ప్రతి గ్రామంలో 60 మంది ఉపాధి కూలీలకు పని : పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో వనమహోత్సవాన్ని (మొక్కలు నాటే కార్యక్రమం) 85 శాతం పూర్తి చేశామని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా సీఈఓలు, డీఆర్డీఓలు, డీపీఓలు, అదనపు డీఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5.32 కోట్లకు పైగా మొక్కలు నాటినట్టు చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని వర్షాలు అనుకూలంగా ఉన్న ప్రస్తుత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు, రహదారులకు ఇరువైపులా, చెరువుల పరిసరాలు, శ్మశాన వాటికలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు తదితర ప్రాంతాలను వినియోగించుకుని మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేసి వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి కూలీల సమీకరణ బాధ్యతలను అప్పగించాలని అన్నారు. కూలీల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వనమహోత్సవంలో నాటిన మొక్కల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షాలు లేని రోజుల్లో క్రమం తప్పకుండా నీరు అందించాలనీ, ప్రతి మొక్క చుట్టూ నీరు నిలిచేలా గుంటలు, తట్లు ఏర్పాటు చేయాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ మొక్కలు నాటి 100 శాతం మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
చేయూత పింఛన్లపై సమగ్ర పరిశీలన
చేయూత పింఛన్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి కొత్త పింఛన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హతను నిర్ధారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లను కుట్టే అవకాశం మహిళా సంఘాలకు లభించిందనీ, ఈ అవకాశాన్ని మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూర్చే విధంగా వినియోగించుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.
పీఆర్ వనమహోత్సవం 85 శాతం పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



