‘‘నవతరమా… యువతరమా.. ఇదే అదను కదిలి రమ్ము, నీ రక్తం పుష్పించగా ఈ దేశం ఫలించాలి’’ అన్నారు శ్రీశ్రీ. యువతరం ద్వజమెత్తితే… నవతరం గళం విప్పితే… నిశ్శబ్దం బద్దలై… జాతి గుండెల్లో కొత్త ఆశలు నిండుకుంటాయి. ఆవేశం నినాదమై ‘ఇంక్విలాబ్ జిందాబాద్’అంటూ మారు మోగుతుంది. జెన్ జడ్ మొదలుపెట్టిన సమరనాదం ఇప్పుడు వెల్లువై ‘జెన్ ఆల్ఫా’(2010 తర్వాత పుట్టిన పిల్లల)ులు) జన్ ఆల్ఫా అంటారు)కు పాకి, ఉప్పొంగుతోంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెబ్భయ్యవ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిని రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీహార్ రాజధాని పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసం వైపు ప్రదర్శనగా కదిలివెళ్లారు. అయితే ఒక గొప్ప దృశ్యం అక్కడ అందరిని ఆకర్షించింది.‘‘పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప’’ అన్న మార్క్స్ మహాశేయుని మాటలు నిజం చేస్తూ, ఒక ఆరేండ్ల వయసున్న ఆదిత్య కుమార్ జాతీయజెండా ప్రదర్శిస్తూ, ‘పీ.ఎమ్. రిజైన్’ అనే పోస్టర్ పట్టుకుని దేశంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ బాలుడి వీడియోలు సోషల్ మీడియాలో వైరలై, అందరిని అబ్బురపరుస్తున్నాయి. పోలీసులు ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను భద్రతా కారణాల రిత్యా అరెస్టు చేసి, అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించి, సుద్దులు చెప్పి వదిలివేశారు. పాట్నా మురికివాడల నుంచి వచ్చిన ఈ బాలుని తల్లి ఇండ్లలో పనులు చేసుకుం టుంది. తండ్రి దినసరి కూలీగా జీవనం సాగిస్తుంటారు. ఇక్కడి నుంచి ఈ ఆణిముత్యం బయలుదేరింది. రెడ్ టీ షర్ట్ , డెనిమ్ ప్యాంటు ధరించి విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నాడు. ఇంత చిన్న వయసులోనే ఎంతో పరిణతితో, గట్టిగా మీడియా ఎదుట ఆదిత్య మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.‘‘ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలి. ఈ పరీక్షలను రద్దు చేయాలి. విద్యార్థులపై లాఠీ ఛార్జికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలి, నా హక్కులను నేను వినియోగించుకుంటున్నా. ఒక పౌరుడిగా నా భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న’’ అంటూ మాట్లాడాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియా ముందు అతడు చెప్పిన మాటలు వేయి ప్రసంగాల కన్నా ఎక్కువ.
వయస్సు చిన్నదే గాని ‘‘పిట్ట కొంచెం కూత ఘనం’’ అన్న చందంగా అతని మాటలున్నాయి. అతని గొంతులో ఏమాత్రం భయం లేదు. అతని కండ్లల్లో బెరుకు లేదు. ఇంత చిన్న వయసులోనే ప్రశ్నించే ఆ చైతన్యం ఆ ధైర్యం, ఆ చురుకుదనం చూస్తుంటే రేపటి సమ సమా జానికి ఒక సూర్యోదయం… ఒక వెలుగు రేఖ… ఒక ఆశ కిరణంలా.. కనబడ్డాడు. ఆరేండ్ల పిల్లాడు కూడా మీడియాను ఎదుర్కొని ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పాడు. కానీ, మోడీజీ మాత్రం స్వతంత్ర మీడియాను చూడగానే పక్కకుపోతాడు. ఇప్పుడు చెప్పండి 56 అంగుళాల ఛాతీ ఉన్న మనిషి ఎవరు? ఆరేళ్ల బాలుడి ప్రశ్నలకు కూడా భయపడే స్థితికి మన మోడీ ప్రభుత్వం చేరుకుంది. ఒకటవ తరగతి చదువుతున్న ఆదిత్యను స్కూల్‌కు వెళ్లాల్సిన వయసులో ఆందోళనలు నీకెందుకని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చానన్నాడు. ఇప్పుడు పేపర్ లీకులు అవుతున్నాయి. నేను పెద్దయ్యాక కూడా ఇలాంటివి జరగకూడదు, అని నేను కూడా నిరసనకు దిగాను’’ అంటూ బదులిచ్చాడు. ‘‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని’’ డిమాండ్ చేశాడు.
‘‘బుల్లెట్ గాయాలకు కూడా తాను సిద్ధమేనని, అవసరమైతే మొదటి తూటా నాపైనే ప్రయోగించండి’’ అంటూ ధైర్యంగా మాట్లాడాడు. ‘‘దేశ భవిష్యత్తు తలపై దెబ్బ తగిలింది. లాఠీచార్జీలకు, జైళ్లకు, బుల్లెట్లకు భయపడి వెనక్కి తగ్గేదే లేదు’’అన్నాడు. విద్యార్థులపై లాఠీ చార్జికి ఎవరు అనుమతి ఇచ్చారో?సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే ఆదిత్య గతంలో ఇతర నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా ‘డబుల్ ఇంజన్’సర్కార్‌ణు ఆదిత్య ప్రశ్నిస్తూ భయం పుట్టించాడు. రేపు ఈ బాలుడిని కూడా ‘దిమాకీ నక్సలైట్’ అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రశ్నించటమే నిజమైన దేశభక్తి అని ఈ బాలుడు చాటి చెప్పాడు. ఇంత చిన్న వయసులోనే విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం గళమెత్తిన బాల నాయకుడు ఈ ఆదిత్యుడు. సామాజిక సమస్యలపై తన బలమైన గొంతును వినిపించాడు. నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవస్థలో రావలసిన మార్పులపై చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక లోపభూయిషమైన వ్యవస్థను రూపుమాపకుండా, కొత్త వ్యవస్థను నిర్మించుకోలేమని నినదించాడు. చిన్న వయసులోనే సామాజిక స్పృహ కలిగి, ప్రజల బాధలను నిర్భయంగా, స్పష్టంగా ప్రస్తావించటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ బాలుడు మాట్లాడిన తీరు, అతని మాటల్లోని నిజాయితీ కారణంగా దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నాడు. భవిష్యత్ తరాల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలో మార్పు రావాలని ఆ చిన్నారి ఆకాంక్షించాడు. హక్కుల కోసం నిర్భయంగా మాట్లాడే నాయకత్వ లక్షణాలు వయసుతో సంబంధం లేకుండా ఉంటాయని ఈ బాలుడు నిరూపించాడు. ఈ బాలుడిని కన్న తల్లిదండ్రులకు రెడ్ సెల్యూట్.
షేక్.కరిముల్లా,
9705450705



