ఎన్‌డీఎస్‌ఏ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నివేదికలు చెంపపెట్టు : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం మొత్తం కుప్పకూలిందనీ, ప్రాజెక్టు పనికిరాదనీ, నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతోందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా మంగళవారం స్పందించారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్‌డీఎస్‌ఏ అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని తెలిపారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్య లేదనీ, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని నివేదిక ఇచ్చిందని వివరించారు. రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి, తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేసిందని పేర్కొన్నారు.
తాము నిలదీసిన తర్వాతే దేవాదుల, నంది పంపులు ఆన్ చేశారని గుర్తు చేశారు. అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయిందని తెలిపారు.దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16 శాతం ఉంటే, తెలంగాణలో కేవలం 35.6 శాతం మాత్రమే ఉన్నాయని వివరించారు. ఇవి కేవలం అంకెలు కాదనీ, తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్లు వేయడానికి, విచారణలు చేయడానికి ఉన్న శ్రద్ధ కిందికి పోతున్న గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి రైతులకు అందించడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఇది రాజకీయ కక్షలకు సమయం కాదనీ, తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన సమయమని తెలిపారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



