నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని అజ్జలపురం గ్రామంలో ఆదివారం గ్రామస్తులు “శ్రమదానం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని మురికి కాలువలలో వాటర్, చెత్త పేరుకుపోయి దుర్వాసన వచ్చి ఈగలు, దోమలు వాలి గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా డ్రైనేజ్ మోరీల వద్ద కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లటం లేదని, సిసి రోడ్లు ఊడ్చకపోవడంతో వాటిపైన మట్టి పేరుకు పోయిందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఇండ్లలోకి పాములు, తేళ్లు వస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
కనీసం మూగజీవుల దాహార్తి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులను కూడా శుభ్రం చేసి నీళ్లు నింపటం లేదన్నారు. గ్రామ సంబంధిత ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనేకమార్లు గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరినా స్పందించకపోవడంతో తామే స్వచ్చందంగా గ్రామంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మెగావత్ చందు నాయక్, మెగావత్ లాలు నాయక్, పీరు వెంకట్ రెడ్డి, కృష్ణ, ముద్దం వేంకటయ్య, అనంత రెడ్డి, రాములు, సాయిరెడ్డి, సైదులు, పెంటయ్య, సత్తయ్య, శ్రీశైలం, జగన్, రాజేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



