Saturday, August 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరాజ్యాంగ తిరస్కారం, రిపబ్లిక్ విధ్వంసం

రాజ్యాంగ తిరస్కారం, రిపబ్లిక్ విధ్వంసం

- Advertisement -

భారత స్వాతంత్ర్య పోరాట క్రమంలో రూపొందిన సూత్రాల ఆధారంగా భారతీయ ప్రజాస్వామ్య స్వభావం ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తులో మూడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత రాజ్యాంగం స్థాపించబడటం యాదృచ్ఛికమేమీ కాదు. అలా రూపొందిన విలువలు, భావాల వ్యవస్థీకృత సారాంశమే అది. ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు పాటిస్తున్న, అనుభవంలోకి వచ్చిన సూత్రాలలో కొన్నిటిని స్వీకరించడం, కొన్నిటిని పద్ధతులుగా స్థిరపర్చడం జరిగింది. భారతీయ ప్రజాస్వామ్యం, దాని విస్తరణగా భారత రాజ్యాంగం మక్కీకి మక్కీగా పాశ్చాత్య పద్ధతులకు అనుకరణ ప్రతిలాంటివి కనుక పెద్దగా భారతీయమైనవి కాదనే వాదనకు భిన్నమైన వాస్తవమిది. ఆరెస్సెస్‌ దాని అధికార పత్రిక ‘ఆర్గనైజర్‌’ ప్రకటించిన భారతీయత చర్రిత ముందు, వాస్తవాల ముందు నిలిచేదికాదు. రాజ్యాంగ పీఠిక ‘భారతీయుల మైన మేము’ అనే మాటలతో ప్రారంభం కావడం యాదృచ్ఛి కం కాదు. భారీ స్థాయిలో వున్న జనాభా, జనసంఖ్య భిన్నత్వం, సుసంపన్నమైన వైవిధ్యం గుర్తించే విధంగా రాజ్యాంగం రూపొందింది. ఆర్థిక, రాజకీయ, సార్వభౌమత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వ భావనలు మిళితం చేసుకున్న సంస్థాపక సూత్రాలు రూపొందాయి.

ఏమైనా భారత ప్రజాస్వామ్యం పనిచేస్తున్న తీరుపై దేశంలోనే గాక ప్రపంచంలో వేర్వేరు చోట్ల సందేహాలు, విమర్శలు కూడా పెరుగుతున్నాయనే విషయంలో మరో మాటకు ఆస్కారమే లేదు. ప్రధానమైన ఆందోళన ప్రజాస్వామ్యం గురించీ, దానికి పునాదిగా నిలవాల్సిన ఒక మనిషికి ఒక ఓటు అనే సూత్రం గురించి. దీన్ని అమలు చేయడానికి కొన్ని ప్రక్రియలున్నాయి. భారత ఎన్నికల సంఘం అనే స్వతంత్ర సంస్థ 18 ఏండ్లు పైబడిన పౌరులందరూ ఓటర్లుగా చేర్చబడేట్టు చూడాలి. గతంలో ఎన్నికల ప్రక్రియ పైన ఏ ఫిర్యాదులూ లేవని కాదు. కానీ స్థూలంగా చెప్పాలంటే ఎన్నికల ఫలితంపై వివాదం లేదు. కానీ ఈ రోజు ప్రత్యేకించి ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్‌)తో ప్రజల పరిశీలనా దృష్టిలో పెద్ద మార్పు వచ్చింది. పాలక కూటమి పాక్షిక ప్రయోజనాలకు అనుగుణంగా ఇసిఐ చేస్తున్న విపరీతమైన తప్పుల పరంపర ఇందుకు కారణమైంది.

సమానతకు తిలోదకాలు
ఈ దేశం మొదలైన తర్వాత మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌‌లో దాదాపు 30 లక్షల మందికి తాత్కాలికంగా ఓటు హక్కు తొలగించబడింది. తక్కిన దేశంలో సర్‌ ‌ప్రక్రియ నడుస్తున్నది. ప్రాథమికంగా పదికోట్ల మంది ఓటరు జాబితాల నుంచి తొలగించబడ్డారు. సువ్యవస్థితమైన నిబంధనలు, పద్ధతులు దారుణంగా ఉల్లంఘించబడుతున్నాయనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. ఇసిఐ వాటిని పట్టించు కోవడంలేదు. ఈ పరిణామంలో అతి ఆందోళనకరమైన కోణం ఏమంటే మతపరమైన లెక్కలతో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలు పాటించడం. పాలక పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు చాలా దుందుడుకు తనంతో కూడిన విద్వేష ప్రచారం సృష్టిస్తున్నారు. సమానత్వంతో కూడిన ఉమ్మడి పౌరసత్వం అనే సూత్రాన్ని దెబ్బతీసే వాతావరణం అంతటా వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెజారిటీ ఆధిపత్య వాదం అంతకంతకూ స్వరం పెంచుతున్నది.

అలా జరగడమంటేనే రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించడం, తోసిపుచ్చడమే అవుతుంది. పౌరుల సమానత్వానికి సంబంధించిన మరో ముఖ్యమైన భాగం దశాబ్ది జనాభా లెక్కలు అనే ఇంకో రాజ్యాంగ కసరత్తుతో నిర్దేశితమైంది. జనాభాను లెక్క వేయడం, వారి సామాజిక, ఆర్థిక జీవిత కోణాలు పార్శ్వాలు వెలికితీ యడం జరుగుతుంది. ప్రణాళిక, అభివృద్ధి ప్రక్రియకు సంబంధించిన కీలకమైన సమాచార వివరాలు అందించడంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం వైపు పయనించడమనేది తిరుగులేకుండా జరిగేలా చూడటం కూడా దీని ఉద్దేశం. రాష్ట్రాలవారీ ప్రాతినిధ్యంలో సమానత వుండేలా కూడా చూడటం జరగాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్దేశిత జనాభా ప్రక్రియ ఏడేళ్లు ఆలస్యమైంది. మొదట్లో కోవిడ్‌ -19 కారణంగా దాన్ని సకాలంలో ప్రారభించలేక పోయామని వివరణ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా మరో ఆరేళ్ల పాటు ఆలస్యం కావడానికి సరైన కారణమే లేదు.

జనాభా లెక్కల మాయ
‘సర్‌’ ‌ప్రక్రియ, జనాభా సేకరణ లెక్కలలో భాగమైన సొంత అంచనా, ప్రశ్నావళి కూడా అదివరకటి పద్ధతులకు స్పష్టమైన తేడాతో వుంది. ఉత్తర, దక్షిణ విభజనపై ఆధారపడిన చర్చ ఇప్పుడు ఇందుకు సందర్భం అవుతున్నది. కేవలం అంకెల ఆధారంగానే ప్రాతినిధ్య స్వభావం నిర్ణయించాలా లేక జాతీయ జనాభా విధానాన్ని ప్రోత్సహించే విధంగా మరేదైనా యంత్రాంగం తీసుకురావాలా? ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తున్న జనాభా పెరుగుదలలో కనిపిస్తున్న కృత్రిమ పెరుగుదల తీరు ఈ సందేహాలకు తావిస్తున్నది. జాతీయ జనాభా విధానం అమలుచేస్తే ప్రోత్సాహం వుండేలా ప్రాధాన్యతనిస్తూ ఈ విషయమై కొత్తగా ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకురావలసిన అవసర ముందని చెప్పింది మరెవరో గాక స్వయంగా అద్వానీనే (జనాభా లెక్కల కమిషనర్‌‌కు, భారత రిజిస్టార్‌ జనరల్‌‌కు 2017లో ‌సీపీఐ(ఎం) అందజేసిన మెమోరాండంలో ఇందుకు సంబంధించిన సూచనలున్నాయి).

జనాభా లెక్కల కీలక ప్రాధాన్యత ఏమంటే అది నియోజకవర్గాల పునర్విభజనతో విదదీయలేని విధంగా ముడిపడి వుంటుంది. నిజానికి మన రాజ్యాంగ అమరిక ప్రకారమైతే ప్రతి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియకు ముందు జనాభా లెక్కల సేకరణ జరగాలి. ఆ తాజా వివరాల ప్రాతిపదికపైనే పునర్విభజన జరగాలి. రాజ్యాంగం ఈ అంశాన్ని నిర్దిష్టంగా పేర్కొంటున్నది. నియోజకవర్గాల పునర్విభజన అనేది అన్ని రాష్ట్రాల పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య స్థూలంగా, సమానంగా వుండేట్టు చూసేందుకు ఉద్దేశించింది. అంటే పరోక్షంగా సీట్ల విభజన అనేది రాజకీయ ప్రక్రియలో రాష్ట్రాల ప్రభావం ఇంచుమించు సమానంగా వుండేలా సమతుల్యంగా పంపిణీ జరిగేట్టు చూడటం దాని బాధ్యత. పారదర్శకత, హేతుబద్దమైన ఒప్పుదల లేకుంటే ఈ తతంగం సహోదర యుద్ధంగా దిగజారే ప్రమాదం చాలా వుంటుంది. కనుక ఆ హేతుబద్దమైన ఒప్పుదల ప్రక్రియ అధికారికంగా ఒక ఏకాభిప్రాయానికి దారితీయాలి. రాజ్యాంగపీఠికలో స్వయంగా అంబేద్కర్‌ ‌పొందుపర్చిన సహోదర భావన స్ఫూర్తి అదే.

ఉనికికే చేటు
కనుక ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ‘భారతీయులమైన మేము’ అన్న దానికి రాజ్యాంగం అత్యధిక ప్రాధాన్యత నిచ్చింది. ఒక సమ్మిళిత ప్రజాస్వామ్యంలో ప్రజలు సమైక్యంగా జీవిస్తూ కలసిమెలసి కృషి చేయాలి. అదే రాజ్యాంగ నిర్దేశం కూడా. కానీ ప్రస్తుత పాలకవ్యవస్థ చేస్తున్న కసరత్తు వివక్షతా పూరితంగా వెలివేత పద్ధతులతో ముప్పు తెచ్చేలా తయారైంది. రిపబ్లిక్‌‌ను తిరగదోడడం స్పష్టంగా కనిపిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఈ మొత్తం తతంగంలో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ అనే భావనపై ఆధారపడి నడుస్తున్నది. వారి మతాన్ని సామాజిక, ఆర్థిక ప్రతిపత్తినీ, లింగభేదాన్ని బట్టి అసలు ఉనికే లేకుండా చేసేలా సాగుతున్నది. వెలుపలి వారు, చొరబాటుదారులతో భారత దేశ జనాభా నిండిపోయిందనే అభిప్రాయం కలిగిస్తున్నది.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మితవాద అభివృద్ధి నిరోధక వర్గాలు వలసదారులకు వ్యతిరేకంగా సాగిస్తున్న విష ప్రచారాన్ని దాదాపుగా పోలిన పరిస్థితి ఇది. ప్రజల నిజమైన సమస్యలైన కూడు, గుడ్డ, నీడ, చదువు, ఆరోగ్యం వంటి కీలక ఆందోళనలను పక్కదోవ పట్టించే పని కనుక సంకేతాలు చాలా స్పష్టంగా తీవ్రంగా వున్నాయి. ఒక వినాశకర పోకడ వైపు దేశాన్ని నడిపించే హానికర అంశాల ప్రాతిపదికగా భారత దేశాన్ని వెనక్కు మళ్లించే వ్యవహారం. దీనిపై యువ స్వరాలు జెన్‌ ‌జీ, ‌జెన్‌ ఆల్ఫా ఇప్పటికే పోరాట పతాకం ఎత్తడం కనిపిస్తూనే వుంది.
(ఆగస్టు 26‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -