బీడీ కార్మికుల బతుకులు రోజురోజుకూ మసిబారుతున్నాయి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు బీడీ పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతుండగా, మరోవైపు యాజమాన్యాల శ్రమదోపిడీతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం, జీవనభృతి పెంపు నిలిచిపోవడం, రిటైర్మెంట్ పెన్షన్ సరిపడా లేకపోవడం, గతంలో అందిన సంక్షేమ సౌకర్యాలు దూరమవడం వంటి సమస్యలతో లక్షలాది మంది బీడీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఆధారపడి సుమారు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇస్తామని, ప్రస్తుతం ఇస్తున్న జీవనభృతిని రూ.4,016కు పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా, మూడు బడ్జెట్ సమావేశాలు పూర్తయినా జీవనభృతి కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జీవనభృతిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లక్ష మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు 15 ఆగస్టు 2026న ప్రకటించినప్పటికీ, ఆసరా పెన్షన్ల దరఖాస్తుల్లో బీడీ కార్మికుల జీవనభృతికి అవకాశం కల్పించక పోవడం, రూ.4,016కు పెంచకపోవడం ద్వారా మరోసారి మోసం చేస్తున్నది. బీడీ పరిశ్రమలో గ్రాట్యూటీ, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలు ఉన్నప్పటికీ పని దినాలు తగ్గిపోయాయి. ఆకు, పొగాకు సమస్యలతో పాటు ఏ పరిశ్రమ ఎప్పుడు మూతపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సుమారు కోటిన్నర మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో దెబ్బతింటోంది. బీడీ కట్టలపై డేంజర్ గుర్తులు తప్పనిసరిగా ముద్రించాలని, కంపెనీ పేరు స్పష్టంగా కనిపించకుండా డేంజర్ గుర్తులే ప్రధానంగా ఉండాలని నిబంధనలు విధించడంతో మార్కెట్‌పై ప్రభావం పడుతోంది. ప్రతి ఏడాది డేంజర్ గుర్తులు మారుతుండటంతో కంపెనీ పేరు, శాశ్వత ట్రేడ్‌మార్క్ కనిపించకుండా పోతున్నాయి. బీడీలు తాగే వారి సంఖ్య తగ్గడంతో మార్కెట్ క్షీణించి కార్మికులపై ప్రభావం చూపుతోంది.
బీడీలు ఆరోగ్యానికి హానికరమనే కారణంతో పరిశ్రమపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం మద్యం, గుట్కా, పాన్ పరాగ్, డ్రగ్స్ వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి, కానీ ఎందుకు తీసుకోవడం లేదు? అలాగే బీడీ పరిశ్రమ ముడిసరుకులు, ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నది. మార్కెట్లో వెయ్యి బీడీలు వెయ్యి రూపాయలకు అమ్మితే రూ.280 జీఎస్టీగా చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ పన్ను నుంచి బీడీ పరిశ్రమకు గానీ, కార్మికుల సంక్షేమానికి గానీ ఖర్చు చేయడం లేదు. బీడీ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవో నంబర్ 41ను గత ప్రభుత్వం అమలు చేయ లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీస వేతనాల జీవోలను అమలు చేయకుండా బీడీ పరిశ్రమను షెడ్యూల్ పరిశ్రమ నుంచి తొలగిం చింది. బీడీ, చుట్ట కార్మికుల చట్టం-1966తో పాటు 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వీటి వల్ల కార్మికులు అనేక హక్కులు కోల్పోతున్న పరిస్థితి ఉంది. బీడీ కార్మికులు యాభైఏండ్ల వరకు అనారోగ్య సమస్యలను లెక్కచేయకుండా పనిచేస్తున్నప్పటికీ రిటైర్మెంట్ అనంతరం సరిపడా పెన్షన్ అందడం లేదు. ప్రైవేటు విద్య, వైద్య ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ పెన్షన్‌ను కనీసం నెలకు రూ.10 వేలకు పెంచాలని అనేక ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.బీడీ కార్మికుల సంక్షేమానికి 1976లో సంక్షేమ సెస్ చట్టం, సంక్షేమ నిధి చట్టం అమల్లోకి వచ్చాయి. బీడీలపై సెస్ వసూలు చేసి ఆ మొత్తాన్ని సంక్షేమ నిధికి అందించడం ద్వారా వైద్యం, గృహవసతి, పిల్లల విద్య, తాగునీరు, పారిశుధ్యం, కుటుంబ సంక్షేమం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. 1998 సవరణతో ప్రతి వెయ్యి బీడీలకు 50 పైసల నుంచి రూ.5 వరకు సెస్ పెంచారు. అయితే జీఎస్టీ అమలులోకి వచ్చిన సమయంలో ఈ సంక్షేమ చట్టాలు, సెస్ చట్టం రద్దు చేయబడింది. సెస్ చట్టం రద్దయినప్పటికీ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించినా అవి అమలుకు నోచుకోలేదు.
దేశవ్యాప్తంగా సుమారు 17 రాష్ట్రాల్లో 49.82 లక్షల మంది నమోదైన బీడీ కార్మికులు ఉండగా, ఆరోగ్యం, విద్యా స్కాలర్‌షిప్, గృహవసతి ప్రధాన సంక్షేమ విభాగాలు.దేశవ్యాప్తంగా 10 ఆస్పత్రులు, 279 డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలు, క్యాన్సర్, టీబీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ మార్పిడి వంటి ప్రత్యేక చికిత్సలకు సహాయం అందించాల్సి ఉండగా ఇవన్నీ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
బీడీ కార్మికుల పిల్లలకు మొదటి తరగతి నుంచి కళాశాల, యూనివర్సిటీ వరకు సంవత్సరానికి రూ.వేయి నుంచి రూ.25వేల వరకు విద్యా సహాయం అందించాల్సి ఉండేది. కార్మికుల ఇండ్ల నిర్మాణానికి రుణాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, డిస్పెన్సరీలు, ఆసుపత్రులు, సంచార వాహనాల ద్వారా వైద్య సేవలు గతంలో అందేవి. ప్రస్తుతం వీటిని నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడం వల్ల బీడీ కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.బీడీ పరిశ్రమ నడవడానికి కార్మికుల శ్రమే ప్రధాన ఆధారం. కార్మికులు వేలాది బీడీలు చుట్టి, ప్యాకింగ్ చేసి పరిశ్రమకు ఉత్పత్తిని అందిస్తున్నారు. అందువల్ల పరిశ్రమపై విధించే ప్రత్యేక సంక్షేమ సెస్‌లో కార్మికుల సంక్షేమానికి స్పష్టమైన వాటా ఉండాలి. మరోవైపు బీడీ పరిశ్రమ యాయజమానులు కూడా కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి, వేతనాలు పెంచడం లేదు. పైగా తునికాకు, పొగాకులో నెలకు వెయ్యి నుంచి రెండు వేల వరకు బీడీల్లో కోతలు విధిస్తున్నారు.
కొన్ని పరిశ్రమల్లో పూర్తి కూలి చెల్లించకపోవడంతో పాటు చెల్లించిన కూలీ నుంచి తిరిగి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో బీడీ కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారు. అందుకే బీడీ వెల్ఫేర్ సెస్‌ను పునరుద్ధరించి, సెస్ ద్వారా వచ్చే మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికే వినియోగించాలి. ప్రత్యేక బీడీ కార్మికుల సంక్షేమ నిధి లేదా సంక్షేమ బోర్డును బలోపేతం చేయాలి. ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో సమగ్ర వైద్య సేవలందించాలి. పిల్లలకు విద్యా స్కాలర్‌షిప్‌లు, కుటుంబాలకు గృహ నిర్మాణ సహాయం, వృద్ధాప్యం, అనారోగ్యం, వైకల్యం వంటి పరిస్థితుల్లో సామాజిక భద్రతా పెన్షన్‌ను మెరుగుపరచాలి. బీడీ కార్మికుల బతుకులు ప్రభుత్వాల దయపై ఆధారపడకుండా చట్టబద్ధమైన హక్కులుగా సంక్షేమం అమలు కావాలి. జీవనభృతి పెంపు, కనీస వేతనాలు, రిటైర్మెంట్ పెన్షన్, వైద్యం, విద్య, గృహవసతి వంటి హక్కులను తక్షణమే అమలు చేయాలి. బీడీ పరిశ్రమపై పన్నులు, ఆంక్షలు విధించే ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ బాధ్యతను కూడా విస్మరించకూడదు. ముఖ్యంగా ఇంటి వద్ద బీడీలు చుట్టే మహిళా కార్మికులతో సహా ప్రతి కార్మికుడికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. బీడీ కార్మికుల శ్రమతో పరిశ్రమలు నడుస్తున్నప్పుడు.. వారి బతుకులు మాత్రం సంక్షోభంలో ఉండటం అన్యాయం. ఈ అన్యాయానికి ముగింపు పలికేందుకు యాజమాన్యాల శ్రమదోపిడీకి, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అన్ని కేటగిరీల బీడీ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి. ఐక్య పోరాటమే హక్కుల సాధనకు మార్గం.. సంఘటిత శక్తే బీడీ కార్మికుల భవిష్యత్తుకు భరోసా.
గొడ్డుబర్ల భాస్కర్
9849934514



