ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, సీఎంవో ప్రజావాణి ఇంచార్జి డా. జీ. చిన్నారెడ్డి
నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ, సిద్దిపేట ప్రాంతానికి వన్నె తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీ రమణారెడ్డి అని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, సీఎంవో ప్రజావాణి ఇంచార్జి డా. జీ. చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఉద్యమ శిల్పి ఎంవీ రమణారెడ్డి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంవీ రమణా రెడ్డి మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీ. చిన్నారెడ్డి మాట్లాడుతూ..ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ సిద్దిపేట అన్నారు. రచయిత నందిని సిధారెడ్డి, శిల్పి రమణారెడ్డి పుట్టిన గొప్ప నేల సిద్దిపేట అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్న ఉద్యమ కారుడు ఎంవీ రమణారెడ్డి అని కొనియాడారు. తెలంగాణ తల్లి, అమర వీరుల జ్యోతి శిల్పాలను రూపొందించి తెలంగాణ ప్రజల గుండెల్లో రమణారెడ్డి స్థానం పొందారని అన్నారు. సెక్రటేరియట్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చక్కగా రూపొందించారని తెలిపారు. ఎంవీ రమణారెడ్డి పద్మశ్రీ అవార్డుకు అర్హుడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని తెలిపారు. అదే విధంగా ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా ఎంవీ రమణారెడ్డికి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శిల్పకారుడు ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ… ఎఐ సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాదన్నారు. సిద్దిపేట ప్రాంతం జీవితానికి, కళకు పునాది వేసింది అన్నారు. ఈ సందర్భంగా కాపు రాజయ్యను గుర్తు చేసుకొని ఎంవీ రమణారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి జనార్దన్‌రెడ్డి, రిటైర్డ్ జడ్జి మంగారి రాజేందర్ జింబో, అరుణారెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ రవీందర్, సీనియర్ పాత్రికేయులు కొమురవెళ్లి అంజన్న తదితరులు పాల్గొన్నారు.



