నవతెలంగాణ – భువనగిరి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ మాత్రం పురోగతి లేదని, ప్రభుత్వానికి ప్రాజెక్టులపై కాదు కమీషన్లపైనే శ్రద్ధ ఉందని సీపీఐ(ఎం) నేతలు మండిపడ్డారు. శనివారం భువనగిరి డా.బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల నిధుల సాధనకై సీపీఐ(ఎం) చేపట్టిన 3 రోజుల పాదయాత్రను మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య ప్రారంభించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. 2006లో ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) 2000 కి.మీ, రెండు నెలల పాదయాత్ర చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
అప్పుడు రూ. 20 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును పట్టించుకోక ఇప్పుడు వందల కోట్లకు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వరుణ యాగాలు చేస్తున్నారని, గోశాలలకు రూ.50 కోట్లు ఇస్తారు కానీ రైతుల సాగునీటికి నిధులు ఇవ్వరని ఎద్దేవా చేశారు. విషపూరిత మూసీ నీటితో ప్రజలు, పశువులు రోగాల పాలవుతుంటే మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ లో పర్యాటక హంగులు చేస్తున్నారని విమర్శించారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలో 7 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే 4 లక్షల ఎకరాలు సాగు కావడం లేదన్నారు. ప్రస్తుత కరువుతో 2 లక్షల లోపే సాగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన, గోదావరి అనుసంధానం చేస్తే 7 జిల్లాలకు మేలు జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి కలలు కనే ఫ్యూచర్ సిటీపై పెట్టే శ్రద్ధలో సగం ఈ ప్రాజెక్టులపై పెడితే యాదాద్రి ప్రాంతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల మాదిరిగా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. పాదయాత్ర సందర్భంగా సాగు తాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న 9 డిమాండ్లను అసెంబ్లీలో చర్చించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేకుంటే రైతులను కూడగట్టి పెద్ద పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 31న హైదరాబాదులో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లాలో 22 ప్రాజెక్టులు, కాల్వలు పెండింగ్ లో ఉన్నాయని, బస్వాపూర్, గందమల్ల, చర్లగూడెం బహుళార్థ ప్రాజెక్టులు, బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, ఆసిఫ్ నహర్ కాల్వలు పూర్తి కాలేదన్నారు. జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇన్చార్జి మంత్రి ఉన్నా ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, గందమల్లకు రూ.450 కోట్లు కావాలంటే రూ.80 కోట్లే ఇచ్చారని ప్రశ్నించారు. 2003లో ధర్మారెడ్డి, 2005లో పిల్లాయిపల్లి, 2006లో బునాదిగాని కాల్వలు ప్రారంభమైన నేటికి పూర్తి కాలేదన్నారు. మూసీ మురుగు వల్ల క్యాన్సర్, చర్మ, గర్భస్రావ వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉప అధ్యక్షులు మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఈర్ల ముత్యాలు, గూడూరు అంజిరెడ్డి, గడ్డం వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.






