Saturday, August 29, 2026
E-PAPER
Homeకథనీడల దృశ్యం

నీడల దృశ్యం

- Advertisement -

పొద్దు నిలబడ్డది. పిట్టల అరుపులు పిసపిసలాడుతున్నాయి. శనిగ చేనుకు నీళ్లు కడుతున్న పాలేరు రంగన్న ముఖం మీద చిల్లిన మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కొట్టం నిండా పేడకళ్ళు రంగన్న చేతుల కోసం ఎదురుచూస్తున్నవి. అదను ఎత్తిపోతే తడి పెట్టినా లాభం లేదనుకొని పొద్దటి కరెంటు కదా ఏగిలివారంగనే వచ్చి బాయిల నీళ్ళు అయిపోయేదాకా చేనుకి నీళ్లు కడుతూనే ఉంటడు రంగన్న. “ఏమిరా రంగ మొక్కజొన్న షేను సూతుంటే పానం కాయిసు పడుతుందిరా! కంకులు ఇప్పుడే పీస్ పెడుతున్నట్లున్నాయి జెర షేను మీద మనసు పెట్టరా” అనీ దొర మీసాలను మెలిపెడుతూ చెప్పిన మాటలకు తలపాగా తీసి సంకన పెట్టుకున్న రంగన్న ‘అట్టగే దొర’ అనీ తల ఊపాడు. ఊర్లో మోతుబరి రైతులల్లో కొమురారెడ్డి ఒకరు. పెద్ద మీసాలు నిత్యం సిగరెట్లను కాల్చే అలవాటు. ఒంటి కన్నుసూపు చూసేవారికి కొంత భయం కలిగేలా ప్రవర్తన ఆయన సొత్తు. కూలోల్ల యాళ్ళైంది. బాట పొంటి ఎడ్లబండ్లలో వస్తున్న కూలీ జనం ఎవరి ముచ్చట్లలో వాళ్లు మునిగిపోయారు. ఉల్లి నాటు పెట్టేవాళ్ళు కొందరు కొంగు భారం దించుకునేందుకు పైటలు సదురుకుంటున్నరు.​మరికొందరు కొట్టంకాడున్న కందిమండల పొరకను ఏరేస్తున్నారు. ఏండ్ల సంది కూలినాలి చేసుకొని బతికే జనంకి దొరల షేనులు ఆసరా! పొయిల మండే కట్టెపుల్లల గాంచి దొరోల్లకంచెలు పేద బతుకులకు అండదండ. రంగన్న దొడ్డి సాపు చేశాడు. దొర మంచె సదిరిపెట్టిండు. వాతావరణం అనుకూలించాలి గాని దొరకు ఊరుతో పనే ఉండదు.

పొద్దస్తమానం షేనుకాన్నే ఉంటడు. ఆడ కూలీలతో పరాచికాలు మాట్లాడుతూ ఓరగండ్లతో చూస్తాడు. ఆపొద్దు కొత్తగా పనిలోకి వచ్చింది జానకి. ఆమె పసిడివర్ణంలా మెరుస్తుంది. కోల ముఖంలో ఉన్న ఆమె పేదింటి పిల్ల. రంగన్నకు కావలసిన చుట్టపు సూపు. కన్నులపై బొమ్మలు నల్లటి రేఖలను దిద్దినట్లుంది. బక్కపల్సని పెయికి భారమైన ఎద. చూపరులను ఆకర్షించే పెదాలు, ఎండకు వాడిన ఒంట్లోంచి సంకలు తడిచిన చెమటల్లో ఆమె వనదేవతలా కనిపిస్తుంది. ​పనికొచ్చిన ఆడోళ్ళను పలకరించే తనమున్న కొమురారెడ్డి కండ్లు జానకి మీద కురిసినవి. ఇంకేముంది పిక్కలు కనబడేలా పైట కట్టి ఉల్లి చేనులో నాటు వేస్తున్న జానకి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఆ ఊర్లో రెండు రోజులు అయితే మారెమ్మ జాతర. ఊరు ఊరంతా జాతర పనుల్లో ముమ్మరంగా పాల్గొంటున్నరు.
పుట్టమన్నుతో అలికిన ఇండ్లకు ఎర్రమన్నుతో సొగసులు దిద్ది తెల్లబొట్లతో ముగ్గులు పెట్టి మురిసిపోతున్నరు. ఊర్లో జరిగే జాతరకు బంధువులను కూడా పిలుచుకుంటున్న జనం కొందరు. అలా ఆ ఊరికి వచ్చింది జానకి. పాలేరు భార్యతో ఇదివరకే సంబంధమున్న కొమురారెడ్డికి ఎలాగైనా జానకిని ఓ పట్టుపట్టాలనీ పన్నాగం పన్నిండు. జాతర శురువైనది ఊర్ల జనమంతా ఎడ్లబండ్లకు రంగులు పులిమి ఎద్దులను కూడా అలంకరించారు. ఊరులో కోదండరామస్వామి గుడి చుట్టూ తిరిగే ఆనవాయితీ ఉంది. సాయంకాలం తంతు మొదలైనది. ​రంగడు కూడా దొరగారి సవారీ కచ్రంను సింగారించి దొరసానితో పాటూ మిగతా దొర తాలూకు బంధువులను తోలుకపోవడానికి సిద్ధంగా ఉన్నడు. జానకిని స్వయంగా తయారుచేస్తుంది పాలేరు భార్య. దొరగారి ఓరచూపుల కింద నలిగిన జానకి రూపం లేత గులాబీ రంగులో మెరుస్తుంది.

‘‘ఔను జానకి ఈ ఊరును చూస్తే ఏమనిపిస్తుంది?”
“ఏముంది పిన్నీ చిన్నప్పటి నుండి పల్లెటూరులో పెరిగిన దానిని కదా పల్లె జనం స్థితిగతుల గురించి తెల్వదా ఏందీ! ఐనా ఈ ఊరెందుకో బాగా నచ్చింది. ఊర వాగు దగ్గర పంటపొలాలు చూడ ముచ్చటగా ఉన్నయి అక్కడి ఈత చెట్లగుంపులైతే బాగున్నవి. ఆ వాగులో జారే నీళ్లు జలపాతాన్ని గుర్తుకు తెస్తవి” అంటూ ముచ్చట్లలో బడి పోయారు. ఇంతలో దొర ఇంట్లో కాలుజారి పడిపోయిండన్న వార్త దొర గుమస్తా రంగని ఇంటికొచ్చి చెప్తూ, అందరూ మారెమ్మ జాతరకు వెళ్ళారు పాపం ఆయనకు కాపడం పెట్టే వాళ్లెవరూ లేరంటూ, రంగని భార్యని త్వరగా వెళ్ళమని పురమాయించాడు. వెంటనే జానకిని వదిలి ఆమె దొరుండే ఇంటివైపుకు పరుగులు తీసింది. అరెకురం ఉండే ఇంట్లో దివిటీల వెలుగులు కన్నులను మైమరిపిస్తోంది. పందిరంతా విరగబూసి రాలిన మల్లెల వాసనలు మత్తును గొలుపుతున్నవి. ​సన్నని చీకట్లు గోడలకు గొడుగులు పడుతున్నవి. ఇల్లంతా నిశ్శబ్దం. సర్రున దొరా దొరా అంటూ లోనికి వెళ్ళిన రంగని భార్యకు ఎక్కడా దొర కనిపించలేదు. చుట్టూరా చూస్తూ బంకులన్నీ వెతుకుతుండగా ఆమె చూపులు ఓచోట వాలాయి. తెల్లని దుస్తుల్లో నింపాతిగా మందుతాగుతూ కూసున్న దొరను చూసింది.

“రావే.. రా.. రా.. నీకోసమే ఎదురుచూస్తున్నా! ఆ చంద్రుడు చూడు నీ ముఖంలో బొట్టుగా చేరిపోయాడు ఆహా.. ఏమి సక్కదనమే” అని తూలుతుండగా దొరను అమాంతం తన చేతుల్లోకి తీసుకొని మంచం మీద కూర్చోబెట్టబోయిన ఆమెను కళ్లలో కల్లుపెట్టి చూస్తూ గత జ్ఞాపకాలను ఓ సారి కళ్ళముందు ఉంచాడు. “ఓహో.. దొరగారికి బానే గుర్తొచ్చాం” అంటూ నిష్టురాలు పలికిన ఆమెను బలమంతా ఉపయోగించి ఒళ్ళోకి లాక్కున్నడు దొర. కాసేపు పెనుగులాట, గాజులు ఒకదానితో ఒకటి తాకుతూ పెళ్లున పగులుతున్నవి. అధికారానికి ఆడతనానికి మధ్య యుద్ధం ముదిరింది. ఆ చీకటి గదిలో దివిటీలు కాంతులు ఈనక చిన్నబోయినవి. ఇంకా ఆ మత్తులో నుండి బయటపడని పాలేరు భార్య పట్టపురాణిగా ఊహల్లో తేలుతుంది. ఇంతలో ఆమె మెడకు కాసులపేరును వేసి మనసులో ఉన్న మాటను చెప్పాడు. ​ఎలాగైనా జానకిని ఓ పాలి మన మొక్కజొన్న చేనుకు తీసుకురా.. అనీ అంటుండగానే రంగని భార్య “ఎందయ్యా అదీ పెళ్ళీడుకొచ్చిన పిల్ల అందులో సుట్టపు సూపుగా వచ్చింది అదేట్లా ఇంటదయ్యా నా మాట” అని సాకులన్నీ చెప్పిచూసింది. అందుకు దొర “నువ్వు తలుసుకుంటే అయితది” అని రకరకాల ఉపాయాలు చెప్పాడు. సరేలే ప్రయత్నం చేస్తా అంటూ కాసులపేరుతోనే ఇంటికి చేరింది. ఇంటిముందు పందిరికి సన్నని మల్లెతీగ పారినట్లు నాజూకుగా ఉంది జానకి. తల్లి లేని పిల్ల జానకిని చూసిన ఆమె మనసు ముళ్ళు గుచ్చుకున్నట్లు బాధలో మునిగింది. తెల్లారింది, చేను మీద పిట్టలు తోలుతున్నాడు రంగడు. సద్దియాల్లకు గడ్డ పెరుగుతో చద్దన్నం రెడీ చేసింది అతని భార్య. మెరుపులాంటి ఆలోచన మనసులో కదిలి వెంటనే జానకిని పిలిచింది.

“జానకీ..”
“ఆ..పిన్నీ”
“కాస్త ఒంట్లో నలతగా ఉంది చిన్నాయనకు సద్దన్నం ఇచ్చస్తావా? ఇంటిపనుల్లో ఆయన సంగతే మరిచిన జెర పోయేస్తావా?” అని అడిగింది. ఆమె మనసును గ్రహించక జానకి సరే పిన్నీ అన్నది. ప్రకృతి అంటే సహజంగా ఇష్టపడే జానకి దొర చేనుకాడికి సద్ది గిన్నెతో బయల్దేరింది. ఇంతలో ఈ విషయం వెంటనే దొరగారికి చేరవేసింది రంగని భార్య. పనిముగించుకొని రంగడు కొట్టంలో కాసేపు కునుకు తీద్దామన్న ఆలోచనలో ఉన్నవాణ్ణి “ఒరేయ్ రంగా! ఇంటికాడ చుట్టాల పిల్లలకు ఊరు చూడాలని ఉందట ఎడ్లబండిలో వాళ్లను తిప్పి ఊరచెరువో అవోఇవో చూపించుకరాపో” అని పెద్ద గొంతుకతో దొర అరుపులకు లేచి ఎడ్లను తోలుకొని ఇంటిబాట పట్టాడు. కొమురారెడ్డి మనసు కోడె వయసులోకి మారుతుంది. కోర్కె తీరే సమయం ఇంత త్వరగా వస్తదని అస్సలు ఊహించలేదు. పట్టుదోతిలో పడుసు పిలగాడుగా ఉన్నాడు. మంచులో తడిసిన మొక్కజొన్న చేను సూర్యుని సెగలకు ఒల్లారబెట్టుకున్నట్లుగా ఆకుల్లో ముత్యాలవంటి నీటి బిందువులు రాలి భూమిని తాకుతున్న వేళ పచ్చని నేలంతా పసిరికతో రంగేసినట్లున్నది. జానకి ఒంటరిగా ఓనగాయ వంక నడుముతో, పరికిణిలో నడుస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఒడ్డుమీది నడక వయ్యారంగా సాగుతుంది. చేతిలో సద్ది మనసులో బాల్యాన్ని తలచుకుంటూ మొక్కజొన్నచేను కాడికి చేరుకుంది. ​రంగన్న కోసం వెతుకుతున్న కళ్ళకు నిరాశే మిగిలింది. ఇంకొంచం ముందుకు పోయి పిలవడం మొదలెట్టింది. ఎవ్వరూ పలకడంలేదు. దొడ్లో ఉన్నాడేమో? అనుకొని అటువైపుగా వెళ్లబోయిన జానకిని దొర అడ్డగించాడు.

“అమ్మాయ్ ఏంసదువుకున్నావ్? ఈ ఊరు నచ్చిందా? జాతరలో అమ్మోరును ఏం కోరుకున్నావ్?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే కళ్ళు ఎక్కడెక్కడో చూస్తున్నవి. జవాబివ్వలేదు జానకి.
“రంగన్న ఆ కాలువ పొంటి ఎద్దులకు గడ్డి కోస్తున్నాడు వెళ్ళి సద్ది ఇచ్చి రాపో” దొరమాటలు పూర్తికాకుండానే అక్కడినుండి వెళ్ళింది. సుడిగాలికి కండ్లలో దుమ్ముపడి దురద పెట్టినట్లు కన్నీళ్లతో ఒక్కసారిగా మొక్కజొన్న చేనును చూస్తూ గతాన్ని గుర్తుకుతెచ్చుకుంటున్నది. జానకి ఒక్కతే కూతురు. అయ్య అంగట్లో కూరగాయలు అమ్మేవాడు. కూలీ నాలీ చేసుకొని జానకిని గొప్పగా సదివివ్వాలనీ కలలు కనేవారు. పసిగుడ్డు నుండి జానకిని వాళ్ళ అమ్మ ఎక్కడికెళ్లినా వెంట తీసుకెళ్ళేది. ఓ రోజు కొమురారెడ్డి తండ్రి మాలిపటేల్ మల్లారెడ్డి పొలంలోకి పనికి వచ్చింది. అందమైన ఆకర్షణ ముఖం కల్గిన ఆమె తల్లి చీకట్లో చంద్రుణ్ణి ఆరబోసినట్లు తెల్లని పండ్లతో మిరుమిట్లు గొలిపేలా ఉండేది. అలా కూలీల అందరిలో ఆమె గుణవంతురాలుగా పేరుతెచ్చుకున్నది. పటేల్ పొలంలో పనులు రోజుల తరబడి జరిగేవి. అన్ని పనులకు ఆమె వచ్చివెళుతుండేది జానకితో సహా! యుక్త వయసులో ఉన్న వ్యసనపరుడైన కొమురారెడ్డి కండ్లు ఆమెపై పడినవి. ఎన్నోసార్లు ఆమె కోసం పరితపించినా ఫలితం లేకుండా పోయింది. అనుకోకుండా ఓ రోజు కొమురారెడ్డి తండ్రి సర్కారు రకం పనుల మీద పట్నం పోయిండు. కూలి డబ్బులు, పొలం పనులు కొమురారెడ్డి చూసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో జానకి తల్లితో తన మనసులోని మాట చెప్పి, కోరికను తీర్చమని ప్రాధేయపడ్డాడు. ఆమె సున్నితంగా హెచ్చరించి తిరస్కరించింది. అప్పటినుండి పగ పెంచుకున్న అతడు ఆమెను వశపరచుకోవాలనీ ఆలోచనల్లో ఉన్నాడు.

జానకి తల్లి ఓ రోజు మొక్కజొన్న చేనులో గడ్డి కొస్తుంది. అక్కడ మోపు కట్టిన కుప్పలో ఆమెకు తెలియకుండా కొన్ని లేత కంకులను కొమురారెడ్డి వేసి దొంగతనం నేరం మోపాడు. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని శరతు పెట్టాడు. ​దొంగతనం చేయలేదనే వాదనలో జానకి తల్లి, నువ్వే దొంగతనం చేశావంటూ కొమురారెడ్డి మిగతా కూలోళ్ళ మధ్యన ఆమెను చిత్రహింసలకు గురిపెట్టాడు. అందరూ ఆమెనే తప్పు పట్టారు. ఇవన్నీ కళ్ళనిండా చూస్తుంది జానకి. పేదరికంలో పుట్టినా ఏనాడు తప్పుడు పనులు చేయని తనపై పటేల్ కొడుకు దొంగతనం నేరం మోపి, లైంగిక వేధింపులకు గురి చేయడం అవమానంగా భావించింది ఆ తల్లి. జరిగిన విషయం భర్తకు చెప్పుకోలేక మనసులోనే కుమిలి కుమిలి ఏడ్వసాగింది. ఈ సంఘటన జరిగిన నాటి నుండి పసివయసులోవున్న జానకి తల్లిని వీడకుండా వెంటే ఉంటుంది. మూడు రోజులు గడిచాయి. ఎలాంటి మార్పు రాలేదు. సరిగ్గా తిండితినక పోవడం వలన నీరసించిపోతుంది ఆమె శరీరం. ఆ మూడు రోజులు ఆమె జానకి మీద బెంగపెట్టుకొని బిడ్డ జీవితం కోసం పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఓ రాత్రి భర్తకు జరిగినదంతా చెప్పుకొని బోరున విలపించింది.

అమాయకుడైన భర్త భార్యను ఊరడిస్తూ, ఈ ఊరి నుండి వెళ్లి ఎక్కడైనా బతుకుదాము. ఈ దొరలను ఎదిరించడం మన లాంటి బతుకులకు సాధ్యం కాదనే విషయాన్ని భార్యకు చెప్తూనే నిద్రలోకి జారుకున్నడు. ​“పవిత్ర హృదయంతో బతికినా దొంగగా చిత్రించిన దొరల పెత్తనాన్ని ఏమీ చేయలేమా? ఆడదానిగా పరాయి మొగోనికి వడ్డించిన విస్తరిగా మారుడే పేదోల్ల పనా? రేపు నా బిడ్డ జీవితం ఎలా? ఇలాంటి పెత్తందార్ల కండ్లలో పడితే ఎలా? పరిష్కారం చేసే వారెవరూ లేరా”? అనుకుంటూ “నా మరణం దొరల అహంకారానికి శాపం కావాలనీ ముక్కోటి దేవతలకు మొక్కుకొని నా బిడ్డను నువ్వే రక్షించాలి” అని దైవాన్ని తలచి ఇంట్లో ఉరిపోసుకొని మరణించింది. ఈ విషాదకర సంఘటన జానకి జీవితానికి పెద్ద సవాలుగా మారింది. నీడల దృశ్యం సాగుతుంది. తల్లిని తలచుకుంటూ దుఃఖస్థితిలోకి జారిన జానకినీ మేల్కొల్పినట్లు రామచిలుకలు జొన్న చేండ్లనుండి సర్రున లేచేసరికి ఒక్కసారిగా అలజడి స్పర్శతో తేరుకున్నది. ఇంతలో ఎదురుగా దొర మీసాలను మెలిపెడుతూ ఆకలితో ఉన్న పులిలా ఎదురుగా నిలబడ్డాడు. అతని చూపులు ఎక్కడున్నవో గ్రహించిన జానకి వెంటనే పైటను సర్దుకున్నది. కొద్దిసేపు ఇద్దరిమధ్య నిశ్శబ్దం, ఏమీ తోచని స్థితిలో పరిగెత్తబోయిన జానకి చేతిని గట్టిగా పట్టుకొని లాగ బోయాడు దొర. జానకి చేతులను ఏమాత్రం గింజుకోవడం లేదని గ్రహించిన దొర పిచ్చి వేషాలు వేయడం మొదలుపెట్టాడు.

కొద్దిసేపు ఓపికతో భరించింది జానకి. చుట్టూ పచ్చని నేల. దొర ఒళ్ళుమాత్రం వెచ్చగా తాకుతుంది జానకికీ. ఐనా ఏం మాట్లాడకుండానే ఉంది. ఇదే అదునుగా భావించిన దొర మరింత రెచ్చిపోయాడు. తండ్రి వయసున్న కొమురారెడ్డి కాళ్ళు జానకి పాదాలను కసితో తొక్కుతున్నవి. బుగ్గలను పట్టి కొరుకుతున్నడు, నడుమును గిల్లుతూ, అమాంతం ఎత్తుకొని చేండ్లో ఉన్న మంచె వైపుకు వెళుతున్నడు, జానకి మాత్రం దొరకు ఒళ్ళును అప్పజెప్పి కండ్లు మాత్రం దేనికో వెతుకుతున్నవి. కామంతో రగిలి పోతున్న దొర మీసాలు కత్తుల్లా గుచ్చుతుంటే, కౌగిల్లో నలిగిపోతుంది జానకి.
“నువ్వు ఇలా సహకరిస్తావనుకుంటే రాత్రి ఇంట్లోకి నిన్నే రమ్మనేవాణ్ణి ఇలా నులక మంచం మీద కాకుండా పట్టుపాన్పులో నీ అందాలను దోచుకునే వాణ్ణి” అంటూ గట్టిగా కౌగిలించుకొని వెచ్చని నిట్టూర్పు విడిచాడు. “మత్తుగా ఉంది నీ తలలోని సన్నజాజులు” అంటూ జానకి మీద తూలుతున్నాడు దొర. జానకి చేతులకు ఏదో తగిలింది, అదునుకోసం ఆరాటపడ్డ ఆమె ఆలోచనలకు దొర నడుము మీద ఉన్న వెండి బిళ్ళల మొలతాడు తాకింది. దాన్ని ఎలాగైనా చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచనతో దొరకు సహకరించినట్లు తనూ సర్వస్వం అప్పజెప్పినట్లు చేస్తూనే
తనపనినీ సమర్ధవంతంగా చేసింది.

దొర పూర్తిగా మత్తులోకి జారిపోయిండు. జానకి సహకారంతో ఇక ఇరువురి మధ్య గాలికి చోటు లేనంతగా దగ్గరయ్యారు. ఇంతలో చేతిలోకి చేరిన వెండి మొలతాడు మెల్లిగా దొర మెడకు వేసి ఇంకా కవ్విస్తుంది జానకి. దొరకు ఆవేశం రెట్టింపైంది. మెడలోని తాడు ఉరితాడుగా మారుతుందనే విషయం గ్రహించని దొరను గట్టిగా కౌగిలించుకొని మెడలోని తాడును లాగింది. అంతే ఒక్కసారిగా దొరకు విషయం అర్థమైంది. గట్టిగా లాగుతుంది జానకి. ‘‘ఒసేయ్ వదులు” అంటూ గింజుకుంటున్నడు. ‘‘ఒరేయ్ దొరా!” అంటూ మనసులో రగిలే ఆవేశం బలమై ఇంకా గట్టిగా లాగడం మొదలెట్టింది. చెమటలో తడిసి గిలగిల కొట్టుకుంటున్నడు దొర! “ఒరేయ్ దొరా! నీ వల్లనే మా అమ్మ ప్రాణాలు విడిచింది. నేను ఆ రోజే ఎలాగైనా నీ అంతం చూడాలని పంతం బట్టి ఇంతకాలం వేచి చూసిన. నేను బతికింది నిన్ను చంపాలనేరా! నీలాంటి పశువు వల్ల ఈ జొన్న చేనులో ఎందరో ఆడోల్ల మానాలు మాంసం ముద్దలైనవి. మాలాంటి పేద బతుకులు నీ అహంకారానికి పంటికింద వక్కలైనవి. నీ పాపం ఊరకే పోదురా!’’ అంటూ దొర ప్రాణం తీసింది. జానకి ఆకాశం వైపు చూస్తూ “అమ్మా! నువ్వు కన్న కలను నీ కూతురుగా నిజం చేశాను. నీ లక్ష్యం పదిలం చేసేందుకే ఎన్నో రోజులు వేచి చూశాను. అదృష్టం కాలికి తగిలిన తీగలా దొరికి దొర సావుకు ముహూర్తంగా మారింది. మదమెక్కి ఆడోళ్ల ఊపిరితీసిన కామ పిశాచి పీడ మారెమ్మ జాతరలో విరగడైనది. నీ మొక్కును తీర్చి ఆడజాతి గౌరవానికి పురుడు పోసాను. ఇంకా నాకేమైనా పరవాలేదు” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జానకి.​

పప్పులు వుడకవు
తండ్రి ( కిరాణా షాప్ వాడితో ) : ఏమోయ్ ఓ కేజీ కందిపప్పు ఇయ్యి. కొడుకు: అదేంటి నాన్నా ఆమధ్య నీ పప్పులు మా దగ్గర ఉడకవు అని మళ్ళీ ఇతని దగ్గరే కందిపప్పు తీసుకుంటున్నారు?

వినయం
ఓ వ్యక్తి: అతను నాతో మాట్లాడినప్పుడల్లా చేతులు నలుపుకుంటూ మాట్లాడుతాడు. ఎంత వినయమో? రెండో వ్యక్తి: వినయమా పాడా? నిన్నునలపలేక చేతులు నలుపుకుంటున్నాడు.

పరకాయ ప్రవేశం
డాక్టర్ : సార్ మంత్రి చనిపోయి మూడు రోజులయింది ఈ రోజయినా బయటి వారికి చెప్పమంటారా. మంత్రి బావమరిది : పరకాయ ప్రవేశ విద్య తెలిసిన సాధువును పిలుచుకొని రమ్మని మా మనుషులను పంపాను. రాగానే నేను మా బావ శరీరంలోనికి ప్రవేశించి మంత్రిగా కోట్లు కోట్లు సంపాదించాలని వున్నాను.

గన్నోజు ప్రసాద్, 9491617161

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -