జలాశయానికి భారీ వరద
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయానికి పై నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. రెండు టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన జలాశయం నిండుకుండలా మారడంతో మత్తడి దూకుతోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువ మానేరులోకి ప్రస్తుతం 2,220 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాలువ ద్వారా 100 క్యూసెక్కులు, స్పిల్‌వే గేట్ల ద్వారా 2,120 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.
మత్తడి మీదుగా భారీగా నీటి ప్రవాహం
జలాశయం పూర్తిగా నిండిపోవడంతో సుమారు 2,220 క్యూసెక్కుల నీరు మత్తడి మీదుగా ప్రవహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మానేరు వాగు పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎగువ మానేరు జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో నీటి ప్రవాహం, జలాశయ నీటిమట్టం, స్పిల్‌వే గేట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే జలాశయానికి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మత్తడి దూకుతున్న ఎగువ మానేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



