1977 ఆగస్టు 22… అంటే సరిగ్గా 50 ఏళ్ల నాటి మాట. బొంబాయిలోని ఓ స్మశాన వాటికలోకి తోపుడు బండిపై ఒక శవాన్ని తోసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ శవం ఎవరో ఒక అనామక వ్యక్తిది కాదు. 1960ల్లో హిందీ సినీ పరిశ్రమలో ఒక్క సినిమాకు మూడు లక్షల పారితోషికం తీసుకున్న హీరోయిన్ పార్థివ దేహం అది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతిచే పురస్కారం అందుకుని, ఖరీదైన కార్లు, మేడలు, విలాసవంతమైన జీవితాన్ని, వైభోగాన్ని అనుభవించిన ఆ నటి ఆఖరి శ్వాస విడిచిన తర్వాత భుజాలపై మోసపోవడానికి నలుగురు మనుషులు కూడా లేని దయనీయ స్థితిలో జీవితాన్ని చాలించింది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసుకోవాలంటే 60 ఏళ్ల వెనక్కి వెళ్లాలి.
బి.ఆర్. చోప్రా దర్శకత్వంలో రాజ్ కుమార్, సునీల్ దత్ నటించిన ‘హమ్రాజ్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆ హీరోయిన్ అద్భుతమైన భవిష్యత్తుతో వేగంగా దూసుకుపోయింది. కానీ దాదాపు అదే వేగంగా ఆమె కెరీర్ పతనమైంది. దాంతో ఆమె జీవితంలో అపారమైన విషాదాన్ని చవిచూసి చాలా చిన్న వయసులో మరణించింది. ఆమె పేరు విమీ. సినీ రంగ నిపుణుడు రాజేష్ సుబ్రమణియన్ ప్రకారం జాలీ అనే ఒక మోసపూరిత సినీ బ్రోకర్ ఆమె ప్రియుడిగా నటిస్తూ బలవంతంగా వ్యభిచారంలోకి దింపి ఆమె కెరీర్‌ను, ప్రతిష్టను నాశనం చేశాడు.
విమీ సినిమా రంగ ప్రవేశం ఆశ్చర్యకరంగా జరిగింది. అప్పటివరకు సినీ పరిశ్రమతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. 1943లో జన్మించిన విమీ గాయనిగా శిక్షణ పొందింది. బొంబాయిలోని సోఫియా కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది. బాగా పాడగలిగేది కనుక తరచుగా రేడియో బాంబే కార్యక్రమాలలో పాల్గొనేది. విమీ చక్కని కంఠాన్ని, అందమైన రూపాన్ని చూసిన సంగీత దర్శకుడు రవి బి. ఆర్. చోప్రాకు ఆమెను పరిచయం చేశాడు. బి. ఆర్. చోప్రా ఆమెను చూడగానే తాను తీయబోయే ‘హమ్ రాజ్’ చిత్రానికి హీరోయిన్గా ఎంపిక చేశాడు. ఆమె గురించి ఆమె నటన గురించి ఆయన ఆ కాలపు పత్రికలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో గొప్పగా పేర్కొన్నాడు. చదువు, అద్భుతమైన తెలివి, నటికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్న అరుదైన నటి విమీ అని ఆయన పత్రికల వారితో పేర్కొన్నాడు. నిజానికి ఆయన అంచనాలను ఏమాత్రం తలకిందులు చేయకుండా విమీ హమ్ రాజ్ చిత్రంలో చాలా గొప్పగా నటించింది. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. విమీ రాత్రికి రాత్రే ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాను పొందింది. ‘హమ్రాజ్’ చిత్రంలోని ‘తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో, నా మూహ్ చుపాకే జియో, నిలె గగన్ కే తలే, కిసి పత్థర్కి మూరత్సే’ పాటలు ఈనాటికీ హిందీ సినీ పాటల ప్రేమికులు హంటింగ్ సాంగ్స్‌గా చెప్పుకుంటారు. ఆ ఏడాది జాతీయ అవార్డులలో ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైన హమ్ రాజ్ చిత్రంలో నాయకగా విమీ రాష్ట్రపతిచే జాతీయ పురస్కారం అందుకున్నది.
బి.ఆర్. చోప్రా విమీతో వరుసగా మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కానీ మొదటి చిత్రంతో వచ్చిన స్టార్ డమ్ విమీని దురాశలో ముంచివేసింది. కారణం ఆమెకు బయటి చిత్రాలలో నటించడానికి అవకాశాలు అత్యధిక రిమూరేషన్తో సహా రావడం. దాంతో ఆమె చోప్రా విధించిన నిబంధనలను నెమ్మదిగా ఉల్లంఘించడం మొదలుపెట్టింది. ఒక దశలో బి.ఆర్.చోప్రా తర్వాతి సినిమా షూటింగ్ అవుట్‌డోర్‌లో సిద్ధంగా ఉండగా ఆ షూట్‌కి గైర్హాజరైన విమీ తాను అవుట్ డోర్ షూటింగ్స్‌లో పాల్గొనని చల్లగా చెప్పింది. బి.ఆర్.చోప్రా వంటి స్టార్ డైరెక్టర్ ఆమె నిర్ణయానికి ఆగ్రహించి తక్షణమే తను తీయబోయే సినిమాలలోంచి ఆమెను తొలగిస్తున్నట్టు ప్రకటించాడు. నిజానికి విమీ కోరుకున్నది కూడా అదే. ఆ వెంటనే తనకు బయట చిత్రాల్లో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయని, ఎక్కువ మొత్తంలో పారితోషకం లభిస్తుందని ఆశపడింది. అయితే విమీ అనుకున్నట్లుగా అవకాశాలు రాలేదు. బి.ఆర్.చోప్రా వంటి పెద్ద దర్శకనిర్మాత ఆమెను సినిమాలలోంచి తొలగించాడంటే మిగతా దర్శక నిర్మాతలు ఎవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. వచ్చిన అవకాశాలు కూడా మామూలు సినిమాల జాబితాలోకి వచ్చాయి. అవి కూడా పరాజయం పాలైనవి. బిఆర్ చోప్రా వంటి అగ్ర దర్శకుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో విమీకి తెలిసే లోగానే పరిస్థితంతా అధఃపాతాళంలోకి జారిపోయింది. ఆ తర్వాత ఆమె 1968-71 మధ్యకాలంలో నటించిన ఆబ్రూ, పతంగా, కహీ ఆర్ కహీ పార్, కహానీ హం సబ్ కి, వచన్, ప్రేమి గంగారాం చిత్రాలలో శశి కపూర్, అశోక్ కుమార్‌లతో కలిసి నటించినా ఏవీ విజయం సాధించలేదు.
ఆమె కేవలం ఏడేండ్లలో 10 చిత్రాలలో నటించినప్పటికీ విమీ కెరీర్లో ఒక బాలీవుడ్ మసాలా చిత్రం కంటే ఎక్కువ విషాదాలు ఉన్నాయి. కానీ నటి కావాలనే ఆమె నిర్ణయాన్ని కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెను కుటుంబం నుండి వెలివేశారు. చిత్ర పరిశ్రమలో ఒంటరిగా తన దారిని వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే పాలి హిల్ బంగ్లాలో నివసించేది. తీరిక సమయంలో గోల్ఫ్ ఆడేది. వేగంగా కారు నడపడానికి ఇష్టపడేది.
విమీ కోల్‌కతాకు చెందిన శివ్ అగర్వాల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుందనీ, అయితే విమీ కారణంగా అతని కుటుంబం అతడిని ఆస్తి నుండి బహిష్కరించిందని చెప్తారు. వాస్తవానికి ఆమె సినిమాల్లోకి ప్రవేశించేనాటికే వివాహిత. 1968లో ‘స్టార్ అండ్ స్టైల్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన భర్త తాను నటించడానికి ఒక సినిమాను నిర్మించబోతున్నారని, ‘హుమ్రాజ్’ విజయం తర్వాత తాను ‘రంగీలా’, ‘సందేశ్’, ‘అపాయింట్మెంట్’ అనే మూడు సినిమాలకు సంతకం చేశానని చెప్పింది. చివరికి భర్త శివ్ తనను వదిలి వెళ్ళిపోతాడని ఆమె అప్పుడు ఊహించలేదు.
బి.ఆర్. చోప్రా నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. దాంతో మ్యాగజైన్ ఫొటోషూట్లు, బహిరంగ కార్యక్రమాల ద్వారా జీవనం సాగించింది. చివరికి బికినీ ధరించి ఫొటో షూట్లు కూడా చేసింది. 1971 నాటికి ఆమె పూర్తిగా విస్మరణకు గురై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 1977లో ఆమె మరణించిన తర్వాతే ఆమె పతనానికి సంబంధించిన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె కెరీర్ క్షీణించడం మొదలైనప్పుడు భర్త శివ్ తల్లిదండ్రుల ఒత్తిడితో వారి వివాహ బంధం విచ్ఛిన్నమైందని తెలిసింది. ఆ తర్వాత తన వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుందనే ఆశతో ఆమె ‘జాలీ’ అనే సినిమా పంపిణీదారుతో కలిసి జీవించడం ప్రారంభించింది. అదే ఆమె జీవితంలో పతనానికి కారణమైంది. సినిమాల్లో నటించాలంటే నిర్మాతలతో, దర్శకులతో సన్నిహితంగా ఉండాలని అప్పుడే అవకాశాలు వస్తాయని అతను ఆమెను నమ్మబలికాడు. భర్త దూరమైన తర్వాత విధి లేని పరిస్థితులలో విమీ, జాలి మాటలు నమ్మి ఒక మురికి కూపంలోకి వెళ్లిపోయింది. అయినా సరే ఆమెకు సరైన సినిమా అవకాశాలు రాలేదు. ఆమెతో గడపడానికి ఇష్టపడిన దర్శకనిర్మాతలు సినిమా అవకాశాలు ఇవ్వలేదు.
ఇంతలో ఆమె ఒక వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. కానీ అప్పులు తీర్చడానికి దాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది. విమీకి నటిగా అంత మంచి పేరు లేకపోవడం వల్ల ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. ‘దీనివల్ల మద్యపానానికి బానిసయింది. విమీ ఎవరితోనైతే కలిసి జీవించిందో ఆ పంపిణీదారు ఆమెను బలవంతంగా వ్యభిచార వత్తిలోకి నెట్టారని, కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి అదే ఏకైక మార్గమని నమ్మించారని సినీ నటి తబస్సుమ్ తన టీవీ షోలో పేర్కొన్నది. ‘విమీ మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. విపరీతంగా మద్యం సేవించడం మొదలుపెట్టింది. అదీ చౌక రకం మద్యాన్ని’ అని తబస్సుమ్ పేర్కొన్నది. 1977 ఆగస్టు 22న కాలేయ సంబంధిత వ్యాధితో నానావతి ఆసుపత్రిలో ఆమె మరణించింది. చివరి వరకు తోడుగా ఉన్న జాలీ ఆమె మతదేహాన్ని ఒక తోపుడు బండి (థేలా)పై శ్మశానవాటికకు తరలించాడు. ఆమె అంత్యక్రియలకు సినీ పరిశ్రమ నుండి ఎవరూ హాజరు కాలేదు. అయితే సునీల్ దత్ ఒక్కడు మాత్రం అక్కడ ఉన్నారని చెప్పుకుంటారు.
మరణానంతరం కూడా విమీకి అవమానాలు తప్పలేదు. కృష్ణ అనే వ్యక్తి తాను ఆమె ‘స్నేహితుడిని’ అని చెప్పుకుంటూ, ‘ఆనంద్ బజార్ పత్రిక’లో ఆమె గురించి బాధాకరమైన నివాళి వ్యాసాన్ని రాశారు. విమీ మరణాన్ని ఆమెకు ‘గొప్ప ఉపశమనం’గా ఆయన అభివర్ణించాడు. ‘ఏదో ఒక నిర్మాతనో, దర్శకుడో, లేదా నటుడో తనకు అవకాశం ఇస్తారనే ఆశతో భర్త లేకుండా బయట తిరిగే చంచలమైన చూపులు కలిగిన అమ్మాయి’ అని ఆమెను పేర్కొన్నాడు. ఎవరూ తోడు లేని ఒక ఒంటరి మహిళగా తన కడుపు నింపుకోవడానికి పెద్ద పెద్ద హోటళ్లలో దిగిన ధనవంతుల వద్దకు వెళ్లి ఆమె రాత్రిళ్ళు గడిపేది. ఈ అంశాలు రాయడానికి హదయాన్ని కలచివేసేవిగా ఉన్నా, బొంబాయి సినీ పరిశ్రమలో ఆ తరం సినిమా జర్నలిస్టులు విమీ గురించిన విషయాలను కథలుగా చెప్పుకుంటారు.
తన చిన్నపాటి కెరీర్లో విమీ అశోక్ కుమార్‌తో కలిసి ‘ఆబ్రూ’ చిత్రంలోనూ, పృథ్వీరాజ్ కపూర్, ఐ.ఎస్. జోహార్ నటించిన ‘నానక్ నామ్ జహాజ్ హై’ చిత్రంలోనూ నటించింది. జయా భాదురి నటించిన ‘గుడ్డి’లో ఆమె అతిథి పాత్రలో కనిపించింది. ధర్మేంద్ర, శశి కపూర్ నటించిన సుభాష్ ఘారు చిత్రం ‘క్రోధి’ ఆమె చివరి చిత్రం. ఇది ఆమె మరణించిన చాలా ఏళ్ల తర్వాత విడుదలైంది. విమీ నటించిన ‘ఆబ్రూ’ చిత్రంలో ముఖేష్ పాడిన ఒక పాట ఉంది. అది ‘జిన్హే హమ్ భూల్నా చాహే వొ అక్సర్ యాద్ ఆతే హై’ (మనము ఎవరినైతే మరచిపోవాలని అనుకుంటామో వాళ్లే తరచూ గుర్తుకు వస్తుంటారు) అని. కానీ బాలీవుడ్ విమీనీ ఎప్పుడో మర్చిపోయింది.
(విమీకి నివాళి)
హెచ్.రమేష్ బాబు,
7780736386


