కావాల్సింది అంకుశాలే…

ఇప్పుడు వాతావరణ రీత్యా శీతాకాలం నడుస్తోంది. దాంతోపాటు బడ్జెట్ల కాలం ముందుకొస్తున్నది. ఈ సీజన్‌ ఇటు రాజకీయ పరంగా.. అటు ఆర్థిక పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకం. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు ఎంత బలంగా ఉంటే కేంద్రం అంత బలంగా ఉంటుందంటూ మన పెద్దలు ఏనాటి నుంచో చెబుతూ వస్తున్నారు. కానీ నేటి మోడీ సర్కారు ఆ వాస్తవాన్ని విస్మరించి రాష్ట్రాలను బిచ్చగాళ్ల కంటే హీనంగా చూస్తూ అడుక్కు తినేలా చేస్తోంది. నిధుల విషయంలో అనేక కొర్రీలు వేస్తూ ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేస్తున్నది. తెలంగాణ విషయంలోనూ ఇదే తంతు నడుస్తున్నది. గత ఎనిమిదిన్నరేండ్లుగా రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్‌, బడ్జెటేతర నిధులు, గ్రాంట్లు, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు ప్యాకేజీలు, ఇతర ఆర్థిక సాయాల విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదంటూ పలువురు మంత్రులు ఆవేదన వ్యక్తం చేయటం సత్యదూరమేమీ కాదు. నిధుల విషయంలో తెలంగాణ పట్ల మోడీ సర్కారు కొనసాగిస్తున్న వివక్ష ఇటీవల మరింత పరాకాష్టకు చేరిందని చెప్పొచ్చు. పంట పొలాల్లో ఉపాధి హామీ నిధుల ద్వారా కల్లాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఫలితంగా వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు పనులు దొరకగా.. రైతులకు ఈ కల్లాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే వాటి నిర్మాణం కోసం వెచ్చించిన రూ.150 కోట్ల నిధుల్ని తిరిగి తమకు ఇచ్చేయాలంటూ కేంద్రం హుకూం జారీ చేయటం అత్యంత దారుణం. దీంతోపాటు గతంలో ఉపాధి కింద చేసిన పనులకు గాను కూలీలకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను ఇప్పటిదాకా రాష్ట్రానికి విడుదల చేయకుండా తాత్సారం చేయటం ద్వారా మోడీ ప్రభుత్వం అత్యంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపే గాకుండా పేద కూలీల పొట్టగొట్టడం కూడా. ఇది రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
ఇక రాష్ట్ర సర్కారు వైపు నుంచి చూస్తే… తెలంగాణలోని పరిశ్రమలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, ఐటీ, చేనేత, జౌళి, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర రంగాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వ పెద్దలు అనేకసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీయేడాది సెంట్రల్‌ బడ్జెట్‌ సందర్భంగా ఆయా రంగాలపై శ్రద్ధ వహించాలంటూ కోరుతూ వస్తున్నా… మనకు అందింది సున్నా. ఆయా రంగాల కోసం కేంద్రం తెలంగాణకు అందించిన ప్రోత్సాహాలు, రాయితీలేవీ లేకపోవటం ఆందోళనకరమే. మంత్రి కేటీఆర్‌ ఇదే విషయమై ఇటీవల లేఖల మీద లేఖలు రాసిన సంగతి విదితమే. అయినా ఢిల్లీ పెద్దలకు చీమ కుట్టినట్టయినా లేకపోవటం అత్యంత శోచనీయం. వచ్చే ఏడాది (2024)లో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి… మోడీ సర్కారు ఈ యేడాది మార్చిలో ప్రవేశపెట్టబోయేదే పూర్తి స్థాయి బడ్జెట్‌ అవుతుంది. ఆ తర్వాత 2024లో సమర్పించబోయేది ఓటాన్‌ అకౌంట్‌ మాత్రమే. అందువల్ల ఈ యేడాది నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే పద్దు… అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా దేశానికి, తెలంగాణకు అత్యంత కీలకమైన బడ్జెట్‌. అందులో ఏమైనా రాయితీలు, ప్రోత్సాహకాలు, అదనపు నిధులు, గ్రాంట్లు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇక్కడే మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. గత ఎనిమిదిన్న రేండ్లుగా కేంద్రం రాష్ట్రం పట్ల తీవ్ర వివక్షను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా బీఆర్‌ఎస్‌ గానీ, కేసీఆర్‌ సర్కారు గానీ అంతగా పట్టించుకున్న దాఖలాల్లేవు. మోడీ సర్కారు వైఖరిపై సీఎం నుంచి అమాత్యుల వరకూ ప్రకటనల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించటం, ప్రెస్‌మీట్లలో పరుష పదజాలంతో విరుచుకుపడటం తప్పితే ఇతమిద్ద్దంగా కార్యాచరణ ప్రకటించిందీ లేదు.. పోరాటం సల్పిందీ లేదు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయటం, జాతీయ రహదారులను దిగ్బంధించటం మినహా కేంద్రం చర్యలపై పోరాడింది లేదు.. ఇదే విషయమై ఒక మంత్రినీ, మరో ఎంపీనీ ప్రశ్నించినప్పుడు… ‘మమ్మల్ని ఏం చెయ్యమంటవ్‌.. కేంద్రం మీద బాంబులెయ్యమంటవా…’ అంటూ ఛలోక్తి విసిరి తప్పించుకున్నారే తప్ప స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవటం విషాదకరమైన అంశం. కానీ ఆ అమాత్యుడు, లోక్‌సభ సభ్యుడే కాదు… సీఎం కేసీఆర్‌ సాబ్‌ కూడా గుర్తించాల్సింది ఏమంటే… ‘రాష్ట్రాలను చిన్న చూపు చూస్తున్న మత్తగజం లాంటి కేంద్రం మెడలు వంచాలంటే చిన్న చిన్న సూదులు, దబ్బణాలు సరిపోవు. దాన్ని వంచి, మన నిధులను మనం దక్కించుకోవాలంటే పెద్ద పెద్ద అంకుశాలకు పని చెప్పాల్సిందే…’ ప్రజలను సమీకరించి, ప్రతిపక్షాలను కలుపుకుని పెద్ద పెద్ద పోరాటాలు చేయటమే ఆ అంకుశాలు తప్ప వేరేమీ కాదు.

Spread the love