నవతెలంగాణ – రాయపోల్
సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను శుక్రవారం రాయపోల్ మండలంలో ప్రజలు సోదర సోదరీమణులు ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, నుదుట తిలకం దిద్ది మిఠాయిలు తినిపించారు. సోదరులు తమ సోదరీమణులకు కానుకలు అందజేసి, జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పట్టణాలు, గ్రామాల్లోని మార్కెట్లలో రాఖీల కొనుగోళ్లతో సందడి నెలకొంది. వివిధ రకాల రంగురంగుల రాఖీలు, ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన రాఖీలు అందుబాటులో ఉండడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి రక్షాబంధన్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.



