సినీ గేయ రచయిత
సుద్దాల అశోక్‌తేజ
ఎస్వీకేలో ‘జానపద
జాతర-సకల కళల సమ్మేళనం’
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణకు జానపదమే ప్రాణపదమని, జానపద కళలను, కళాకారులను ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. జానపద దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం కోవిదా కల్చరర్స్ అసోసియేషన్, టీపీఎస్‌కే సంయుక్త ఆధ్వర్యంలో ‘జానపద జాతర-సకల కళల సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. అన్ని నృత్యాలు, కళలకూ జానపదమే మూలమని చెప్పారు. తెలంగాణ జానపద కళాకారుల కోసం ప్రత్యేకంగా జానపద అకాడమీ, జానపద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధ కళాకారులకు నెలవారీ పెన్షన్లు అందించడంతోపాటు వృత్తి కళలపై ఆధారపడి జీవిస్తున్న కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జానపద కళల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారని, అలాంటి కళాకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జానపద చరిత్రను భావితరాలకు వారసత్వంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కోవిదా సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పి. అనూహ్యారెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని, దాని ద్వారా కళాకారులకు వివిధ ప్రభుత్వ నాట్య పరీక్షల్లో అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.
2026–27 ఏడాది నుంచి 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి శిక్షణ అందించేందుకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కళా విభాగం ప్రస్తుతం తంజావూరులో ఉందని, అలాంటి జోనల్ కళా విభాగాన్ని తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారికి ఉచిత వైద్యం, విద్య, గృహ వసతి, ప్రయాణ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఆలయాల్లో కళాకారులకు నాట్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పించాలని కోరారు.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, కవి పిఎన్. మూర్తి మాట్లాడుతూ.. జానపద కళాకారులకు వృద్ధాప్య పెన్షన్లు, అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. వివిధ కళారూపాల నృత్య ప్రదర్శనలు నిర్వహించగా, గురువులు, విద్యార్థులకు కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, టీపీఎస్‌కే సంయుక్తంగా బహుమతులు అందజేశాయి. కార్యక్రమంలో నాట్యాచార్యులు వరుణ్, పవన్‌కుమార్, నిర్వాహకులు కె. రామలక్ష్మి, జి.లావణ్య, సౌజన్య, రాధిక, శ్రీనివాస్, లక్ష్మీదేవి, దుబ్బాక సురేష్, వెంకన్న, ఇమ్మడి ఎల్లన్న, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
జానపద కళలకు పట్టం కట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



