Sunday, July 19, 2026
E-PAPER
Homeకథచదువు - చేయూత

చదువు – చేయూత

- Advertisement -

ఎయిడ్స్‌తో భర్త మరణించిన తర్వాత 11 ఏండ్ల భార్గవిని ఎలా పెంచాలో మమతకు అర్థం కాలేదు. కూతురిని బాగా చదివించాలని ఆమె కోరిక. దీంతో బతుకు తెరువు కోసం అనంతపురం నుండి హైదరాబాదులో ఉంటున్న తమ్ముడు ప్రదీప్‌ వద్దకు వచ్చింది. ఏదైనా పని చూసుకొని భార్గవిని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలనుకుంది. ‘భార్గవి కోసం దగ్గర్లో ఏదైనా గవర్నమెంట్‌ స్కూలుంటే చూడు జాయిన్‌ చేద్దాం. ప్రైవేట్‌ స్కూల్లో నేను ఫీజులు కట్టలేను’ అంది తమ్ముడితో మమత. ‘ఒక స్కూల్‌ ఉంది కానీ ఇక్కడి నుండి మూడు కిలోమీటర్లు. అంత దూరం భార్గవి ఎలా వెళ్లొస్తుంది’ అన్నాడు ప్రదీప్‌. దాంతో మమతకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ప్రదీప్‌ ‘మనకు దగ్గరలో రెండు ప్రయివేటు స్కూల్స్‌ ఉన్నాయి. వాటిలో తక్కువ ఫీజుతో ఎవరైనా చేర్చుకుంటారేమో చూద్దాం’ అన్నాడు. దీంతో మమత కాస్త ఊపిరిపీల్చుకుంది.

వారం రోజుల తర్వాత ప్రదీప్‌ ఒక రోజు ‘అక్కా, ఇక్కడ దగ్గరలో చాక్లెట్‌ కంపెనీ ఉంది. అందులో లేడీ వర్కర్స్‌ కావాలంట. కూర్చొని చాక్లెట్స్‌ ప్యాకింగ్‌ చేసే పని. నెలకి రూ. 9,000 ఇస్తారు. నీకిష్టమైతే మాట్లాడతాను’ అన్నాడు. ‘వెళ్తాను రా, ఎందుకు వెళ్ళను. తిండికి గడవాలి కదా!’ అని మరొసరి రోజు నుండే చాక్లెట్‌ కంపెనీకి వెళ్లడం మొదలుపెట్టింది. మూడు రోజుల తర్వాత ‘భార్గవి స్కూల్‌ సంగతి ఏంటీ, ఇప్పటికీ చాలా రోజులయిపోయింది’ అని అడిగింది తమ్ముడిని. ‘మన బస్తీలోనే ఒక స్కూస్‌ ఉంది. ఆ స్కూల్లో ఏడాదికి పదిమంది పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్తారంట. అట్లాగే బట్టలు, పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తారంట’ అన్నాడు ప్రదీప్‌. ఎలాగైనా భార్గవిని ఆ స్కూల్లో చేర్చాలనుకుంది మమత. మరుసటి రోజు ఉదయాన్నే 8:30 గంటలకి భార్గవిని తీసుకొని ఎంతో ఆశతో ఆ స్కూల్‌కి వెళ్ళింది. అప్పటికే స్కూల్‌ ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది. గేటు తీసుకుని లోపలికి వస్తుంటే, ఆయా అనుకుంటా ‘ఏం కావాలి’ అని అడిగింది. ‘ఈ స్కూల్లో పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్తారంట కదా, మా అమ్మాయిని చేర్పిద్దామని వచ్చా’ అన్నది మమత.

దానికి ఆమె వెంటనే ‘అడ్మిషన్లు అయిపోయాయి. ఇప్పుడు కుదరదు’ అన్నది. ఆ మాటలతో మమత గుండెల్లో రాయిపడ్డట్టయింది. వెంటనే తేరుకుని ‘ఒకసారి సార్‌ని కలుస్తాను, బతిమలాడో, కాళ్లు పట్టుకొనో చేర్చుకోమని అడుగుతా’ అంటూ ఆయమ్మను అర్ధించింది. కూతురు చదువు ఎక్కడ ఆగిపోతుందో అనే దిగులు ఆమె మాటల్లో, కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మాటలకు కరిగిపోయిన ఆయమ్మ ‘సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను అడిగొస్తాను’ అని ప్రిన్సిపాల్‌ రూమ్‌కి వెళ్లింది. సార్‌ మీటింగ్‌లో ఉండడం గమనించి ‘సార్‌ మీటింగ్‌లో ఉన్నాడు, కొద్దిసేపు అక్కడ కూర్చో’ అని కూర్చీలను చూపించింది. అరగంట తర్వాత ఆయమ్మ ప్రిన్సిపాల్‌ రూమ్‌లోకి వెళ్లి ‘అడ్మిషన్‌ కోసం ఎవరో వచ్చారు సార్‌, అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడంట’ అన్నది. ‘అడ్మిషన్స్‌ అయిపోయాయి కదా! ఇప్పుడు కుదరదని చెప్పు’ అంటూ తన పనుల్లో బిజీ అయిపోయాడు ప్రిన్సిపాల్‌ సందీప్‌. ప్రిన్సిపాల్‌ రూమ్‌లో నుంచి బయటకు వచ్చిన ఆయమ్మతో ‘ఏమన్నారు సార్‌’ అంటూ ఎంతో ఆత్రంగా అడిగింది మమత. ‘అడ్మిషన్లు లేవన్నారు’ అంటూ దీనంగా చెప్పింది ఆయమ్మ.

‘ఒకసారి నేను సార్‌ని కలవొచ్చా’ అడిగింది. ‘సార్‌ ఇప్పుడు పనిమీద బయటికి వెళ్తున్నారు, రేపు రండి’ అని చెప్పి ఆయమ్మ తన పనిలో నిమగమయ్యింది. ఇక చేసేది లేక మమత దిగులుగా భార్గవిని తీసుకొని ఇంటికి వెళ్లింది. మమతా కంపెనీలో చేరిన కొద్దిరోజులకే అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. కొందరు మంచి స్నేహితులు కూడా అయ్యారు. వాళ్లతో భార్గవి స్కూల్‌ గురించి కూడా చెప్పింది. లక్ష్మి అనే ఓ స్నేహితురాలు ‘మీ ఏరియాలో ఓ స్కూల్‌ ఉంది. ఆయన చాలా మంచి మనిషి. ఏదో ఫౌండేషన్‌ పెట్టి పేదలకు సహాయం చేస్తుంటాడు, అక్కడకు వెళితే నీ కూతురికి కచ్చితంగా సీటు ఇస్తారు, సాయం చేస్తారు’ అంది. ‘నిన్ననే వెళ్లొచ్చా. అడ్మిషన్లు అయిపోయాయన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అంటూ బాధపడింది. ‘నువ్వు మళ్లీ ఓ సారి వెళ్లి సార్‌ని కలిసి నీ పరిస్థితి చెప్పు, కచ్చితంగా సీటు ఇస్తారు’ అని లక్ష్మి ఎంతో నమ్మకంగా చెప్పింది. దాంతో మరుసటి రోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకే భార్గవిని తీసుకొని మళ్లీ స్కూల్‌కి వెళ్లింది మమత.
వాళ్లను చూసిన ఆయమ్మ వెంటనే ‘సార్‌ నిన్న వచ్చారు కదా అడ్మిషన్‌ కోసం వాళ్ళు మళ్ళీ వచ్చారు’ అని సందీప్‌కు చెప్పింది.

‘అడ్మిషన్స్‌ లేవని చెప్పాను కదా, మళ్లీ ఎందుకు వచ్చారు.. సరే లోపలికి పంపించు నేను మాట్లాడతాను’ అన్నాడు. మమత లోపలికి రావడంతోనే రెండు చేతులు జోడించి ‘సార్‌ నా కూతురు భార్గవిని స్కూల్లో చేర్చుకొని పుణ్యం కట్టుకోండి సార్‌, నాకు చదివించే స్థోమత లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో కరిగిపోయిన సందీప్‌ ‘మీరెక్కడ ఉంటారు’ అని అడిగాడు. ‘మాది కర్ణాటక బోర్డర్‌ అనంతపురం దగ్గర్లో ఉంటాం సార్‌. నా భర్త ఎయిడ్స్‌తో చనిపోతే బతకడం కోసం హైదరాబాద్‌ వచ్చాం. ఇక్కడే ఈసీ నగర్‌లోనే మా తమ్ముడి దగ్గరకు వచ్చాం సార్‌’ అన్నది. ‘ఇప్పుడు పాప ఏ క్లాస్‌’ అని అడిగాడు. ‘ఆరో క్లాస్‌కి వెళ్లాలి సార్‌’ అన్నది. ‘అడ్మిషన్స్‌ క్లోజ్‌ చేశాము, ఇప్పుడు తీసుకోవడం కష్టం’ అన్నాడు సందీప్‌. ‘మీరే ఎలాగైనా సాయం చేయాలి సార్‌, గవర్నమెంట్‌ స్కూల్‌కి పంపాలంటే చాలా దూరంలో ఉంది. ఆడపిల్లను అంత దూరం పంపించే ధైర్యం లేదు. వేరే ప్రయివేటు స్కూల్లో చేర్చే ఆర్థిక స్థోమత కూడా లేదు. మీరు మాలాంటి వాళ్ల పిల్లలకు ఉచితంగా చదువు చెబుతారని విని మీ దగ్గరకు వచ్చా. ఇప్పుడు మీరు కాదంటే నా కూతురు చదువు ఆగిపోతుంది’ అంటూ కాళ్లు పట్టుకోబోయింది. మమత పరిస్థితి విన్న తర్వాత ప్రదీప్‌ మనసు కరిగిపోయింది.

దాంతో భార్గవికి ఎలాగైనా అడ్మిషన్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘రోజూ మా స్కూలుకి వస్తావా’ అడిగాడు భార్గవిని. ‘వస్తాను సార్‌’ అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. చూడటానికి నల్లగా, ముద్దుగా ఉంది భార్గవి. చాలా యాక్టివ్‌ కూడా. అలా ఆరో తరగతిలో చేరిన భార్గవి. చూస్తుండగానే మూడేండ్లు గడిచిపోయాయి. ప్రతి ఏడాది తనే క్లాస్‌ ఫస్ట్‌. భార్గవి 9వ తరగతి చదువుతుండగా స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సందీప్‌ తన స్కూల్లో ఓ సదస్సు నిర్వహించారు. అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు దేనికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు అనే విషయాలు పైన ప్రముఖ సైకాలజిస్టు అమ్మాజీని స్పీకర్‌గా పిలిచారు. ప్రసంగం ముగిశాక ఏమైనా సందేహాలు ఉంటే అడగమన్నారు. వెంటనే ‘నాకు ఒక డౌట్‌ మేడం’ అంది భార్గవి. ఏంటని అడగితే ‘మేడమ్‌ నేను ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నాను. ఫోన్‌ చూడకపోతే ఆ రోజు ఏదో వెలితిగా ఉంటుంది. ఫోన్‌ చూడడం, మాట్లాడడం తగ్గించాలంటే ఏం చేయాలి’ అని అడిగింది. ‘నీకు ఫోన్‌ ఎందుకు చూడాలనిపిస్తుంది. అంటే బోర్‌ కొట్టినప్పుడా లేదా ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడా?’ అని అడిగింది ఆమె. అన్నింటికీ భార్గవి అవునని మౌనంగా తలూపింది.

‘అయితే నువ్వు రోజుకి 30 నిమిషాలు లేదా 60 నిమిషాలు మాత్రమే ఫోన్‌ వాడాలని ఒక టైం పెట్టుకో. అట్లాగే నీ ఫోన్‌కి నోటిఫికేషన్స్‌ రాకుండా టర్న్‌ ఆఫ్‌ చేసుకో. భోజనం చేస్తున్నప్పుడు, పడుకునే గంట ముందు, నిద్ర లేచిన తర్వాత 30 నిమిషాల వరకు ఫోను వాడకూడదని ఒక రూల్‌ పెట్టుకో. బోర్‌ కొడితే కాసేపు వాకింగ్‌ చేయడం, పుస్తకాలు చదవడం, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. ఇలా ఏదో ఒకటి చెయ్యి’ అని పదిరకాల చిట్కాలు చెప్పింది ఆమె. ‘వీటిని పాటిస్తూ, నీకు నిజంగా ఫోన్‌ వాడకం తగ్గించాలనే కోరిక బలంగా ఉంటే కచ్చితంగా మానేస్తావు’ అని చెప్పింది. అన్నింటికీ తలూపిన భార్గవి ‘సరే మేడం మీరు చెప్పినవన్నీ కచ్చితంగా చేస్తాను’ అని అన్నది. అలా పదవ తరగతి పూర్తి చేసుకుని 95% మార్కులు సాధించింది. మమత ఓ రోజు స్కూల్‌కి వచ్చి ‘సార్‌ మీ దయవల్ల నా కూతురు పదో తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత ఏం చదివితే బాగుంటుందో మీరే చెప్పండి సార్‌’ అన్నది. భార్గవిని అడిగితే ‘సిఇసి గ్రూప్‌ తీసుకుంటాను సార్‌’ అన్నది.

దానికి ‘గుడ్‌, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఓ ఐదేండ్లు కష్టపడితే నీ జీవితం మారిపోతుంది’ అన్నాడు సందీప్‌. ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది చదువుతున్నప్పుడు కరోనా రావడంతో ఆన్లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. కరోనా బారిన పడి మామయ్య చనిపోయాడు. దాంతో మమతకు ఉన్న ఆ ఒక్క తోడు కూడా లేకుండా పోయింది. భార్గవి ఎంతో కష్టపడి చదివి ఇంటర్‌ మొదటి ఏడాదిలో 96% మార్కులు తెచ్చుకుని కాలేజీలో టాపర్‌గా నిలిచింది. మమత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సందీప్‌ సార్‌కు మనసులోనే ఎన్నో సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది. మార్కుల గురించి తెలుసుకొన్న సార్‌ భార్గవిని ఒకరోజు స్కూల్‌కి పిలిపించి ఇలాగే బాగా చదివితే అన్ని విధాలుగా సపోర్ట్‌ చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే భార్గవి రెండో ఏడాది కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. సందీప్‌ సారే డిగ్రీలో చేర్పించాడు. హైదరాబాద్‌ నగరంలోనే టాప్‌ కాలేజీలో సీటు ఇప్పించాడు. ‘చూడు భార్గవి ఈ మూడేండ్లు నువ్వు కష్టపడి చదవాలి. మీ అమ్మ నీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

నాకూ నీపై నమ్మకం ఉంది. అందుకే నీ చదువుకు కావల్సిన ఫీజలన్నీ నేనే చూసుకుంటున్నాను. వేరే ఆలోచనలేమీ లేకుండా మూడేండ్లు పూర్తి చెయ్యి. మంచి ఉద్యోగం సంపాదించు’ అని చెప్పాడు. అందరి నమ్మకాన్ని నిబబెట్టిన భార్గవి మూడేండ్లు బాగా చదివి 90% మార్కులు తెచ్చుకుంది. మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. నెలకు 47 వేలు జీతం. ఇంత మంచి ఉద్యోగం రావడంతో మమత, భార్గవిని తీసుకొని సందీప్‌ దగ్గరకు వచ్చింది. ‘సార్‌ ఈరోజు భార్గవి ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం మీరే. ఆ రోజు మీరు పాపకు సీటు ఇవ్వకపోతే మా బతుకులు ఎలా ఉండేవో. పదో తరగతి అయిపోయిన తర్వాత కూడా తన చదువంతా మీరే చూసుకున్నారు. నిజంగా మీ రుణం నేను తీర్చుకోలేను’ అంది. వెంటనే భార్గవి ‘సార్‌ నేను ఒక పని మాత్రం చేయగలను.

మీరు ఎలాగైతే మీ ఫౌండేషన్‌ తరపున నాకు చదువులో సాయం చేశారో, అలాగే నేను కూడా పేద పిల్లలకు సాయం చేస్తాను. చదువుకు నా వంతు చేయూతగా నెలకి వెయ్యి రూపాయలు ఇస్తాను. అది మీ చేతికి ఇస్తే చేరాల్సిన వారికి కచ్చితంగా చేరుతుందని నా కోరిక’ అంది. దానికి సందీప్‌ ‘మంచి ఆలోచన భార్గవి. నీలాంటి యువత ఇలా ఆలోచిస్తే మన దేశంలో నిరక్షరాస్యత అనేదే ఉండదు. అందరూ చదువుకోగలుగుతారు. నువ్వే కాదు వీలైతే నీ స్నేహితుల ద్వారా కూడా సాయం చేయించు. చదువులో ఎలాగైతే రాణించావో అలాగే ఉద్యోగంలో కూడా రాణించాలి. ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇది మీ అమ్మ కల’ అని చెప్పి పంపించాడు.

– శరత్‌ సుదర్శి, 7386046936

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -