బంధాలకు షరతులా..?


”అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుతున్న నాటకం, వింతనాటకం – ఎవరు తల్లి, ఎవరు కొడుకు, ఎందుకు ఆ తెగని ముడి, కొన ఊపిరిలో ఎందుకు, అణగారని అలజడి, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి?” అనే తాతామనవడు సినిమా పాటలోని పాదాలు, నేటి అనుబంధాల తీరు తెన్నులకు అద్దం పడతాయి. ఆ పాట పుట్టి అర్థశతాబ్దం దాటింతర్వాత కూడా, ఆ భావానికి మరింత సమకాలీనత పెరుగుతన్నదంటే, మనం అమానవీయంగా మారుతున్నామని అర్థం. సమాజం మారటం అనివార్యమే. కానీ, ఏ విధంగా మారుతున్నది? అదీ చర్చించాల్సిన విషయం. యాభైఏండ్లకూ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. వస్తుసేవల్లో అభివృద్ధి జరిగింది. సౌకర్యాలూ పెరిగాయి. టెక్నాలజీ పెరిగింది. విజ్ఞానం పెరిగింది. ఆలోచనా పరిధి విస్తరించింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. విద్య పెరిగింది. అవకాశాలూ పెరిగాయి. ఆదాయాలూ పెరిగుండొచ్చు. కానీ అలజడులు, ఆవేదనలు, దుఃఖాలు, దూరాలూ అంతకంటే ఎక్కువగానే పెరిగాయి. మానవ సంబంధాలు అన్నీ స్నేహరాహిత్యంగా ప్రేమ రాహిత్యంగా మారాయి. అంతే కాదు, సంబంధాల్లోని అనుబంధాలన్ని అడుగంటి పోతున్నాయి. ఇవి కుటుంబాలలో తీవ్ర సంక్షోభాలను సృష్టిస్తున్నాయి. మనసు చెమ్మదనాలు లేవు. అసలు మనసుకే స్థానం లేదు. అంతా లాభనష్టాల బేరీజులే. కరెన్సీ చూపులే. కరుణ రహిత దృశ్యాలే. కాఠిణ్యపు తత్వాలే.
ఇందుకు నిలువెత్తు ఉదాహరణ… ఇటీవల సుప్రీంకోర్టు తల్లిదండ్రులకు చేసిన సూచన. పిల్లలకు ఆస్తులు బహుమతిగా ఇచ్చే సందర్భంలో రాసే గిఫ్ట్‌ డీడ్‌లో… వృద్ధాప్యంలో తమను బాగా చూసుకోవాలన్న షరతును పెట్టాలని కోర్టు సూచించింది. అలా లిఖితపూర్వకంగా లేకపోతే, తమపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న కారణాన్ని చూపించి గిఫ్ట్‌డీల్‌ను రద్దుచేసుకోలేరని వివరించింది. గురుగావ్‌కు చెందిన ఓ మహిళ తన ఆస్తిని ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారునికి రాసిచ్చింది. అయితే వారు తనను చూసుకోవడం లేదన్న కారణంతో బహుమతిగా ఇచ్చిన డీడ్‌ను రద్దు చేసింది. పిల్లలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవమేనని గుర్తించిన ట్రిబ్యునల్‌ ఆమె నిర్ణయాన్ని సమర్థించింది. పంజాబ్‌, హర్యానా హైకోర్టు కూడా అంగీకరించింది. కానీ సుప్రీంకోర్టులో పిల్లలు అప్పీలు చేయడంతో ఈ షరతు రాయని కారణంగా తల్లి నిర్ణయాన్ని కొట్టేసింది. కాబట్టి పిల్లలకు ఆస్తి ఇచ్చే సందర్భంలోనే వారిని సాకాలని షరతు విధించడం అవసరమని కోర్టు తేల్చి చెప్పింది.
ఇప్పుడు షరతులపై తల్లిదండ్రుల జీవితాలు కొనసాగుతాయి తప్ప కొడుకులు చూసుకోవాలన్న నియమం చట్టపరంగా ఏమీ సంక్రమించదు. ఏదో కూడబెట్టిన ఆస్తి ఉన్నప్పటి విషయమిది. కానీ పిల్లలను పుట్టినప్పటి నుండి ఎంత శ్రమ చేసి పెంచుతారు తల్లిదండ్రులు! ఎన్ని అగచాట్ల కోర్చి, శ్రమల కోర్చి, రెక్కలు ముక్కలు చేసుకుని బాధ్యతగా, అపురూపంగా పెంచుతారు పిల్లలని. దానికి ఏ షరతూ లేదు కదా! అదంతా తమకు తాము విధించుకొన్న షరతులు… ఎక్కడ రాసిపెట్టుకోవాలి! సమాజం నాగరికంగా, మానసికంగా ఎంతో ఎదిగిందని చెప్పుకుంటున్నాం కదా! ఇంత అభద్ర, అనిశ్చితిలోకి నెట్టివేయబడటంలోని వ్యవస్థ వికృతి గమనాన్ని ఒకసారి ఆలోచించాలి. సమాజ పరిణామంలో అమానవీయత ఎలాపెరిగిపోతున్నదో జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎక్కడో గురుగావ్‌ సంఘటన మాత్రమే కాదు. ప్రతి కుటుంబంలో తలెత్తుతున్న సమస్య. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఆస్తులున్నా, అంతస్తులున్నా తమ చేతుల్లో పెరిగిన పిల్లల తిరస్కరణకు గురవుతూ గుండెల్లో బండెడు బాధను మోస్తున్న వారెందరో దర్శనమిస్తూనే ఉన్నారు. తిరస్కరణ అనేది చిన్నమాట. ముసలి తల్లిదండ్రులను వొదిలించుకోవటానికి చేయని పనంటూ ఏదీలేకుండా పోతోంది. ఆఖరకు ఆస్తుల కోసం చంపుతున్నారు కూడా. తల్లిదండ్రులను చూడకపోవటానికి ఆస్తుల మీద ఆశ, స్వార్థ చింతన ఒకకారణం కాగా, రెండోవైపున దారిద్య్రం, లేమితనం కూడా కారణమవుతున్నది. ఏదేమైనా కుటుంబ సంబంధాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
నేటి కొడుకులూ, కూతుళ్లే రేపటి తండ్రులూ తల్లులూ. వాళ్లూ ఈ వ్యవస్థ సృష్టించే ఘోరకలిలో బాధితులవక తప్పదు. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని మార్క్స్‌ చెప్పిన మాట ఎంత సత్యమైనదో నిరూపించటానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి! ఇది కేవలం వ్యక్తుల్లో కలిగే ఆలోచనమాత్రమే కాదు. దుర్మార్గపు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతి ఫలనం. అందుకే మనం మానవీయ సమాజం కోసం ప్రయత్నం కొనసాగించాలి. అందుకోసం కదులుతున్నవారితో చేతులు కలపాలి.

Spread the love