సమ్మెతో ప్రభుత్వం మెడలు వంచి హామీలు సాధించుకున్న ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు వాటి అమలు కోసం మరోసారి పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విలీనం, కార్మిక హక్కులు, పే స్కేల్ అరియర్స్, ఉద్యోగ భద్రత, పని భారాల తగ్గింపు తదితర అంశాలపై ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలయాపన చేస్తున్నాయి. ఎన్ని సార్లు వినతులిచ్చినా, చర్చలు నిర్వ హించినా, ధర్నాలు చేసినా స్పంద న అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకో వాలని, అంగీకరించిన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 25న డిపోలు, రీజియన్లలో నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు.
గత ఐదు నెలలుగా ఆర్టీసీలో అనేక పరిణా మాలు జరిగాయి. ఆరు సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. మొదటగా ఆ సమ్మెకు ఎస్‌డబ్ల్యూ ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించడమేకాక, ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, రీజియన్లలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఇతర కార్మిక, ప్రజా సంఘాలు, పార్టీల మద్దతును కూడగట్టేందుకు కృషి చేసింది. ఏప్రిల్ 20న డిమాండ్స్ డే పాటించింది. దీంతో ఆర్టీసీలోని ఇతర సంఘాలన్నీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పాక్షిక ఐక్యతతో ప్రారంభమైన సమ్మె ఏర్పాట్లు సంపూర్ణ ఐక్యతతో జరిగే సమ్మెగా మారాయి. ఫలితంగా కార్మికుల్లో సమ్మె చేయాలన్న ధృడ సంకల్పం, నమ్మకం పెరిగింది.
ఐక్యతతోనే ప్రభుత్వంలో కదలిక
సరిగ్గా ఈ ఐక్యతే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. 2019 డిసెంబర్ 1 నుంచి 2025 మే, 2026లో సమ్మెకు పిలుపునిచ్చినా ప్రభుత్వాలు, ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్చలు చేపట్టలేదు. ఎస్‌డబ్ల్యూఎఫ్ చొరవతో సమ్మె సంపూర్ణ ఐక్యతతో జరుగుతున్నదని స్పష్టమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు ప్రారంభించింది. టీఆర్ అండ్ బీ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నాయకత్వంలో నలుగురు అధికారులతో కమిటీని నియమించి ఏప్రిల్ 21న అన్ని కార్మిక సంఘాలతో చర్చలు చేసింది. అంగీకారం కుదరకపోవడంతో ఏప్రిల్ 22 మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. భిన్నాభిప్రాయాలున్నప్ప టికీ సమ్మెను వంద శాతం విజయవంతం చేసేందుకు అన్ని సంఘాలు కృషి చేశాయి.
ఏప్రిల్ 22న ముగ్గురు కార్మికులు ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించారు. దీంతో ఏప్రిల్ 23న జరిగిన క్యాబినెట్ సమావేశం ఆయనకు సంతాపం ప్రకటిం చి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం లో ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఏప్రిల్ 24న అధికారుల కమిటీ, మంత్రి వర్గ ఉపసంఘం కార్మిక సంఘాల నాయకత్వంతో చర్చలు జరిపాయి. సుదీర్ఘ చర్చల అనంతరం అంగీకారం కుదిరి 25వ తేదీ ఉదయం 2.30 గంటలకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటిం చారు. ఇది సంపూర్ణ ఐక్యతతో జరిగిన సమ్మె సాధించిన విజయమిది.
ప్రభుత్వం ఇచ్చిన నాలుగు హామీలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, విలీన కమిటీని ఏర్పాటు చేసి అందులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిం చడం.ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తివేసి, మెజారిటీ యూనియన్‌ను నిర్ణయించేందుకు లేబర్ డిపార్టుమెంట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం.2021 రివైజ్డ్ పే స్కేల్‌ను 11 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయడం. జేఏసీ సమ్మె నోటీసు, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ వినతిపత్రాల్లోని మిగిలిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం. మరి ఇప్పుడు హామీల అమలు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఇంతవరకు విలీన కమిటీని నియమించలేదు. విలీనానికి అవసరమైన అధికారుల, శాఖల మధ్య సంప్రదింపులు కూడా ప్రారంభం కాలేదు. విలీన కమిటీ వెంటనే ఏర్పాటు చేసి కృషి ప్రారంభిస్తే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించిన తర్వాతే గెలిచిన కార్మిక సంఘాల ప్రతినిధులకు విలీన కమిటీలో భాగస్వామ్యం కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. ఇది అమలైతే విలీన ప్రక్రియ ప్రారంభమే ఆలస్యమయ్యే భయం కార్మికుల్లో ఉంది.
కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తివేయడం, ఎన్నికలు నిర్వహించడం, సంఘాల కార్యకలాపా లకు అనుమతి ఇవ్వడం పాక్షికంగానే జరుగుతు న్నాయి. ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసిన మే 1, 2026 తర్వాత కూడా డిపో, రీజియన్ స్థాయి అధికారులు కార్మిక సంఘాలతో సక్రమంగా వ్యవహరించడం లేదు. వినతిపత్రాలు తీసుకోవడా నికి కూడా నిరాకరిస్తున్నారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు లేకుండానే డ్యూటీల్లో మార్పులు చేస్తూ పని భారాలను పెంచుతున్నారు.
గుర్తింపు సంఘ ఎన్నికల నిర్వహణలోనూ కార్మిక శాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. జూన్ 29న మొదటి నోటీసు ఇచ్చి, జులై 31న యూనియన్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి 11 సంఘాలు పోటీకి అర్హత సాధించాయని నిర్ణయించారు. ఆ తర్వాత జరగాల్సిన ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ఆలస్యమైతే విలీన ప్రక్రియ కూడా ఆలస్యమవుతుందనే భయం కార్మికుల్లో ఉంది. 2021 పే స్కేల్‌ను 11 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేస్తున్నా, ఆర్టీసీ యాజ మాన్యం విడుదల చేసిన సర్క్యులర్ నెం. పీడీ 18/2026లో అరియర్స్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో రిటైరైన వారితో పాటు ప్రస్తుతం సర్వీసులో ఉన్న కార్మికులకు రావాల్సిన అరియర్స్‌పై అనిశ్చితి కొనసాగుతోంది.
చర్చలు సరే.. అమలేది?
ఆర్టీసీ యాజమాన్యం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీని ఏర్పాటు చేసి మూడు వినతిపత్రాల్లోని 17 ఉమ్మడి డిమాండ్లపై అన్ని యూనియన్లతో చర్చలు జరిపింది. 2026 మే 21, జూన్ 12, జూన్ 20 తేదీల్లో చర్చలు జరిగాయి. కొన్ని సమస్యలను పరిష్కరిస్తామని, మరికొన్నింటిని ఎండీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఆర్థిక అంశాలను ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. చర్చల్లో అంగీకరించిన వాటిలో ప్రమోషన్లు, 11 శాతం పే స్కేల్ అమలు, సీసీఎస్ ఎన్నికలకు అనుమతి, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆందోళనల అనంతరం ఉద్యోగ భద్రత కమిటీ ఏర్పాటు వంటివి మాత్రమే అమలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా పాక్షికంగానే అమలయ్యాయి. యాజమాన్యం చర్చల్లో అంగీకరించిన అనేక అంశాలు అమలుకు నోచుకోలేదు. చర్చల ప్రొసీడింగ్స్ కాపీని యూనియన్లకు ఇస్తామన్న హామీ కూడా నేటికీ అమలు కాలేదు.
పోరాటమే తప్ప మరో మార్గం లేదు
అంగీకరించిన అంశాలను అమలు చేయాలని జూన్ 1న ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్స్ డే పాటించింది. ఈడీ కమిటీ ఛైర్‌పర్సన్, కన్వీనర్, ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు మంత్రిని కలిసి పరిస్థితిని వివరించింది. సరైన స్పందన లేకపోవడంతో జూలై 27న అన్ని డిపోల ముందు ధర్నాలు నిర్వహించింది. ఆ తర్వాతే యాజమాన్యం ఆగస్టు 3న ఉద్యోగ భద్రత కమిటీని ప్రకటించింది. ఆగస్టు 11న కమిటీ సమావేశం, 12న బోర్డు సమావేశం జరిగినా అంగీకరించిన అంశాల అమలుపై స్పష్టత రాలేదు.ఈ పరిస్థితిని సమీక్షించిన ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర జనరల్‌బాడీ సమావేశం ఆగస్టు 25న డిపో, రీజియన్ స్థాయిలో నిరాహార దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి హామీలను అమలు చేయాలి. లేనిపక్షంలో మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కార్మికులకు ఎస్‌డబ్ల్యూఎఫ్ పిలుపునిస్తోంది.
డిమాండ్లు
ప్రభుత్వం, యాజమాన్యం అంగీకరించిన అంశాలను అమలు చేయాలి. ఈడీ కమిటీ చర్చల ప్రొసీడింగ్స్‌ను వెంటనే యూనియన్లకు ఇవ్వాలి. అలవెన్సులను 80 శాతం పెంచాలి. 2021 పే స్కేల్, అరియర్స్‌పై స్పష్టతనిచ్చి చెల్లించాలి. బ్రెడ్ విన్నర్ స్కీం ఉద్యోగులను రెగ్యులర్ చేసి, చేరిన రోజు నుంచి సర్వీసును పరిగణించాలి. జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాసైన వారికి ప్రమోషన్లివ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించి, అవసరమైన రెగ్యులేషన్స్ సవరించాలి. మెకానికల్ సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్) పరీక్ష నిర్వహించి ప్రమోషన్లతో పోస్టులు భర్తీ చేయాలి. పని భారాలపై డిపో, రీజియన్ స్థాయిలో కార్మిక సంఘాలతో చర్చించాలి. పెంచిన పని భారాన్ని తగ్గించాలి. రిటైర్డ్ కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించాలి.
వి.ఎస్.రావు
9490098890
మరో పోరాటానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధమవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



