– మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అరెస్ట్
– రూ.91 వేల నకిలీ నోట్లు, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహారాష్ట్రలోని పర్బణి జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.91 వేల విలువైన నకిలీ కరెన్సీ, స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26న ఉదయం 10.50 గంటల సమయంలో పిట్లం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. రూ.2 వేల విలువైన పెట్రోల్ పోయించుకుని రూ.500 విలువైన నాలుగు నోట్లను చెల్లించారు. నోట్లు నకిలీవని గుర్తించిన క్యాషియర్ శ్రీకాంత్ రెడ్డి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు కారులో అక్కడి నుంచి పరారయ్యారు.
క్యాషియర్ ఫిర్యాదు మేరకు పిట్లం పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 158/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 178, 179, 318(4)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. నకిలీ కరెన్సీని మరింతగా చలామణి చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న వారిని ధర్మారం టోల్‌ప్లాజా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నకిలీ కరెన్సీ సరఫరా చేసిన వ్యక్తులతో పాటు ఈ నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితులు రాహుల్ రావుసాహెబ్ అవాడ్ (23), వ్యవసాయం, బాబుల్‌గావ్, పర్బణి జిల్లా, మహారాష్ట్ర. ధ్యానోబా డాల్వే, ఉమ్రి బాబుల్‌గావ్, పర్బణి జిల్లా, మహారాష్ట్ర. భీమ్ శంకర్ రామ్‌రావ్ వైద్య, టాక్లీ దొబడే, పర్బణి జిల్లా, మహారాష్ట్ర. స్వాధీనం చేసుకున్నవి: రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91,000 నకిలీ కరెన్సీ, స్విఫ్ట్ డిజైర్ కారు (MH-38-V-2837), మూడు సెల్‌ఫోన్లు.
నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది శైలేష్, రాము, వెంకటేష్‌లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తక్కువ మొత్తంలో అసలు డబ్బులు ఇస్తే రెట్టింపు నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని పోలీసులు సూచించారు. నకిలీ కరెన్సీని కొనుగోలు చేయడం, కలిగి ఉండడం, చలామణి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని తెలిపారు. ఇలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.



