Thursday, August 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆర్థిక యుద్ధంలో సహకరించండి

ఆర్థిక యుద్ధంలో సహకరించండి

- Advertisement -

చైనాను కోరుతున్న అమెరికా…
ససేమిరా అంటున్న బీజింగ్‌
బీజింగ్‌ :
ఇరాన్‌తో వ్యాపార సంబంధాలకు స్వస్తి చెప్పేందుకు నిరాకరించే దేశాలపై ఆంక్షలు విధిస్తామని బెదిరించిన అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ చైనా పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా విజయాన్ని లేదా వైఫల్యాన్ని నిర్ణయించగల ఏకైక దేశం చైనాయే. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా చాలా కాలంగా ఇరాన్‌కు కీలక ఆర్థిక జీవనాధారంగా కొనసాగుతోంది. ఇరాన్‌ చమురులో అధిక భాగాన్ని కొనుగోలు చేస్తోంది చైనాయే. ఇరాన్‌ నాయకత్వాన్ని అణచివేసేందుకు చేస్తున్న తాజా ప్రయత్నాలలో చైనాను భాగస్వామిని చేయాలని అమెరికా అనుకుంటోంది. అయితే అదంత తేలిక కాదు. ఒకవేళ అమెరికా ఆంక్షలు విధించినా వాటిని చైనా కచ్చితంగా తిరస్కరిస్తుంది. ఇరాన్‌, రష్యా వంటి భాగస్వాములతో వాణిజాన్ని కొనసాగించేందుకు తనకున్న హక్కును ఎవరూ కాదనలేరని బీజింగ్‌ స్పష్టం చేస్తోంది. చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చైనా తాజాగా ప్రకటించింది.

మా వ్యాపారాలపై అమెరికా నిర్ణయమా?
వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటిస్తారు. మేలో జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పుడు ఇరాన్‌ విషయంలో చైనా సాయం కోరలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో చెప్పారు. అయితే వచ్చే నెలలో జరిగే సమావేశం సందర్భంగా… ఘర్షణలను ముగించడానికి అమెరికా పడుతున్న ఆరాటాన్ని గురించి జిన్‌పింగ్‌కు ట్రంప్‌ తెలియజేసే అవకాశం ఉంది. అయితే చైనా సాయం విషయంలో ట్రంప్‌ కోరికను జిన్‌పింగ్‌ మన్నించే అవకాశాలు లేవు. చైనా కంపెనీలు అమెరికా యేతర దేశాలతో ఏయే వ్యాపారాలు చేయాలో వాషింగ్టన్‌ ఎలా నిర్ణయిస్తుందని అధికారులు ప్రశ్నించారు.

చైనా పరపతి తెలిసే ఆంక్షలకు దూరం
అమెరికా డాలర్‌ వ్యవస్థకు, ఆంక్షలకు దూరంగా ఉండేందుకు చైనా ఓ వ్యవస్థను రూపొందించుకొని దాని ద్వారా ఇరాన్‌ చమురును దిగుమతి చేసుకుంటోంది. కొన్ని ప్రైవేటు రిఫైనరీలు అమెరికా ఆంక్షలకు గురైన ఇరాన్‌ ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ ప్రభావం పడని ఓడరేవులు, ఆర్థిక సంస్థలు, ట్యాంకర్‌ నెట్‌వర్క్‌లపై ఆధారపడతాయి. ఈ రిఫైనరీల కార్యకలాపాలను చైనా అధికారికంగా నమోదు చేయడం లేదు. చైనాపై ఆంక్షల విషయంలో గతంలో అమెరికా అనేక పర్యాయాలు బెదిరింపులకు దిగింది. అయితే ఆ తర్వాత వెనకడుగు వేసింది. అమెరికాలో చైనాకు ఉన్న గణనీయమైన ఆర్థిక పరపతి…ముఖ్యంగా కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరాలపై చైనాకు ఉన్న పట్టు గురించి వాషింగ్టన్‌కు తెలియనిదేమీ కాదు. ఒకవేళ అమెరికా హద్దు దాటితే చైనా తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశంపై దాని ప్రభావం ఉంటుందని వారు తెలిపారు.

ఇప్పుడు దాడులు ఉండవు : రుబియో
ఇరాన్‌పై ఇప్పుడు కొత్తగా దాడులు చేసే ఆలోచన ఏదీ లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలియజేశారు. అయితే ఆర్థిక, నౌకాయాన ఒత్తిడులను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఇరాన్‌పై కొంతకాలం పాటు సైనిక చర్యలు చేపట్టబోమని, అయితే నౌకా దిగ్బంధనం, ఆంక్షల ద్వారా ఒత్తిడిని తీవ్రతరం చేస్తామని ఆయన అమెరికా మిత్రదేశాల విదేశాంగ మంత్రులకు తెలిపారు.

మధ్యవర్తిత్వానికి ‘నో’
ఏదేమైనా సంఘర్షణల నివారణలో ప్రత్యక్ష మధ్యవర్తిత్వ పాత్ర పోషించేందుకు చైనా విముఖత చూపుతోంది. తన స్వీయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రాంతీయ శాంతికి మద్దతు ఇచ్చే స్థిరమైన శక్తిగా ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సంక్షోభ నివారణలో సహకరించడానికి చైనా సిద్ధంగానే ఉన్నదని, అయితే అమెరికా ఒత్తిడి వ్యూహంలో ఓ సాధనంగా మారేందుకు మాత్రం సిద్ధంగా లేదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -