ముప్పై ఏళ్ల క్రితం నేను కాలేజీలోలో చదువుకుంటున్న రోజుల్లో మా ఊరి మీదగా వెళ్లే బ్రాంచి లైన్లో ఓ పాసెంజర్ బండి ఉండేది. అది స్టీమ్ ఇంజిన్‌తో నడిచే పొగబండి. వందల సంవత్సరాల నుంచి భేషజం, మిడిసిపాటు లేకుండా ఒకే వేగాన్ని అంటే గంటకు పదికిలోమీటర్ల వేగాన్ని అనుసరిస్తున్న రైలు బండి బహుశా మా ప్యాసింజరే అనుకుంటాను. అందులో ప్రయాణిస్తే ప్రపంచం మన కళ్ళ ముందు ఉన్నట్లే ఉంటుంది. చుట్టూ పక్కల ఊళ్లలో దొరికే కూరలు, పళ్ళు ఆ బండిలో వెళ్ళవలసిందే. ఇక వంట చెరుకు కట్టెలకు ఆ బండి ప్రసిద్ధి. పాలు, పెరుగులతో పాటు జామకాయలు అమ్మేవాళ్ళకు ఆ బండి పుష్పక విమానం. అలాగే కాలేజీలకు, ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్లకు నడిచే బృందావనం ఆ బండి. ఎందుకంటే టికెట్ కొనక్కర్లేదు. ఒకవేళ కొంటే టికెట్ కలెక్టర్లకు కోపం వస్తుంది.
మా ఈ బండి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక సారి రామాపురం దగ్గర ఓ మూడు కాళ్ళ ముసలమ్మ నడవలేక నడవలేక పక్క నుంచి వెళుతుంటే ఈ బండి డ్రైవరు చూసి జాలిపడి ”ముసలమ్మా, పాపం నడవలేకుండా ఉన్నావు. బండెక్కు. మీ వూళ్ళో దించేస్తాను” అని అన్నాడట.
అప్పుడు ఆ ముసలమ్మ ”నాయనా, నీ మంచితనం నీ చేత అలా అనిపించింది కానీ ఇవాళ నేను కొంచెం తొందర పని మీద వెళుతున్నాను. మరోసారి ఎక్కుతానులే, నువ్వు మరోలా అనుకోవద్దు” అని డ్రైవర్‌ని బతిమాలి నడక సాగించిందట. అందుకే ఆ బండిని మా చుట్టూ పక్కల ఊళ్లలో ‘నత్త’ బండి అంటూ వుంటారు. ఈ బండి వల్ల మా జిల్లాలో నిరుద్యోగ సమస్య కూడా కొంతవరకు తగ్గిందని మా వూళ్ళో వాళ్ళు చెబుతుండేవారు. చాలా గ్రామాల నుంచి నిరుద్యోగులు ఈ బండిలో మా జిల్లా ముఖ్య పట్నానికి వెళ్లి అక్కడ ఎంప్లొయిమెంటు ఎక్స్చేంజిలో పేరు నమోదు చేసుకొని తిరిగి ఇంటికి చేరేసరికి ఉద్యోగపు ఆర్డర్ పోస్టులో వచ్చి వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉండేదిట. ఈ బండికి ఇంతటి గొప్ప చరిత్ర ఉందని తెలిసిన నేను ఒకసారి నా మిత్రుడిని కలవడానికి ఆ బండిలో పక్క జిల్లా రాజుపురం బయలు దేరాను. ఈ బండిలో వెళితే గమ్యం గురించి మనం మరిచిపోవాలి.
ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఆగుతుందో ఆ డ్రైవరుకు కూడా తెలియదు. పరశురామపురం స్టేషన్ ఎంత చిన్నదైనా అక్కడ అరగంట ఆగవలసిందే. కారణం అక్కడ ఇడ్లీలు చాలా ఫేమస్. ముఖ్యంగా వాటితో పాటు ఇచ్చే వేరు శనగ పలుకుల చట్నీ కోసమే చాలా మంది అక్కడ ఇడ్లీలు తింటారు. పరశురామపురం వరకూ బండి బాగానే నడిచింది. కానీ అక్కడ ఆగగానే మొత్తం జనం అంతా ఆ ఇడ్లీల దుకాణం మీద పడ్డారు. ఆ దుకాణం వాడు బండి స్టేషన్లో ఆగగానే డ్రైవరుకు, అతని అసిస్టెంటుకి, గార్డుకి మూడు పొట్లాల ఇడ్లీలు వాడి అనుచరులతో పంపించేస్తాడు. ఇక బండి సంగతి అంతే. స్టేషన్ మాస్టర్ సిగల్ ఇచ్చినా అది కదలదు. మళ్ళీ ఇడ్లీల దుకాణం వాడు విజిల్ వేస్తేనే బండి కదులుతుంది. అలా అక్కడ ఆ రోజు గంటసేపు ఆగిన తరువాత అది నిండు గర్భిణీలా మళ్ళీ బయలు దేరింది.
నేను కాసేపు బయట కనిపించిన అందమైన ప్రకతి దశ్యాలను చూసిన తరువాత నవల తెరిచి చదువుకోసాగాను. కొద్దిసేపటి తరువాత చూస్తే ట్రైన్ ఏదో స్టేషన్‌లో ఆగిపోయి ఉంది. ఎవరో క్రాసింగని చెప్పారు. అంటే ఎదురుగా ఇంకో బండి వస్తోందన్న మాట. అరగంట తరువాత ఆ బండి వెళ్లిపోయిన తరువాత మా బండి బయల్దేరింది. ఈ పాటికి నేను వెళ్లబోయే రాజుపురం ఊరు వచ్చేసి ఉండాలి. కానీ బండి మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. పది నిముషాల తరువాత బండి మళ్ళీ ఆగిపోయింది. దాంతో నాకు విసుగేసింది.
”ఎందుకాగిపోయింది” అని పక్కనున్న అతన్ని అడిగాను.
”పక్క బోగీలో టికెట్ కలెక్టర్ ప్రయాణీకులతో డబ్బులివ్వలేదనీ గొడవ పడుతున్నాడట” అన్నాడు తాపీగా. అదేమిటో చూద్దామని రైలు దిగి గొడవ జరుగుతున్న పక్క బోగీలోకి వెళ్ళాను.
”వీళ్లంతా ప్రతీ రోజు ఈ లైన్లో వెళుతుంటారు. నెలవారీ మాకు డబ్బులిస్తారు. కానీ ఇవాళ వీళ్లంతా సీజన్ టికెట్ కొనేసుకున్నారు. ఇది అన్యాయం కాదంటారా? వీళ్ళు చేసిన ఈ పని వల్ల మాకెంత నష్టం చెప్పండి? మా బాధలు మీకేం తెలుస్తాయి?” కోపంతో అన్నాడు టికెట్ కలెక్టర్ పక్కనున్న వ్యక్తితో.
”సార్, మీ బాధలు నాకు తెలుసు కాబట్టే నేనెప్పుడూ టికెట్ కొనకుండా మీకు డబ్బులు ఇచ్చేస్తూ వుంటాను. మనుషులన్నవాళ్ళు మాట మీద నిలబడాలి గానీ ఇలా మోసం చేస్తే ఎలా?” అన్నాడా వ్యక్తి తెగ బాధ పడిపోతూ. ఇంతలో ఓ పాలమ్ముకునే వాడు అక్కడికి వచ్చి ”సార్, మీ డబ్బుల కోసం బండి ఆపేస్తారా? ఇది న్యాయమా చెప్పండి? ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ బండి ఆపేస్తే మేము సంతకి అందం” అన్నాడు కోపంగా.
”రోజూ డబ్బులిస్తున్నారు కదయ్యా, ఇవాళ టికెట్లు ఎందుకు కొన్నారు చెప్పండి? వాళ్ళ బాధలు కూడా మనం చూడాలి కదా?” అన్నాడు ఓ పెద్ద మనిషి.
అప్పుడు పక్కనే కూర్చున్న ఒక ప్రయాణీకుడు లేచి ”నీకేం తెలుసయ్యా మా బాధలు. వీళ్లు ఇప్పుడు రేట్లు బాగా పెంచేసారు. దానికన్నా సీజన్ టికెట్టే చవక. పైగా అప్పుడప్పుడు స్క్వాడ్ వాళ్ళు వచ్చి బోలెడు పెనాల్టీలు రాసేస్తున్నారు” అన్నాడు ఆవేశంగా.
”నీకేమయ్య ఏదైనా మాట్లాడతావు. నష్ట పోయేది మేము. ఇవాళ ఏదో ఒకటి తేలేదాక బండి కదలనివ్వం” అన్నాడు ఇంకో టికెట్ కలెక్టర్.
అలా అరగంట సేపు ఆ గొడవ జరిగిన తరువాత వాళ్ళు మళ్ళీ నెలనుంచి టికెట్లు కొనమని రాత పూర్వకంగా ఇచ్చిన తరువాత బండి కదిలింది.
నేను ఉసూరుమంటూ నా బోగీ ఎక్కి నా సీట్లో కూర్చున్నాను. అరగంట తరువాత మళ్ళీ బండి ఆగిపోయింది. నాకు బాగా చిరాకు వేసింది. హాయిగా ఏ బస్సులోనో వెళ్లి పోవలసింది. అనవసరంగా ఈ బండికి వచ్చాను” అనిపించింది నాకు. వెంటనే కిందకు దిగాను. అది ఓ చిన్న స్టేషను.
”ఎందుకిక్కడ బండి ఆగిపోయింది?” అని అక్కడున్న వ్యక్తిని అడిగాను.
”స్టేషన్లో పాల వాళ్ళు పాలు తక్కువ పోసారట. గొడవ జరుగుతోంది” అన్నాడతను.
నేను వెంటనే ఆ గొడవ జరుగుతున్న స్టేషన్ దగ్గరకు వెళ్ళాను. స్టేషన్ మాస్టర్ కాబోలు పాల కేన్ల దగ్గర నిలబడ్డాడు.
”మొన్న పాలు తక్కువ పోసాడు. సరే అనీ పట్టించుకోలేదు. నిన్న పాలే పొయ్య లేదు. మళ్ళీ ఈ రోజు సగమే పోసాడు. ఇది కావాలని చెయ్యడం కాదంటారా?” అన్నాడు స్టేషన్ మాస్టర్ ఇంకో పాలు అమ్మే వాడితో. వెంటనే ఆ పాలవాడు తక్కువ పాలు పోసిన ఇంకో పాలవాడితో ”ఏరా సత్యం, ఎందుకొచ్చిన గొడవ రా. రోజూ పోస్తున్నట్లు పోసేయొచ్చు కదా” అన్నాడు. వెంటనే అతను ”పూర్వంలా ఆవులు పాలు ఇవ్వటం లేదు. అందుకే తగ్గించాను. అయినా ఊరకే యప్పస్‌గా పోస్తున్న పాలు. కొద్దిగా తగ్గితే ఏమైపోతుంది” అన్నాడు కోపంగా. అప్పుడు పక్కనే ఉన్న స్టేషన్ మాస్టర్ ”ఏంట్రా ఫ్రీగా పోస్తున్నావా?” అన్నాడు కోపంగా వాడితో.
”అంతే మరి, ఫ్రీగా కాకపోతే మీరు ఏ రోజైనా డబ్బులిస్తున్నారా?’ ‘అన్నాడు వాడు.
”ఎవడి కోసం పోస్తార్రా? మాకేం ఉత్తినే పోయట్లేదు. మాకు అర లీటర్ పోస్తే వంద రూపాయల లాభం మా దగ్గర కొట్టేస్తునారు. టిక్కెట్లు, లగేజీ చార్జీలు లేకుండా ఫ్రీగా మా రైల్లో పాలను అమ్ముకుంటూ వేల రూపాయలు లాభాలు గడిస్తునారు’ ‘అన్నాడు స్టేషన్ మాస్టర్. ఇంతలో పెద్ద స్టేషన్ మాస్టర్ అక్కడికి వచ్చి ”ఏమిటి మాస్టారు గొడవ? బండికి ఆలస్యం అయిపోతోందని ప్రయాణీకులు, డ్రైవర్ గోలపెడుతున్నారు” అన్నాడు.
”బాబూ, స్టేషన్ మాస్టర్ బాబుని మా పాల డబ్బాలు వదలమనండి. వెళ్ళిపోతాం. మాదేం ఆలస్యం లేదు” అన్నాడు సత్యం .
”వాడి పాల డబ్బాలు వదిలెయ్యండి మాస్టారు, ఎందుకొచ్చిన గొడవ” అన్నాడు పెద్ద మాస్టారు.
”మీ పాలు మీకు పోసేసాడు కాబట్టి మీరు వదిలేయమంటారు? నా బాధలు మీకేం తెలుస్తాయి చెప్పండి?” అన్నాడు చిన్న మాస్టర్.
”ఈ రోజుకి వదిలేయండి. రేపట్నుంచి సరిగ్గా పోస్తాడు. నాది పూచీ” అన్నాడు పెద్ద మాస్టర్.
”సార్, నా జీవితంలో నేనెప్పుడూ పాలుకు ఇబ్బంది పడలేదు. ఇదిగో ఈ స్టేషన్ కి వచ్చిన తరువాతే జీతం డబ్బులతో పాలుకొనే దౌర్భాగ్యం ఏర్పడింది. ఇంత దరిద్రమైన స్టేషన్ని నేనెప్పుడు చూడలేదు” అన్నాడు చిన్న మాస్టర్ చెమర్చిన కళ్ళను రుమాలుతో తుడుచుకుంటూ.
ఆ తరువాత డ్రైవర్, గార్డు వచ్చి ఆ పాలవాడితో మాట్లాడిన తరువాత బండి మళ్ళీ కదిలింది. అరగంట తరువాత మళ్ళీ బండి ఆగిపోయింది. నేను వెంటనే డోర్ దగ్గరకు వచ్చి చూసాను. అక్కడ ఏ స్టేషను లేదు. దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ బండి ఎందుకు ఆగిందోననీ ఆశ్చర్య పోతూ కిందకు దిగాను. దూరంగా రెండు బోగీల్లోంచి ఎవరో కర్రలు దించుతూ కనిపించారు. నేను మెల్లగా నడుచుకుంటూ అక్కడకు వెళ్ళాను. కొందరు బోగీల్లోంచి కర్రలను దింపుతుంటే మరి కొందరు ఆ దించిన కర్రల్ని పక్కనే ఉన్న షెడ్డులోకి తీసికెళుతున్నారు. ఆ పక్కనే గార్డు కూడా ఉన్నాడు.
”ఎవరివీ కర్రలు?” అని పక్కనే ఉన్న ఒక వ్యక్తిని అడిగాను.
”ఫారెస్టు గార్డ్ గారి రెండో భార్య కూతురి పెళ్ళట బాబు. దాని కోసమే ఆ కర్రల్ని ఆ బాబు పంపేడు” అన్నాడతను.
ఆ కర్రల్ని దించటానికి అరగంట సేపు పట్టింది. ఆ తరువాత గార్డు జెండా ఊపిన తరువాత మళ్ళీ బండి కదిలింది. నాకు రాను రాను విసుగు ఎక్కువవుతునాది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. రైలు మెల్లగా కదులుతుంది. ఈ బండికి మా ఊరివాళ్ళు ఎందుకు ‘నత్త’ అని పేరు పెట్టారో ఇప్పుడు నాకు అర్ధమైంది. ఇలా ఆలోచిస్తుండగానే మళ్ళీ బండి పెద్ద కుదుపుతో ఆగిపోయింది. నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఈ సారి ఎందుకాగిందోననీ మళ్ళీ కిందకు దిగాను. కొంచెం దూరంలో ఒక లెవెల్ క్రాసింగ్ కనిపిస్తుంది. గేటు మాత్రం తీసే ఉంది. నేను గేట్ దగ్గరకు నడుచుకొని వెళ్ళాను. అక్కడ నలుగురు మనుషులు నిలబడి ఉన్నారు. వాహనాలు రొద చేస్తూ వెళ్లిపోతున్నాయి. గేట్ మేన్ మాత్రం అక్కడ కనిపించలేదు. ఇంతలో గార్డు ఎర్ర జెండా పట్టుకొని అక్కడికి వచ్చాడు.
నేను అక్కడున్న ఓ మనిషితో ”బండి ఎందుకు ఆగిపోయింది? గేటు ఎందుకు వెయ్యలేదు?” అని అడిగాను.
”సార్, గేట్ మేన్ ఊళ్ళో జరుగుతున్న పెళ్లి భోజనానికి వెళ్ళేడు. మమ్మల్ని అతను వచ్చే దాక చూడమన్నాడు” అని చెప్పాడు.
”డ్యూటీలో ఉంటూ పెళ్లి భోజనానికి ఎలా వెళ్ళాడు? ఇది చాల ఘోరం” అన్నాను నేను.
”బాబు వాడికిది అలవాటే. మొన్న ఫుల్లుగ తాగేసి ఇంట్లో రోజంతా పడుకుండిపోయాడు. పాపం వాడొచ్చేదాకా బండి ఇక్కడే ఉండిపోయింది” అన్నాడు అప్పుడే వచ్చిన గార్డు.
”మరిప్పుడేం చేస్తారు? వాడొచ్చేదాకా బండి వెళ్ళదా?”
”తప్పదు సార్, మీకేమైనా పనుంటే చూసుకొని తాపీగా రండి. ఈ లోపల వాడు వచ్చేస్తాడు. ఈ గేటు మేన్ అప్పన్న అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాడు కానీ గొప్ప సిన్సియర్ ఫెలో” అన్నాడు గార్డు.
”ఎడిసినట్లుంది వాడి సిన్సియారిటీ, డ్యూటీలో గేటుని వదిలేసి వెళ్ళిపోతే వాడిని సిన్సియర్ అంటారేమిటి” అన్నాను కోపంగా.
”వీడు చాలా నయం. వీడికి ముందు వాడైతే చెప్పకుండా రెండేసి రోజులు ఎక్కడికో వెళ్లిపోయేవాడు. అప్పుడు మేమే గేటు వేసుకొని బండి గేటు దాటించేవాళ్ళం. వాడి మీద వీడు బెటరు” అన్నాడు గార్డు చిరు దరహాసంతో.
గంట తరువాత వాడు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు వెయ్యడంతో మళ్ళీ బండి కదిలింది. కానీ పావు గంట తరువాత మళ్ళీ ఆగిపోయింది. అదో చిన్న స్టేషన్. నిర్మానుష్యంగా ఉంది. కానీ అక్కడ చాలా సేపు ఆగిపోయింది. నాకు విసుగొచ్చి స్టేషన్లోకి వెళ్లి అక్కడ డ్యూటీలో ఉన్న మేస్టారుతో ”ఎందుకండీ ఇంతసేపు బండి ఆగిపోయింది? మళ్ళీ ఏదైనా క్రాసింగా?” అని అడిగాను.
”లేదు సార్, ఇవాళ ఈ ఊరు సంత.అక్కడ పనస పళ్ళు గొప్ప చవక. వాటిని కొనుక్కోడానికి డ్రైవర్లిద్దరూ సంతకి వెళ్లారు. ఇక్కడికి ఆ సంత ఐదు కిలోమీటర్లే. ఓ గంటలో వచ్చేస్తారు. కావలిస్తే మీరూ వెళ్ళండి” అన్నాడు విసన కర్రతో విసురుకుంటూ.
”ఇంకా అతనితో మాట్లాడటం వేస్టు అనిపించి వెనక్కి వచ్చి కూర్చున్నాను. గంట తరువాత బండి కదిలి మరో రెండు గంటల తరువాత నేను వెళ్లాల్సిన ఊరు చేరింది. నేను స్టేషనులో దిగి పొగ బండికి ఓ దండం పెట్టి ఇంకెప్పుడూ అందులో రాననీ ఒట్టు పెట్టి ఊళ్లోకి వెళ్ళిపోయాను.
గన్నవరపు నరసింహ మూర్తి, 7752020123



