ఉద్యోగాల కల్పనపై ట్రంప్ అసత్యాలు
బైడెన్ పాలనతో పోలిస్తే తగ్గిన ఉద్యోగాల సృష్టి
మరోవైపు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
వాషింగ్టన్ : ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో తన పనితీరును మెజారిటీ అమెరికన్లు ఆమోదించడం లేదంటూ వచ్చిన సర్వేలను నమ్మవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రజలకు సూచించారు. వాస్తవానికి తనకు ప్రజాదరణ చాలా మెరుగ్గా ఉన్నదని ఆయన చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరణగా ఓ చిన్న విషయాన్ని గొప్ప విజయంగా చూపారు. ‘నేను ఓ సర్వేలో చూశాను. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ట్రంప్‌కు 44 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారని అందులో ఉంది. అది నిజమెలా అవుతుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా యువత ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కదా’ అని కరోలినాలో జరిగిన ర్యాలీలో తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ఆ ర్యాలీలో మూడు సార్లు ప్రస్తావించారు. అయితే దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదని ట్రంప్‌కు తెలియదా లేక ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశ పూర్వకంగానే అతిగా ప్రచారం చేస్తు న్నారా అన్నది స్పష్టం కావడం లేదు.
ఉద్యోగాల కల్పనలో వేగం తగ్గింది
వాస్తవానికి అమెరికాలో ఉద్యోగుల సంఖ్య కాలక్రమేణా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే జనాభా కూడా పెరుగుతోంది. 2008 ఆర్థిక సంక్షోభం, 2020 కోవిడ్-19 సంక్షోభం వంటి ఆర్థిక మాంద్యాల సమయాలలో తప్ప సంవత్సరాలు గడిచే కొద్దీ ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం ట్రంప్ ఆర్థిక విధానాలపై ప్రజాభిప్రాయం అంతంతమాత్రంగా ఉండడానికి ప్రధాన కారణం కార్మిక మార్కెట్ పరిస్థితి కాదు. జీవనవ్యయం. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 2025 జనవరిలో ఉపాధి-జనాభా నిష్పత్తి (16 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభాలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది) 60.1 శాతం ఉండగా అది జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న చివరి మూడు సంవత్సరాల కాలంలో నమోదైన స్థాయిల కంటే చాలా తక్కువ. బైడెన్ హయాంలో కంటే ట్రంప్ రెండో విడత పాలనలో ఉద్యోగాల కల్పనలో వేగం గణనీయంగా తగ్గిపోయింది. బైడెన్ పదవీకాలంలోని చివరి 18 నెలలలో అమెరికాలో 22 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ట్రంప్ హయాంలో 2025 ఫిబ్రవరి నుంచి ఈ సంవత్సరం జూలై వరకూ…అంటే 18 నెలల కాలంలో కేవలం 5,90,000 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి.
పెరుగుతున్న నిరుద్యోగులు
కార్మిక శక్తిలో నిరుద్యోగుల సంఖ్యను సూచించే ‘నిరుద్యోగిత రేటు’ విషయానికి వస్తే గత సంవత్సరం జనవరిలో నాలుగు శాతంగా ఉన్న ఈ రేటు గత నెల నాటికి స్వల్పంగా పెరిగి 4.1 శాతానికి చేరింది. బైడెన్ హయాంలో 2023 ఏప్రిల్‌లో 3.4 శాతం కనిష్ట స్థాయి, ట్రంప్ మొదటి విడత పాలనలో 2019 చివరలో 3.5 శాతం కనిష్ట స్థాయి నమోదయ్యాయి. ఇక 16 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉండి ఉద్యోగంలో ఉన్న లేదా పని కోసం వెతుకుతున్న జనాభా శాతాన్ని సూచించే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్) గత సంవత్సరం జనవరిలో 62.6 శాతం ఉండగా గత నెలలో 61.4 శాతానికి తగ్గింది. ఈ తగ్గుదలలో కొంత భాగంలో గణాంక సంబంధమైన వ్యత్యాసం ఉండవచ్చు కానీ భారీ వృద్ధికి సంబంధించిన సంకేతాలేవీ లేవు. ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్న ఉద్యోగుల సంఖ్య విషయానికి వస్తే ఓ ఫెడరల్ సర్వే ప్రకారం ఉద్యోగాలలో ఉన్న అమెరికన్ల సంఖ్యలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గుదల కన్పించడం గమనార్హం.



