Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

- Advertisement -

షబ్బీర్ అలీ.. రామేశ్వరం పల్లి పీఏసీఎస్‌ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
భిక్కనూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.200 కోట్లు
నవతెలంగాణ – భిక్కనూర్

మండలంలోని రామేశ్వర్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన పీఏసీఎస్‌ చైర్మన్‌గా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన చైర్మన్‌, పాలకవర్గ సభ్యులను నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతుందని పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

పీఏసీఎస్‌లు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల సమస్యలకు పరిష్కారం చూపే కేంద్రాలుగా మారాలని అన్నారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భిక్కనూర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయని, దీనిని భిక్కనూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నూతన చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డిని అభినందించిన షబ్బీర్ అలీ, రైతులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమాన సేవలు అందించాలని సూచించారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని తెలిపారు.

రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడంలో పీఏసీఎస్‌ చైర్మన్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, తిప్పాపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సోసైటి చైర్మన్ శ్రీనివాస్, సందీప్, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -