Thursday, August 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవీసా అపాయింట్‌మెంట్ల నిలిపివేత

వీసా అపాయింట్‌మెంట్ల నిలిపివేత

- Advertisement -

సిబ్బందికి ‘శిక్షణ’ సాకుతో ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం
ఇమ్మిగ్రేషన్‌ అణచివేత చర్యలు తీవ్రతరం
వాషింగ్టన్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దరఖాస్తుదారులకు సంబంధించిన వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇమ్మిగ్రేషన్‌ అణచివేత చర్యలలో భాగంగా ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలలోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని, దానికి అనుగుణంగా వీసా సేవల అపాయింట్‌మెంట్లను సర్దుబాటు చేస్తామని విదేశాంగ శాఖ మంగళవారం తెలియజేసింది. ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే వలసదారులపై పెద్ద ఎత్తున అణచివేత చర్యలు చేపట్టింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని…ఇలా కుంటిసాకులు చూపుతూ వీసాలు, గ్రీన్‌కార్డులు రద్దు చేస్తోంది. వీసా దరఖాస్తులను తిరస్కరిస్తోంది. తీవ్రమైన దేశ బషిష్కరణ చర్యలకు పాల్పడుతోంది. వలసదారులను నిర్బంధించడం, అరెస్ట్‌ చేయడం వంటి చర్యలతో వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇమ్మిగ్రేషన్‌ అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేసింది.

విదేశాంగ శాఖ ఏం చెబుతోందంటే…
దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని 75 దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు వలస వీసాల జారీని నిలిపివేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే ఓ అమెరికా న్యాయమూర్తి కొట్టివేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను వడపోత ద్వారా గుర్తించడానికి, వీసా దరఖాస్తుదారుల మూల్యాంకనం సమగ్రంగా, స్థిరంగా జరిగేలా చూడడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ అంటోంది. అయితే శిక్షణ ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

మరిన్ని అణచివేత ప్రతిపాదనలు
చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌పై కూడా ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. కొత్తగా హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారు 1,03,265 డాలర్ల ఫీజు చెల్లించాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. కొన్ని నిర్దిష్ట రంగాలలో విదేశీ ఉద్యోగులను నియమించుకునే యాజమాన్యాలపై ఈ ఫీజు తలకు మించిన భారాన్ని మోపుతుంది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులను క్షుణంగా తనిఖీ చేయాలని కూడా ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధిక నైపుణ్యం కలిగిన, మెరుగైన వేతనాలు పొందే ఉద్యోగులకు అనుకూలంగా వీసా ఎంపిక ప్రక్రియలో మార్పులను ప్రతిపాదించింది. సుమారు రెండు లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార, పర్యాటక వీసాలను (బీ1, బీ2) రద్దు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడుతోంది. 2016-2026 మధ్యకాలంలో వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి వస్తారని సమాచారం. పర్యాటక లేదా వ్యాపార వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

దరఖాస్తుదారులకు ఈ-మెయిల్‌ సమాచారం
వీసా అపాయింట్‌మెంట్లను నిలిపివేసినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఇదివరకే తెలియ జేసింది. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇంటర్వ్యూలు షెడ్యూలు చేసుకున్న ఇమ్మిగ్రెంట్‌ వీసా దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్లు వాయిదా పడుతున్నా యంటూ ఈ-మెయిల్స్‌ ద్వారా సమాచారం పంపుతున్నారు. అప్పాయింట్‌మెంట్‌ తేదీని తర్వాత తెలియజేస్తామని చెబుతున్నారు. వలసదారుల అణచివేత చర్యలు వివక్షాపూరిత మైనవని, భావ ప్రకటనా స్వేచ్ఛను, న్యాయబద్ధంగా విచారణ పొందే హక్కులను అవి ఉల్లంఘిస్తున్నా యని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -