అసెంబ్లీ కమిటీ భేటీలో
చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా కమిటీలు : గడ్డం ప్రసాద్‌కుమార్
ఆ కమిటీలు అత్యంత ప్రభావంతమైనవి:
మంత్రి శ్రీధర్‌బాబు
అసెంబ్లీలో పలు శాసనసభ కమిటీల భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజా సమస్యలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సిఫారసులు చేయడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ కమ్యూనిటీ హాల్‌లో షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమ కమిటీ , మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమ కమిటీలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ తెగల వారికి సబ్సిడీ పథకాలు అమలు కాక లబ్దిదారులు నేటికీ సబ్సిడీ పేపర్లను పట్టుకొని తిరుగుతున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ ఛైర్మెన్‌తోపాటు సభ్యులపై ఉంటుందని వివరించారు. గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు. కమిటీల సభ్యులు ప్రజల నుంచి వచ్చే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని వివరించారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ లెజిస్లేటివ్ కమిటీలు ప్రభుత్వం ప్రజల మధ్య ఒక ముఖ్యమైన వారధిగా పని చేయాలని సూచించారు. తద్వారా పథకాల అమలులో ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాదించేందుకు అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. ప్రజలకు పథకాలు మరింతగా చేరువయ్యేందుకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 10.45 శాతం మంది ఉన్న షెడ్యూల్డ్ తెగల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడం, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించడం, లోటుపాట్లను గుర్తించడం, వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన సూచనలను ప్రభుత్వానికి అందించడం ఈ షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం సమ్మిళిత అభివృద్ధి అనే ఆదర్శాల పట్ల మనందరి సమిష్టి నిబద్ధతకు వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటి ప్రతీక అని వివరించారు. కమిటీలు ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, అర్థవంతమైన సిఫార్సుల ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచాలని సూచించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి సంయుక్త కమిటీలు అత్యంత ప్రభావితమైనవని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి ఈ సంయుక్త కమిటీ సూచనలు, సలహాలు ఉపయోగపడతాయని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కరించవచ్చని వివరించారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల సాధికారత కోసం ఈ కమిటీ ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన్నారు. శిశువులు, దివ్యాంగులు, వృద్ధుల రక్షణ, సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిటీ రిపోర్టులు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఆయా కమిటీ సభ్యులతోపాటు శాసన పరిషత్ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి పాల్గొన్నారు.
ప్రజాసమస్యలను లోతుగా అధ్యయనం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



