ఇంకో పది నిమిషాల్లో ఈ పనిని పూర్తి చేయాలి; అనుకుంటున్నాడే గానీ కుర్చీలోంచి లేవలేకపోతున్నాడు అరవింద్. వెళ్తున్న కొద్ది లోతు తెలియనట్లుగా స్క్రీన్లో మెరుస్తున్న సోషల్ మీడియా అతన్ని కదలనివ్వకుండా చేస్తోంది. మెసేజులు, రీల్సు, వీడియోలు, గేమ్స్.. ఇలా అన్నీ వరుసగా అతని చూపుల్ని లాక్కుంటూనే ఉంది. బయటనుంచి వాహనాల రొద వినిపిస్తోంది. బరువుగా ఉన్న కనురెప్పలని మూస్తూ, తెరుస్తూ లాప్టాప్ లోకి నిమగమయ్యాడు అరవింద్. ఒకపక్క కళ్ళ మంటలు, మరోపక్క ఆగకుండా వచ్చే ఆవలింతలు.. చేస్తున్న పనిమీద శ్రద్ధ లేకపోయినా ‘తప్పనిసరి తద్దినంలా’ లాప్టాప్ తెరమీద దృష్టి సారిస్తూ పక్కనున్న కాఫీ కప్పు అందుకున్నాడు. అప్పటికే చల్లారిపోయిన కాఫీ నోటికి రుచించలేదు. ఆఫీస్ ఫైల్స్ ఒక్కొక్కటి చూస్తూ మధ్య మధ్యలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్,యూట్యూబ్ ఒకదాని తర్వాత ఒకటి తెరుస్తూ కొన్నిటికి సమాధానాలు ఇస్తూ అతని వేళ్ళు కీబోర్డ్ మీద చక చకా కదలసాగాయి. ‘కాఫీ తాగారా.. ఈరోజు కూడా చల్లారిపోయిందా?’ అంటూ లోపలికి వచ్చింది ప్రత్యూష. తాగకుండా పక్కన పెట్టిన కప్పు వంకా, ఆలస్యంగా గుర్తుచేసిన భార్యవంక అయోమయంగా చూస్తూ పైకి కనీ కనిపించినట్లుగా చిన్న చిరునవ్వు నవ్వాడు. ‘రోజూ ఇంతే మీరు.. మళ్లీ వెచ్చబెట్టలేక చచ్చిపోతున్నాను. లోకం మునిగిపోయేంత పనేముంది? కాఫీ తాగి చేసుకోవచ్చుగా’ అంది ప్రత్యూష టేబుల్ మీద ఉన్న కప్పు చేతిలోకి తీసుకుంటూ.
‘ఏం చేస్తాం? జీవితం నానాటికి ముళ్ళకంచెగా మారిపోయింది. ఉద్యోగం, స్నేహాలు, వార్తలు, మాటలు, ఆశలు అన్నీ ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి. ఈ వలయాన్ని వదిలితే ఎక్కడ వెనకబడిపోతామో అని బెంగ! ఊపిరి నన్నొదిలితే తప్ప నేను దీన్ని వదిలేలా లేను’ అన్నాడు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ.
‘బతుకంతా ఆన్లైన్లోనే బుగ్గయిపోతోంది. ఇంట్లో మాటల్లేవు, సరదాగా గడిపే పూటల్లేవు. అన్నీ అరచేతి పెట్టెల్లోనూ, అంగుళాల తెరల్లోనూ మరక్కాగిపోతున్నాయి’ తనలో తనే గొణుక్కుంటూహొహొకప్పు తీసుకుని బయటికి వెళ్ళింది ప్రత్యూష. కుర్చీలోంచి పైకి లేచి కిటికీ రెక్క తెరిచాడు. చల్లటి గాలి ఒంటికి తగిలింది. వంద ఏనుగుల గుంపులు ఒకచోట చేరినట్లుగా ఆకాశం మందంగా కదులుతోంది. ఎనిమిది గంటలు దాటుతున్నా మబ్బు తలుపుల చాటు నుంచి బయటికి రాలేక సూర్యుడు నానాయాతన పడుతున్నట్లుగా ఉంది. చెట్టుకొమ్మలు ఒక్కోసారి భారంగా కదులుతున్నాయి, మరోసారి ఘోరంగా ఊగుతున్నాయి. చూస్తుండగానే టపటపమంటూ చినుకులు పడసాగాయి. ఇంటి ముందు గేటు పక్కగా ఉన్న కారు షెడ్డు మీద వాన చుక్కల చప్పుడు పెద్దగా వినిపిస్తోంది. నడుస్తున్న వాళ్లంతా ఎక్కడ తడిసిపోతామో అన్నట్లుగా పక్కనున్న చెట్ల కిందకి, కిరాణా షాపుల లోపలికి పరిగెడుతున్నారు.
ఒకసారిగా ఇల్లు, ఊరు గుర్తొచ్చాయి. తోటి ఈడు పిల్లలతో కలిసి వర్షంలో చేసిన అల్లరి గుర్తొచ్చింది. వాన పడుతుందన్న స్పహ ఉండేది కాదు, వానలో తడుస్తామేమో నన్న బెంగ లేదు. ఎగరడం, దూకడం, ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం లాంటి పనులతో సంపూర్ణమైన బాల్యాన్ని అనుభవించిన రోజులు గుర్తొచ్చాయి. ‘నాన్నా… ఈరోజు స్కూలు ప్రాజెక్టుకి మోడల్ చూపించాలి. రాత్రి అడిగితే ఖాళీ లేదన్నావు. స్కూలుకు టైం అవుతోంది, తొందరగా చేసిస్తావా’ అంటూ గదిలోకొచ్చింది పదవ తరగతి చదివే కూతురు మోక్షిత. వాన మీద నుంచే దష్టి మరలింది. జ్ఞాపకాల వల చెదిరింది. కూతురు వైపు చూస్తూ ‘..హొహొఇప్పుడా? ఆన్లైన్లో మీటింగ్ ఉంది. లేటుగా అటెండ్ అయితే బాగోదు. సాయంత్రం తప్పకుండా చేస్తా చిట్టి తల్లీ’ అన్నాడు నీరసంగా. ప్రతీ రోజు ‘ఇది చెప్పు, అది చెయ్యి’ అంటూ కూతురు తన దగ్గరికి రావడం మామూలే! ‘ఇప్పుడు కష్టం మీటింగ్ ఉంది, ఫైల్స్ చూడాలి’ అని చెప్పడం కూడా మామూలే! ఏంటో.. సాంకేతికత పెరిగే కొద్దీ సంసారాలు ఇరుకు, గరుకు అయిపోతున్నాయి. కుటుంబ సంబంధాలన్నీ కుంటి నడకన సాగుతున్నాయి. దేన్ని వదలాలో తేల్చుకునేసరికి ప్రతిరోజూ తెల్లారిపోతూనే ఉంది. కథ షరా మామూలే!! ‘నిన్నూ నన్నూ పట్టించుకునే తీరిక మీ నాన్నకెక్కడుందే! ఆన్లైనే ఆయనకి ఇల్లూ, వాకిలి! నేనొక పరిచారికని, నువ్వొక పిల్ల దెయ్యానివి. నీ ప్రాజెక్ట్ పని నేను చేసి పెడతాను గానీ ఆయన్నలా వదిలెరు’ అంటూ కాఫీ కప్పు విసురుగా టేబుల్ మీద ఉంచి గదిలో చిందరవందరగా వున్న వస్తువుల్ని సర్దసాగింది ప్రత్యూష.
‘వర్క్ ఫ్రం హోం’ అంటే ఇంట్లో వాళ్లతో ఎక్కువ సమయం గడుపొచ్చు అనుకునేవాడు. మొదట్లో సరదాగా ఉండేది. ఎక్కువసేపు ఆన్లైన్లో ఫైల్స్ చూడడం, మెయిల్స్‌కి రిప్లై ఇవ్వడం లాంటి పనులతో పాటు సామాజిక మాధ్యమాలలోను స్నేహితులు పెరిగిపోయారు. మొదట్లో చిన్న వినోదంగా మొదలైన ఆన్లైన్ వ్యాపకం రానురానూ దానికి బానిసను చేసేసింది. పనున్నా, లేకపోయినా ఏదో ఒక వెబ్సైట్లో ఏదో ఒకటి వెతకడం తీరని దాహంలా మారిపోయింది. ఇంటికంటే ఇంటర్నెట్ బెటర్ అన్నట్లుగా పరిస్థితి తయారైపోయింది. ఎప్పుడైనా ఎక్కువ వాన కురిసినప్పుడో, వేరే కారణాల వల్లనో నెట్ రావడం ఆగిపోతే పిచ్చెక్కినట్లుగా ఉండేది. శ్వాస ఆగిపోయినట్టు అనిపించేది. దానికి తోడు పని ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో కొన్ని కొన్ని ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడ్డాడు అరవింద్. ఎప్పుడూ పది నిమిషాలు ఖాళీ దొరికినా ఇంట్లో వాళ్లతో మాట్లాడటం మానేసి ఏదో ఒక గేమ్ ఆడేవాడు. ఎక్కువ సమయం గేమ్స్ ఆడటం వల్ల కళ్లకు నిద్ర కరువై కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడిపోయాయి. మొహం అంతా వాడిపోయినట్లుగా, బరువు తగ్గిపోతున్నట్లుగా తనలో తనకే ఏదో తెలియని వెలితి కనిపించ సాగింది. ఎప్పుడైనా స్క్రీన్ మీద మొహం చూసుకున్నప్పుడు ఆ దిగులు మరింత పెరిగేది. ‘నువ్వు ఎప్పుడూ ఇంతే నాన్నా… ఎప్పుడూ బిజీ! ముఖ్యమైన వాటికి కూడా ఇవే కారణాలు చెప్తావు.
మా ఫ్రెండ్స్ అందరి నాన్నలు వాళ్లకి ఎంత హెల్ప్ చేస్తారో తెలుసా? మంచి మంచి ప్రాజెక్టులు చేసి తీసుకొస్తారు స్కూల్కి’ బుంగమూతి పెట్టుకునిహొహొకూతురు, కోపంగా చూస్తూ భార్యా ఇద్దరూ బయటికి వెళ్లిపోయారు. కూతురి వంక దిగులుగానూ, భార్యవంక భయంగానూ చూశాడు అరవింద్. చేజారిపోతున్న బంధాలకంటే చేయాల్సిన పనులే కళ్లముందు కదలాడాయి. ‘బిజీ’ అనే పదాన్ని ప్రతిరోజు ‘ఒకే కారణం’గా చెప్పడం అతనికి కూడా ఇబ్బందిగానే ఉంది. బతుకంతా అంతర్జాలం అనే నడి సముద్రంలో మునిగిపోతున్న నావలాగా మొనకలేస్తోది మునకలేస్తోంది. ఆఫీస్ టైమింగ్స్ అయితే ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకని ఉండేది. ఎప్పుడైనా అర్జెంటు పని పడితే గంటో, అరగంటో ఆలస్యం అయ్యేది. ఇప్పుడేంటో… వేళకి తిండి లేదు, నిద్ర రాదు. బుర్ర నిండా భూగోళం, దాన్నిండా చేయాల్సిన పనులు, పూర్తి చేయాల్సిన టార్గెట్లు! ఇంటికెన్ని గుమ్మాలున్నాయో ఎప్పుడో మర్చిపోయాడు, ఎక్కి దిగుతున్న మెట్లెన్నో ఎన్నిసార్లు తలుచుకున్నా గుర్తు రాదు.
బయట వాన పెరుగుతున్న దానికి సూచనగా కిటికీలోంచి కొన్ని చినుకులు గదిలో పడసాగాయి. తలుపులు మూయాలన్న ధ్యాస లేదు. వర్షాన్ని కూడా వాల్ పేపర్ మీద చూస్తూ అతని వేళ్ళు మళ్ళీ కీబోర్డ్ మీద పరుగులు తీయసాగాయి.
అరవింద్… అత్తయ్యగారు లైనులో ఉన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయట్లేదని నాకు చేశారు’ అంటూ ప్రత్యూష ఫోను చేతిలో పెడుతుంటే ఆదుర్దాగా చూస్తూ తన ఫోన్ స్క్రీన్ ఆన్ చేశాడు. తల్లి నుంచి వచ్చిన కాల్స్ కనిపించాయి. ఒక్క క్షణం సిగ్గుగా అనిపించింది. ‘అరూ… నాన్నకి రాత్రి నుంచి వొంట్లో బాగోలేదురా. మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి అబ్జర్వేషన్లో పెట్టారు. నాకు కాలూ చెర¶్య ఆడట్లేదు. సమయానికి ఎవరూ దగ్గర్లేరు’ ఆందోళనగా అవతలి నుంచి అమ్మ గొంతు వినిపించింది. ‘తమ్ముడు రాలేదా అమ్మా’ అన్నాడు. ఏం అడగాలో, ఏం అడిగాడో అంతా అయోమయంగా ఉంది. ‘వాడికేదో అర్జెంటు ఆఫీసు పని ఉందని నిన్న సాయంత్రమే ఊరికెళ్లాడు. వీలయినంత తొందరగా రారా.. నాకేమీ పాలుపోవట్లేదు’ అమ్మ గొంతు నుంచి సన్నగా ఏడుపు వినిపిస్తుండగా ఫోన్ కట్ చేసి భార్యవంక చూశాడు. ఆమె మొహంలో కూడా ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘ఇంకా ఆలస్యం చేస్తారెందుకు? బయల్దేరండి. నేనీలోపు బట్టలు సర్దుతాను’ అంటూ వెనక్కి తిరిగిన ప్రత్యూష ‘ప్రత్యూ’ అన్న పిలుపుతో ఆగిపోయింది. ‘అక్కడికి నువ్వెళ్తే బాగుంటుందేమో’ అన్నాడు కిటికీ వైపు చూస్తూ.
అతని వైపు ఆశ్చర్యంగా, ఒకింత కోపంగా చూస్తూ. ‘అక్కడికెళ్తే నేను అత్తయ్యకి తోడుగా ఉండి ఓదార్చగలను గానీ, మావయ్యగారికి కావలసినవి చేసిపెట్టలేను. పని ఒత్తిడని చెప్పి ఇలాంటి వాటిని కూడా పక్కకు పెడితే రేపు లోకం మనల్ని పక్కనబెడుతుంది. మాట్లాడకుండా బయల్దేరండి’ అంటూ బయటికి నడిచింది.
ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఇక వెళ్లక తప్పదన్నట్లుగా పైకి లేచి కావలసిన ల్యాప్టాప్, అవసరమైన కొన్ని ఫైళ్లు బ్యాగులో పెట్టుకున్నాడు. గదిలోనుంచి బయటికి వచ్చి ప్రత్యూషతో చెప్పి బయల్దేరాడు. ఒంటినిండా చీర కప్పుకుని ఆస్పత్రి బయటున్న కుర్చీలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తల్లిని చూడగానే ప్రాణం నీరైపోయింది అరవింద్‌కి. తన ఎదుగుదలకి నిద్రాహారాలు లేకుండా శ్రమించిన అమ్మ నిస్సహాయంగా కనిపించింది. కొడుకుని చూసి వాటేసుకుని బావురుమని ఏడ్చింది మహాలక్ష్మమ్మ. తల్లిని తీసుకుని ఐసీయూ రూము వరకూ వెళ్లి అద్దంలో నుంచి తండ్రిని చూశాడు. ఆ స్థితిలో తండ్రిని చూసి మనసంతా చేదుగా అయిపోయింది. ఈలోపు జేబులో ఫోన్ మోగింది. మాట్లాడుతూ తల్లినక్కడే వదిలేసి బయటికి వచ్చాడు. ఆఫీసు నుంచి త్వరగా పంపించాల్సిన ఫైల్స్ గురించి అవతలి వ్యక్తితో మాట్లాడసాగాడు. ఈలోపు మహాలక్ష్మమ్మ కొడుకు దగ్గరకు వచ్చి చేతిలోని స్లిప్ చూపించి ‘ఈ మందులు తీసుకురమ్మన్నారు’ అని చెప్పింది.
ఫోనులో మాట్లాడుతూనే అప్రయత్నంగా జేబులో చేయి పెట్టి డబ్బు పైకి తీసి తల్లి చేతిలో పెట్టి ‘అమ్మా.. అర్జెంట్ కాల్. కొంచెం నువ్వే వెళ్లి తీసుకురా’ అంటూ సైగ చేశాడు. మహాలక్ష్మమ్మ అతని వంక అయోమయంగా చూస్తూ బయటికి నడిచింది. ఫోన్ మాట్లాడ్డం పూర్తయ్యాక అక్కడున్న కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. కీ బోర్డ్ మీద అతని వేళ్లు చకచకా కదలసాగాయి. ఏవో మెయిల్స్ కి రిప్లై ఇస్తూ తల్లి మందులు తీసుకుని ఐసీయూ వైపు వెళ్లిన సంగతి కూడా గమనించలేదు అరవింద్. అక్కడున్న నర్సుకు మందులిచ్చి కొడుకుకు దగ్గరగా ఉన్న మరో కుర్చీలో మౌనంగా కూర్చుంది మహాలక్ష్మమ్మ. పనయ్యాక పక్కకు చూసిన అరవింద్‌కి ఏదో ఆలోచిస్తూ తల్లి కనిపించింది. ల్యాప్టాప్ మూసేసి తల్లి పక్కన కూర్చున్నాడు. ‘సారీ అమ్మా… ఏదో అర్జెంట్ వర్క్. మందులు తెచ్చావా’ అన్నాడు. తలూపింది కానీ జవాబు చెప్పలేదు. కాసేపయ్యాక అరవింద్‌ని చూస్తూ ‘కొడుకంటే కొండంత అండ అనుకున్నాన్రా. నిన్నిలా చూస్తుంటే ఏదో తెలియని బాధ కడుపులో లుండలు చుట్టుకుపోతోంది. చెప్పుల్లో కాళ్లు పెట్టుకున్నట్టుగా వచ్చిన నిన్ను చూసి సంతోషపడాలో, లోకం పట్టనంత పనిలో మునిగిపోతున్న నిన్ను చూసి బాధపడాలో అర్థం కావట్లేదు. దీనికంటే అసలు నువ్వు రాకుండా ఉంటేనే బాగుండేది’ అంది.
ఒక్క క్షణం అరవింద్ నవనాడులూ కుంగిపోయాయి. భూమి ఉన్నఫళంగా బద్దలై తనని లోపలి ఈడ్చుకు పోతున్నట్లుగా అనిపించింది. ఇక తను అక్కడ ఉండాలో, ఉండకూడదో తేల్చుకోలేకపోయాడు. ఏమీ మాట్లాడకుండా జేబులో నుంచి మరికొంత డబ్బు తీసి తల్లి చేతిలో పెట్టాడు. మహాలక్షమ్మ అతని వైపు అయోమయంగా చూసింది. కాసేపయ్యాక ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరమే కాదనను! కానీ దానికంటే కడుపున పుట్టినవాళ్లు కళ్లముందు ఉండడం ఇంకా అవసరం. ఈ డబ్బు వద్దులేరా… నేనెక్కడైనా సర్దుబాటు చేసుకుంటాను’ అని చెప్పి ఐసీయూ వైపు సాగిపోతున్న తల్లిని చూసి దు:ఖం పొంగుకొచ్చింది. భారమైన హదయంతో అక్కడి నుంచి కదిలాడు అరవింద్. గదిలో కూర్చుని పని చేస్తున్నాడన్న మాటేగానీ మనసు మనసులో లేదు అరవింద్‌కి. ఐసీయూ బెడ్ మీద స్పహ లేకుండా ఉన్న తండ్రి, గండం నుంచి గట్టెక్కించమని అటూ ఇటూ తిరుగుతున్న తల్లి గుర్తొచ్చారు. కన్న తల్లిదండ్రుల్ని కీకారణ్యంలో వదిలేసి వచ్చాడు, కనీసం తమ్ముడు వచ్చేవరకైనా ఆగలేకపోయాడు.
తల్లేదో కోపంలోనో, బాధలోనో ఒక మాటంటే దాన్ని పట్టుకుని తిరిగి రావడం సమంజసం అనిపించలేదు. తల్చుకుంటుంటే అరవింద్ గుండె బద్దలైపోతోంది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూశాడు. ఫేస్బుక్ కంటే ప్రేమానుబంధాలు బలీయమైనవనిపించింది. వాట్సప్ స్టేటస్‌ల కంటే వాటేసుకుని గుండెలకు హత్తుకున్న కన్నప్రేమ గొప్పదనిపించింది. ట్విట్టర్ సందేశాల కంటే మనిషిగా గుప్పెడు మానవత్వాన్ని గుండెల్లో నింపుకోవడం మేలనిపించింది. ప్రయాణం ఎక్కడ మొదలైందో… ఎలా కొనసాగుతోందో… ఎక్కడ ముస్తుందో! బలమైన మమతల ముడులు విడిపోతున్నాక, అనుబంధాల వాకిళ్లు కనుమరుగవుతున్నాకా… మనిషి ఏం పోగేసుకుంటాడు? ఆహారం కోసం తాను అల్లుకున్న గూడులో తానే చిక్కుకుపోయిన సాలీడులా మారిపోయింది పరిస్థితి.
అవసరమో, అనవసరమో తెలియని అంతర్జాలపు అవసరం మనిషిని ఆన్లైన్ సాలీడుగా మార్చేసింది. పుట్టడానికి, పెరగడానికి, తినడానికి, తిరగడానికి, పరిగెత్తడానికి, పాకులాడ్డానికి… ఇలా ప్రతీ పనికీ ఒక టైం ఉంది. గెలుస్తున్నామో, ఓడిపోతున్నామో తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ‘పని ఒత్తిడి’ పేరుతో తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని ఎంతగా దూరం చేసుకున్నాడో అనిపించింది. హఠాత్తుగా అతనికి ‘కూలిపోయిన ఇంటిదగ్గరా, డబ్బులేని మనిషి దగ్గరా ఎవరూ ఉండిరా. అందమైనా, బంధమైనా మనం కాపాడుకుంటేనే నిలుస్తాయి. మనం సష్టించే బంధాలే నిజమైన సంపద, మిగిలినవన్నీ కత్రిమం’ అని తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. గదిలోంచి బయటికి వచ్చిన అతనికి భోజనం బల్ల దగ్గర భార్యా, కూతురూ కనిపించారు. ‘ఏమైనా కావాలా’ అన్నట్టు అరవింద్ వైపు చూసింది ప్రత్యూష. ‘నువ్వే కావాలి’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. ప్రత్యూషలో ఎక్కడలేని ఆశ్చర్యం తొంగి చూసింది. కూర్చుని అన్నం తింటున్న కూతురితో అడిగి ముద్దలు పెట్టించుకుని తిన్నాడు. తల నిమిరాడు. కాసేపయ్యాక ‘నీ ప్రాజెక్ట్ పనినే కాదు, ఈసారి మీ స్కూల్ పేరెంట్స్ మీటింగుకు కూడా వస్తాను చిట్టి తల్లీ’ అన్నాడు.
‘నిజంగానా నాన్నా’ చిట్టితల్లి కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో మెరిశాయి. ప్రత్యూష వైపు చూస్తూ ‘రోజువారీ పనుల్లో భాగంగా ఉండాల్సిన సాంకేతికత నన్ను యాంత్రికంగా మార్చింది. నట్టింట్లో పూసే నిజమైన పువ్వుల్ని విడిచిపెట్టి నెట్టింట్లో విరిసే కృత్రిమ పువ్వుల కోసం ఎగబడ్డాను. అవసరమో, అనివార్యమో తెలియని అయోమయంలోకి వెళ్ళిపోయాను. నిజమైన ఆనందం స్క్రీన్ పైన లేదని, మనిషిని మనిషినీ కలిపే బంధాల్లో ఉందని తెలుసుకోడానికి నాకు చాలా టైం పట్టింది. ఇకనుంచి నా ఇంటికి నిప్పు పెట్టుకుని ఆ మంటల్లో చలి కాచుకోవడానికి ఆరాటపడను’ అన్నాడు అరవింద్. ప్రత్యూష మొహంలో కోటి కాంతులు విరజిమ్మాయి. ‘థాంక్యూ నాన్నా’ అంటూ కూతురు అల్లుకుపోయింది.
డా. జడా సుబ్బారావు, 9849031587


