Friday, August 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబషీర్‌బాగ్ స్ఫూర్తితో.. కదలాలి ముందుకు...

బషీర్‌బాగ్ స్ఫూర్తితో.. కదలాలి ముందుకు…

- Advertisement -

విద్యుత్తు లేకుండా ఆధునిక జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. నీటి నుంచి వ్యవసాయం వరకు, విద్య నుంచి వైద్యం వరకు, దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి సామాన్యుడి జీవనం వరకు ప్రతి రంగానికీ విద్యుత్తే ఆధారం. అలాంటి విద్యుత్తు ప్రజల హక్కా? లేక కార్పొరేట్ల సొత్తా? అనే ప్రశ్న మరోసారి దేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే, 26 ఏండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో ప్రజలు సాగించిన పోరాటం ప్రైవేటీకరణను తిప్పికొట్టింది. ఆ పోరాటంలో పోలీసు కాల్పులకు బలై ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగం విద్యుత్తు రంగాన్ని ప్రజల కోసం కాపాడే పోరాటానికి చిరస్మరణీయ స్ఫూర్తిగా నిలిచింది. నేడు అదే రంగంపై కార్పొరేట్ ఆధిపత్యం ముప్పు పొంచి ఉన్న వేళ.. బషీర్‌బాగ్ అమరవీరుల త్యాగాలు మరోసారి మనకు దిశానిర్దేశం చేస్తున్నాయి. వారి స్ఫూర్తితో విద్యుత్తును ప్రజా సేవగా కాపాడుకునేందుకు మరో విశాల ప్రజా ఉద్యమం అవసరమైన సమయం ఆసన్నమైంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకొస్తున్నది. 2021లో తీసుకొచ్చిన విద్యుత్ చట్టంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, కార్మికోద్యమం కూడా వ్యతిరేకించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే బడా కార్పొరేట్ల ఒత్తిడితో మోడీ ప్రభుత్వం తాజాగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొస్తున్నది. ఇందులో వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేలా “కాస్ట్‌ రిఫ్లెక్టింగ్‌ ఛార్జెస్‌” అనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. అంటే, బయట పరిస్థితులను బట్టి విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు పెంచుకునే అవకాశం కల్పించడమే. తద్వారా విద్యుత్ రంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించేందుకు అనువైన పరిస్థితులను సిద్ధం చేస్తున్నారు. నేడు డీజిల్‌, పెట్రోల్‌, వంటగ్యాస్‌ ధరలు ఎలాగైతే మాటిమాటికీ పెరుగుతున్నాయో.. రేపు విద్యుత్‌ ఛార్జీలు కూడా అదే విధంగా పెరుగుతూ పోయే ప్రమాదం ఉంది.

కార్పొరేట్లకు బొగ్గు, విద్యుత్తు రంగాల అప్పగింత
థర్మల్ విద్యుత్ కోసం ఇప్పటివరకు సింగరేణి, కోల్ ఇండియా లాంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గును సరఫరా చేస్తున్నాయి. వారు ఉత్పత్తి చేసిన బొగ్గును ‌KTPS, VTPS, NTPC లాంటి అనేక రాష్ట్ర, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల కు తక్కువ ధరకు సింగరేణి అమ్ముతుంది. దీన్ని క్యాప్టివ్ మైనింగ్ అంటాము. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీన్ని కమర్షియల్ మైనింగ్‌గా మార్చింది. అంటే, ఈ దేశంలోని బొగ్గుతో పాటు ఆయిల్‌, గ్యాస్, ఖనిజాలు, ప్రకృతి వనరులు, సహజ వనరులని జాతిసంపదగా దేశ ప్రజలందరి సొత్తుగా ఇక నుండి ఉండబోవు. కొందరి వ్యక్తిగత ఆ‌స్తిగా మారుతాయి. అదానీ, అంబానీ తదితర సంస్థలు బొగ్గును, దేన్నయినా సరే తవ్వుకొని ఎక్కడికైనా తరలించి అమ్ముకోవచ్చు. ఫలితంగా బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. కె.జి.బేసిన్ అంబానీ వ్యక్తిగత ఆస్తిగా మార్చివేయమడిన తర్వాత మనం గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం.

అతను డాలర్లలో గ్యాసును బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడంతో మనకు గ్యాస్ ఆధారిత విద్యుత్ ధరలు అంతులేకుండా పెరుగుతూనే ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కూడా దెబ్బతిని ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ, అంబానీలు మాత్రం అంతులేని లాభాలను గడిస్తున్నారు. ఈ విధానాలను నాటి వాజ్‌పేయి, చంద్రబాబు ప్రభుత్వాలు అమలులోకి తెచ్చాయి. మన దగ్గర తక్కువ రేటుకు వచ్చే సింగరేణి బొగ్గును కాదని, ఇటీవల మోడీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలో మైనింగ్ చేసే అదానీ బొగ్గును మన విద్యుత్ సంస్థలు ఖచ్చితంగా 15శాతం కొనాలని ఆదేశించడం వల్ల పెరిగిన విద్యుత్ ఉత్పత్తి ఖర్చును మనమే మోయాల్సి వస్తుంది. అంటే, ఈ బీజేపీ-ఆరెస్సెస్, ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నదో అర్థం చేసుకోవాలి. చౌకగా లభించే సోలార్ విద్యుత్‌రంగాన్ని కూడా కూడా ఏకపక్షంగా ప్రైవేట్‌ వ్యక్తులకే గుత్తాధిపత్యం కట్టబెట్టడం అత్యంత ప్రమాదకరం.

క్రాస్ సబ్సిడీ రద్దుతో రైతులు, పేదలపై పెనుభారం
బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చే విద్యుత్ చట్టంలో మరో ప్రమాదకరమైన అంశం క్రాస్ సబ్సిడీ తొలగింపు. దీనివల్ల ఇప్పటికేవున్న అసమానతలు పెరిగే ధరల వల్ల తీవ్రమౌతాయి. దేశానికి అన్నం పెట్టడమేగాక, అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇచ్చే ఉచిత విద్యుత్తు దెబ్బతింటుంది. క్రాస్ సబ్సిడీ విధానం అనేది సోషలిస్టు తరహా సంక్షేమం, సామాజికన్యాయం అవుతుంది. ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలకు, 200 లోపు యూనిట్లు వాడే బలహీన వర్గాల కుటుంబాలకు విద్యుత్ రాయితీలు ఉన్నాయి. వీటిని బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తున్నది. మోడీ ప్రభుత్వం తెచ్చే మరో ప్రమాదకరమైన సవరణ ఏమంటే భారత రైల్వేలు, ప్రైవేట్ ప్రభుత్వ మెట్రో రైల్వే సంస్థలు, ఇలాంటివి అనేక కంపెనీలు బయట ప్రైవేటు విద్యుత్తును కొనుక్కోవచ్చు.

అంతేకాదు, హైదరాబాద్ లాంటి నగరాలకు అవసరమైన విద్యుత్తును ఇక్కడి ప్రభుత్వ పంపిణీ సంస్థలు సీపీడీసీఎల్, ఎన్‌‌పీడీసీఎల్ లాంటివి తెలంగాణలోనే విద్యుత్తు కొనాల్సిన అవసరం ఇక నుండి ఉండదు. కేంద్ర ప్రభుత్వం రికమండ్ చేస్తే ఈ అధికారులు గుజరాత్‌లో తయారయ్యే అదాని విద్యుత్తును కూడా కొంటారు. ఇలా ప్రభుత్వ పంపిణీ సంస్థలను దివాళా తీయిస్తారు. తద్వారా క్రాస్‌సబ్సిడీకి ఉపయోగపడే నిధులకు కోతపడుతుంది. వల్ల లబ్దిపొందే తరగతులు వాటిని కోల్పోతారు. రైతులు కూడా వ్యవసాయం మోయలేని భారమై సాగుకు దూరమౌతారు. అంతిమంగా వలస కూలీలుగా మార్చబడతారు. వారి భూములన్నీ పెద్ద కార్పొరేట్ కంపెనీలు చేజిక్కించుకొని కార్పొరేట్ వ్యవసాయం తీసుకువచ్చే కుట్ర అమల్లోకి వస్తుంది. అందుకే పొలం వద్ద మోటార్లకు మీటర్లను బిగించాలని రాష్ట్రాల మీద కేంద్ర సర్కార్ ఒత్తిడి పెంచుతున్నది.

రైతుల ఉచిత విద్యుత్తు వెనుక విద్యుత్ ఉద్యమం
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అనే వాగ్ధానం విద్యుత్ పోరాటంలో ఆవిర్భవించి అమలులోకి వచ్చింది. ఎర్రజెండాలు ప్రారంభించిన విద్యుత్ ఉద్యమం లేకుంటే రెండున్నర దశాబ్దాల క్రితమే ఎన్డీయే భాగస్వామిగా వున్న చంద్రబాబునాయుడు ప్రైవేటుపరం చేసేవాడు. మోడీ ప్రభుత్వం నేడు నూతన విద్యుత్తు సంస్కరణల చట్టంలో మరొక ప్రమాదకరమైన అంశం కూడా ఉంది. అది ఒకే ప్రాంతంలో అనేక పంపిణీ సంస్థలు వ్యాపారం చేసుకోవచ్చు అంటున్నది. అయితే ఆ ప్రైవేటు కంపెనీలు స్వయంగా సబ్‌స్టేషన్లు, రైల్వే లైన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ సంస్థల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్పనంగా వాడుకుంటారట. దీని మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వానిదే. వాటిని మాత్రం వాళ్లు వాడుకొని సొమ్ము చేసుకుంటారు. అదానీ, అంబానీ లాంటి వారి కంపెనీలు చేసే దోపిడీ ఇదే. ఈ నష్టాల ప్రభావం తెలంగాణలోని ఉచిత విద్యుత్తు ఇస్తున్న వ్యవసాయ రంగం మీద పడుతుంది. నష్టాల్లోకి విద్యుత్తు పంపిణీ సంస్థలు వెళ్తాయి. ఉచిత విద్యుత్తు అనేది లేకుండా పోతుంది. తెలంగాణ వ్యవసాయ రంగం దివాలా తీసినా సరే గుజరాతీ వ్యాపారులైన అదానీ, అంబానీలకు మాత్రం లాభం జరగాలి. ఇది బీజేపీ ప్రభుత్వ విధానం.రాష్ట్రాల చేతుల్లోవున్న విద్యుత్‌రంగాన్ని కేంద్రం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ సెక్టార్ (విద్యుత్తు కేంద్రీకరణ చట్టం) చేసింది. దీన్ని అమలు చేయడానికి రాష్ట్రాలను బెదిరించి లొంగదీసుకుంటున్నది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా బీజేపీ ప్రభుత్వకుట్రలో భాగస్వామి కావాలని చూడడం విచారకరం.

దేశవ్యాప్త విద్యుత్ ఉద్యమం అవసరం
అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ప్రతిఘటనలు మొదల య్యాయి. ఇంజనీర్ల సంఘాలు, కార్మిక సంఘాలు సిద్ధమై సమ్మెలు చేసాయి. అయితే దేశవ్యాప్త ఉద్యమంగా ఈ పోరాటం మారాలి. కచ్చితంగా మారుతుంది. 2020-21 సంవత్సరాలలో జరిగిన రైతాంగ మహాఉద్యమంలో విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేక డిమాండ్ కూడా ఉన్నది. దేశానికి ప్రాణవాయువు లాంటి విద్యుత్ మీద బడా కార్పొరేట్ శక్తులు బీజేపీ కేంద్ర ప్రభుత్వ మద్దతుతో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా విద్యుత్ వినియోగదారులు, రైతాంగం, కార్మికులు, ఉద్యోగులు ఇంజినీర్లు సమస్త ప్రజానికం పెద్దఎత్తున తిరగబడి మన భావితరాలను, మన దేశ భవిష్యత్తును కాపాడుకోవడం అవసరం. విద్యుత్తు పోరాట అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు కాకుండా విశాల ఐక్య ఉద్యమానికి సిద్ధమవ్వాలి. అందుకు లెఫ్ట్ పార్టీలు చేస్తున్న కృషిలో బీజేపీయేతర శక్తులన్నీ కలిసిరావాలి. ముంచుకొస్తున్న విద్యుత్‌ సంస్కరణల ముప్పును అడ్డుకుని విద్యుత్తును ప్రజాసేవగా, ప్రజల హక్కుగా కాపాడుకోవడమే బషీర్‌బాగ్ అమరవీరులకు మనమందించే నిజమైన నివాళి.
(ఆగస్టు 28, బషీర్‌‌బాగ్‌ విద్యుత్‌ ‌ఉద్యమ
అమరవీరుల సంస్మరణ దినం)

బండారు రవికుమార్, 9121080160

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -