నవతెలంగాణ – చండూర్
గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందని, వెంటనే పూర్తి చేయాలని చండూరు మాజీ జెడ్పీటీసీ వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వెంకటేశం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకం కింద గట్టుప్పల్ లోని శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూల్చివేసి, నూతన భవన నిర్మాణానికి కాంట్రాక్టుకు ఇచ్చారనీ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఊరు-మన బడి పథకాన్ని రద్దు చేయడంతో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయని అన్నారు. దీంతో విద్యార్థుల చదువు కూడా మధ్యలోనే ఆగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడు అకాడమిక్ సంవత్సరాలుగా విద్యార్థుల తరగతులు ఆరుబయట, లేదా జడ్పీ ఉన్నత పాఠశాలలోని అరకొర గదుల్లోనే విద్యాభ్యాసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. తక్షణమే స్థానిక నాయకులతో పాటు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ తరపున ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, వార్డ్ మెంబర్లు పున్న కిషోర్, గోరిగె సత్తయ్య, నారని జగన్, పున్న ఆనంద్, జూలూరు పురుషోత్తం, చిలుకూరి అంజయ్య, తిరందాసు ఆనంద్, కర్నాటి వెంకటేశం, పగిళ్ల హనుమంతు, ఈశ్వర్ అప్ప, కర్నాటి అబ్బయ్య, కూరుపాటి వెంకటేశం, చేరిపిల్లి నగేష్, నీలాంటి వెంకటేశం , గోరిగె శంకర్,తదితరులు పాల్గొన్నారు.



