Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనత్తేనయం..

నత్తేనయం..

- Advertisement -

సింగూరు మరమ్మతు పనుల్లో జాప్యం
నాలుగు నెలల్లో 30 శాతమే పూర్తి
ప్రాజెక్టు పూర్తిగా 
ఖాళీ చేస్తేనే పనులు !
భారీ వరదలు వస్తే 
ప్రాజెక్టు మనుగడకే ప్రమాదం
డ్యామ్‌ సేప్టీ రివ్యూ ప్యానెల్‌ హెచ్చరిక
తాగునీటి కోసం 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ప్రభుత్వం అంగీకరిస్తేనే 
నీళ్లు ఖాళీ చేసే అవకాశం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. పనులు మొదలు పెట్టి నాలుగు మాసాలు కావస్తున్నా ఇప్పటికీ 30 శాతమే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరితో అగ్రిమెంట్‌ ‌గడువు తీరనుంది. ఈ ఆరు నెలల్లో మిగతా పనులు చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలి. అయితే సింగూరు ప్రాజెక్టులో పూర్తిగా నీటిని ఖాళీ చేస్తే తప్ప మరమ్మతు పనులు ముందుకు సాగే పరిస్థితిలేదు. జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే పనులు మందకొడిగా నడుస్తున్నాయని సమాచారం.
సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ ‌మండల సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు 1988లో వినియోగంలోకి వచ్చింది. 29.917 టీఎంసీల నీటి సామర్ధ్యం కలిగిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌‌తో పాటు పరిసర ప్రాంతాలకు తాగునీటిని అందించడమే కాకుండా సింగూరు ఆయకట్టు కింద 40 వేల ఎకరాలు, ఘనపురం ఆనకట్ట కింద మరో 20 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నిజాంసాగర్‌‌కు కూడా సింగూరు నుంచి నీటి కేటాయింపులు ఉన్నాయి.

నిర్వహణా లోపం..
ప్రాజెక్టు నిర్మాణం తర్వాత రెందు దశాబ్దాల పాటు కట్ట, రివిట్‌‌మెంట్‌ ‌బాగానే ఉంది. 2012 తర్వాత సరైన నిర్వహణలేకపోవడంతో రివిట్‌‌మెంట్‌ ‌దెబ్బతింటూ వచ్చింది. రాళ్లు ఊడిపోవడం, కట్ట కుంగిపోవడం వంటి సమస్యలు ఉంటూ వస్తున్నాయని అధికార వర్గాల సమాచారం. గతేడాది డ్యామ్‌ ‌సేప్టీ రివ్యూ ప్యానెల్‌ ‌నిర్వహించిన తనిఖీల్లో కట్ట భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై గతంలోనూ నివేదికలు సమర్పించినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిసింది. కట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడలో చీలికలు, రివిట్‌‌మెంట్‌ ‌దెబ్బతినడం, స్పిల్‌‌వే, ఎర్త్ డ్యామ్‌, గ్యాలరీలకు అత్యవసర మరమ్మతులు అవసరమని నిపుణులు సూచించారు.

​కొనసాగుతున్న పనులు
​ప్రాజెక్టులో అత్యంత ఎక్కువగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ముందుగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. అయితే డ్యామ్‌ ‌మరో చివర నుంచి పనులు ప్రారంభించడం వల్ల నీటి నిల్వకు అవకాశంలేకుండా పోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం, జలాశయంలో నీటిని ఖాళీ చేయలేని పరిస్థితుల నేపథ్యంలో మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మే నెలలో పనులు ప్రారంభం అయ్యాయి. 2026 ఫిబ్రవరి వరకు పనులు పూర్తి కావాలి. డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తేనే రిపేర్లు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిని దిగవకు విడుదల చేసి ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గించి ఇప్పటివరకు మరమ్మతు పనులు చేస్తూ వచ్చారు. నీటిని తగ్గిస్తూ కట్టకు పనులు చేశారు. ప్రాజెక్టులో 650 మీటర్ల లోపు వరకు నీరు ఖాళీ కావడంతో అక్కడి వరకు పనులు అయ్యాయి.

​తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రతిపాదన
​సింగూరు ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి, మెదక్ , నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు సరాఫరా అవుతున్నది. ప్రస్తుతం ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం ఏర్పడడంతో వర్షాలు లేక తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 4.577 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. జిల్లాలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి 630 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా దిగువకు 380 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నీటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు ఇరిగేషన్ అధికారులు సూచించారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మిషన్ భగీరథ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో సింగూరు ఖాళీ చేసి మరమ్మతులు చేయాలా?.. ప్రజల అవసరాల నిమిత్తం ప్రాజెక్టులో నీటిని అలాగే నీటిని నిల్వ ఉంచాలా? అనేది తేలాల్సి ఉంది.

డ్యామ్‌ ఖాళీ చేయాలి
సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తవ్వాలంటే ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేయాలి. నీటి మట్టం తగ్గిస్తూ రిపేర్లు కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం 650 మీటర్ల వరకు నీరు లేకపోవడంతో అక్కడి వరకు పనులు పూర్తి చేశాం. మిగతా పనులు చేయాలంటే క్రమంగా నీటిని ఖాళీ చేయాల్సిందే. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు తెలిపాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తాం.
నాగరాజు, సింగూరు ప్రాజెక్టు డీఈ



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -