ముందు, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మన చేతులు మనకు తెలియకుండానే అనేక సూక్ష్మజీవులను నోటికి తీసుకెళ్లే మార్గంగా మారవచ్చు.
పాదాలను తడిగా ఉంచవద్దు : వర్షాకాలంలో ఎక్కువసేపు తడి చెప్పులు లేదా సాక్స్‌ వేసుకోవడం వల్ల పాదాల మధ్య ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. పాదాలను కడిగిన తర్వాత బాగా తుడిచి పొడిగా ఉంచాలి. తడిసిన సాక్స్‌ వెంటనే మార్చాలి. పాదాల మధ్య దురద, ఎర్రదనం, పొట్టు ఊడటం, పగుళ్లు వంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి.

మురుగునీటిలో వద్దు… : వర్షం తర్వాత రోడ్లపై నిలిచే నీరు బయటకు చూస్తే సాధారణ నీటిలానే కనిపించవచ్చు. కానీ అందులో మురుగు, చెత్త, సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. పాదాలకు చిన్న గాయం ఉన్నా ఆ నీటిలో నడవడం వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అనివార్యంగా మురుగునీటిలో నడవాల్సి వస్తే, ఇంటికి వచ్చిన వెంటనే పాదాలను సబ్బుతో శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి. గాయం ఉంటే మరింత జాగ్రత్త అవసరం.
చర్మం కూడా జాగ్రత్త కోరుతుంది : వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. చెమట, తేమ ఎక్కువసేపు చర్మంపై ఉండటం వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చర్మం మడతలు, చంకలు, తొడల మధ్య భాగం, పాదాల మధ్య ప్రాంతాల్లో తేమ నిలవకుండా చూసుకోవాలి. దురద లేదా ఎర్రటి మచ్చలు వచ్చాయని వెంటనే ఏదో ఒక క్రీమ్‌ కొనుక్కొని రాసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా స్టెరాయిడ్‌ కలిగిన క్రీములను వైద్యుడి సలహా లేకుండా ఉపయోగించడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ
వర్షాకాలంలో పిల్లలు నీటిలో ఆడుకోవడం, తడి బట్టలతో ఎక్కువసేపు ఉండడం సాధారణం. వర్షంలో తడిసిన తర్వాత తడి బట్టలు మార్చాలి. శరీరాన్ని తుడుచుకోవాలి. పాదాలను శుభ్రంగా ఉంచాలి. పిల్లలకు సురక్షితమైన నీరు మాత్రమే ఇవ్వాలి. పాఠశాలకు పంపే ఆహారం శుభ్రంగా, తాజాగా ఉండేలా చూడాలి. జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం వంటి లక్షణాలు వస్తే పాఠశాలకు పంపకుండా విశ్రాంతి ఇవ్వాలి, అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి.

వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్త: వృద్ధుల్లో జ్వరం లేదా ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు నీరసం త్వరగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉన్నా లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే ఆకలి తగ్గడం, అసాధారణ నీరసం, తల తిరగడం, గందరగోళం, మూత్రం తగ్గడం వంటి మార్పులను కుటుంబ సభ్యులు గమనించాలి. వర్షాకాలంలో నేల జారే అవకాశం కూడా ఎక్కువ. ఇంట్లో బాత్రూమ్‌, మెట్లు, ప్రవేశ ద్వారం వద్ద జారిపడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

విద్యుత్‌ ప్రమాదాలు కూడా…
వర్షాకాల ఆరోగ్యం అంటే కేవలం వ్యాధుల గురించి మాత్రమే కాదు. వర్షం పడినప్పుడు నీటిలో పడిపోయిన విద్యుత్‌ తీగల దగ్గరకు వెళ్లకండి. తడిచిన చేతులతో విద్యుత్‌ పరికరాలను తాకకండి. నీరు చేరిన ప్రాంతాల్లో పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వకండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు.
ఇవి చేయండి :
– సురక్షితమైన నీరు తాగాలి, బ చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి,
– ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూడాలి,
– దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలి,
– తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి,
– పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచాలి,
– జ్వరం వచ్చినప్పుడు అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి

ఇవి చేయొద్దు
నిల్వ నీటిని నిర్లక్ష్యం చేయకూడదు, కలుషితమైన నీరు తాగకూడదు, ఎక్కువ సేపు బయట ఉంచిన ఆహారం తినకూడదు, మురుగునీటిలో అవసరం లేకుండా నడవకూడదు, జ్వరం వచ్చిందని స్వయంగా యాంటీబయాటిక్స్‌ వాడకూడదు
వైద్యుడి సలహా లేకుండా స్టెరాయిడ్‌ క్రీములు ఉపయోగించకూడదు, తీవ్రమైన లక్షణాలను ఇంట్లోనే చికిత్స చేసుకుంటూ ఆలస్యం చేయకూడదు
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? : అధిక లేదా తగ్గకుండా ఉండే జ్వరం, తీవ్రమైన తలనొప్పి లేదా ఒళ్లునొప్పులు, పదేపదే వాంతులు, తీవ్రమైన విరేచనాలు, తినలేకపోవడం, తాగలేకపోవడం, తీవ్రమైన నీరసం, మూత్రం బాగా తగ్గడం,బ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం
వాంతులు లేదా మలంలో రక్తం
స్పహలో మార్పులు లేదా తీవ్రమైన మగత
ఒక కుటుంబం.. ఒక చిన్న ఆరోగ్య తనిఖీ
వారానికి ఒకసారి ఇంటి చుట్టూ ఐదు నిమిషాలు తిరిగి చూడండి.
ఎక్కడైనా నీరు నిలిచిందా?
దోమలు పెరిగే అవకాశం ఉందా?
తాగునీటి పాత్ర మూతపెట్టి ఉందా?
ఆహారం సురక్షితంగా నిల్వ చేశామా?
కూలర్‌, పూలకుండీలు, టైర్లలో నీరు ఉందా?
ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చూసుకోవడం కూడా వర్షాకాల వ్యాధుల నివారణలో ఒక మంచి అలవాటు.
చివరగా… + వర్షాన్ని ఆపలేం. కానీ వర్షం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను మాత్రం ముందస్తు జాగ్రత్తలతో తగ్గించవచ్చు. దోమలు పుట్టకుండా చూడటం మన చేతుల్లోనే ఉంది. సురక్షితమైన నీరు తాగడం మన చేతుల్లోనే ఉంది. ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన చేతుల్లోనే ఉంది. చేతులు కడుక్కోవడం మన చేతుల్లోనే ఉంది. జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం కూడా మన చేతుల్లోనే ఉంది. వర్షాకాలం వ్యాధుల కాలం కావాల్సిన అవసరం లేదు. కొంచెం అవగాహన.. మరికొంచెం శ్రద్ధ.. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండేందుకు ఇవే పెద్ద రక్షణ.

డా|| యం. రమాదేవి
ప్రొఫెసర్‌ డ హెడ్‌, ఫిజియాలజీ
గాంధీ మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -