మనకు దూరంగా మాల్దీవులు!

మాల్దీవులు ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటే కావచ్చు. కానీ అది ఉన్న ప్రాంతం కీలకమైనదిగా మారడంతో ఎంతో ప్రాధాన్యత సంత రించుకుంది. మన దేశంలో అది పెద్ద చర్చనీయాంశంగా మారిందంటే గతంలో దానికి ప్రాముఖ్యతలేదని, ఇప్పుడే కొత్తగా వచ్చిందని కాదు. మన దేశాన్ని, ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను దానికి తగిన బుద్ది చెప్పాలని, అందుకు మన విహారయాత్రీకులు అక్కడికి వెళ్లటం మానుకోవాలని పిలుపునిస్తున్నారు. ఒక విమానయాన సంస్థ ఇప్పటికే నిరవధికంగా విమాన ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది, హో టల్‌ బుకింగులను కూడా మన వారు రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చా యి. కొందరు క్రీడాకారులు, సినీతారలు కూడా స్పందించారు. గరిష్టంగా విహార యాత్రీకులను పంపుతున్న మన దేశాన్ని, ఫ్రధానిని కూడా అలా కించపరుస్తారా అని మండిపడ్డారు. ఇంత చేస్తే మౌనంగా ఉండాలా అన్నది సహజంగానే తలెత్తే ప్రశ్న. ఇంతకూ చేసిన విమర్శలేమిటి ?
మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయిల్‌ తొత్తు అని పేర్కొ న్నారు. మన దేశానికి చెందిన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహిం చేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశా నికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావిం చారు. ప్రధానిని కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిర సన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్య క్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప ప్రభుత్వ వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగిన దాని మీద అధ్యక్షుడు ముయిజ్జు విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. సామాజిక మాధ్యమాల్లో ఒక దేశం, దాని నేతల గురించి మరొకదేశంలో పౌరులు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిం మచటం తెలిసిందే. మా ల్దీవుల పౌరులు ఎవరైనా అలా చేసి ఉంటే అసలు సమస్యే తలెత్తేది కాదు, మంత్రులు గనుక రచ్చ జరి గింది. అనుచిత వ్యాఖ్యలను ఖండించాల్సిందే.
లడక్‌ సరిహద్దు ఘర్షణల తరువాత చైనా వస్తువులను బహిష్క రించాలని, అక్కడి నుంచి దిగుమతులు నిలిపివేస్తే డ్రాగన్‌ దేశం మన కాళ్లదగ్గరకు వస్తుందంటూ సామాజిక మాధ్యమాలన్నింటా విపరీతంగా ప్రచారం జరిగింది. అది అధికారిక వైఖరి కాకపోవటంతో ఎలాంటి సమ స్యా తలెత్తలేదు. అలాంటి పోస్టు పెట్టిన వారిని ఖాతరు చేయకుండా నరేంద్ర మోడీ సర్కార్‌ రికార్డులను బద్ద లుకొడుతూ దిగుమతులు చేసుకుంటు న్నది, రూ.వందల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని చైనాకు చెల్లిస్తున్నది. రామాయణంలో ఉడత సాయం గురించి చెప్పుకొనే మనం ఒక చిన్న దేశం, అదీ మన విదేశీ పర్యాటకులు చెల్లించే సొమ్ము మీద ఆధార పడుతున్న దేశం మన మాట వినదా అనే దురహంకారానికి లోనైతే ప్రయోజనం లేదు.అక్కడికి వచ్చే యాత్రీకుల్లో ప్రస్తుతం మన వాటా పదకొండు శాతమే. ఉడత రాముడికి సాయం చేస్తే మరోవైపు రావణుడికి హాని చేసినట్లే. అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పాల్సి వస్తోంది. మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా గతంలో తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, ఈ నెల 8 నుంచి 12వరకు చైనాలో పర్యటించారు. బహుశా ఈ పరి ణామం మన కేంద్ర ప్రభుత్వానికి అవమానకరంగా తోచిందా?
రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గం లో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్య మైనది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడి వడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. 2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి తాము వైదొలుగుతున్న మాల్దీవుల అధికారులు 2023 డిసెంబరు 14న తెలిపారు.తమ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు తప్ప చైనాకు దగ్గరవుతున్నందున ఈ నిర్ణయం తీసుకో లేదని అన్నారు. అక్కడ ఉన్న కొద్దిమంది మన సైనికులు కూడా వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో అట్టడుగు జలాల్లో పరిశోధనలు చేసేందుకు తమ యువాన్‌ వాంగ్‌ నౌక లంగరు వేసేందుకు అనుమతించా లని మాల్దీవులను కోరటం గమనించాల్సిన అంశం. మాల్దీవుల మొగ్గు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది.

Spread the love