భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఎగ్జాటిక్ పెంపుడు జంతువుల దందా
నియంత్రణలో చట్టపరమైన లోపాలు.. పెరుగుతున్న ప్రమాదాలు
ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, అటవీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం
అక్రమ రవాణాకు ప్రధాన మార్గాలుగా విమానాశ్రయాలు, ఈశాన్య సరిహద్దులు
స్మగ్లింగ్, అంటువ్యాధులు, ఆక్రమణ జాతులపై నివేదిక ఆందోళన
చట్టాలు, అమలు వ్యవస్థలను బలోపేతం చేయడంలో మోడీ సర్కారు విఫలం
న్యూఢిల్లీ : భారత్‌లో విదేశీ, అరుదైన (ఎగ్జాటిక్) పెంపుడు జంతువుల వ్యాపారం(ట్రేడ్) ఆందోళనకరంగా మారుతోంది. ఇది గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతోంది. అయితే ఈ వ్యాపారాన్ని పర్యవేక్షించే చట్టాలు, అమలు వ్యవస్థలు మాత్రం కాలానికి తగ్గట్టుగా మారలేదు. తాజా అధ్యయనం ఇదే విషయాన్ని హెచ్చరించింది. దీంతో భారత్‌లో ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, జంతు సంక్షేమం, అటవీ వ్యవస్థలపై తీవ్ర ముప్పు పొంచి ఉందని నివేదిక పేర్కొంది. విదేశీ పెంపుడు జంతువుల వ్యాపారం కోట్ల రూపాయల మార్కెట్‌గా మారుతున్నప్పటికీ.. దానిని నియంత్రించే చట్టాలు, అమలు వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేయలేకపోయిందని తాజా నివేదికతో స్పష్టమవుతోంది. భారత్‌లో ఎగ్జాటిక్ పెంపుడు జంతువుల వ్యాపారానికి సంబంధించిన చట్టాలు, విధానాలను సమగ్రంగా విశ్లేషిస్తూ ‘సేఫ్‌గార్డింగ్ బయోడైవర్సిటీ అండ్ పబ్లిక్ హెల్త్ : ఎ లెజిస్లేటివ్ పాలసీ అనాలసిస్ ఆఫ్ ఎగ్జాటిక్ పెట్ ట్రేడ్ ఇన్ ఇండియా’ పేరుతో ‘హ్యూమెన్ వరల్డ్ ఫర్ ఎనిమల్స్ ఇండియా ఫౌండేషన్’, స్వతంత్ర వన్యప్రాణి వ్యాపార పరిశోధకురాలు కృతికా బాలాజీ ఈ నివేదికను విడుదల చేశారు.
నివేదిక ప్రకారం.. భారత్‌లో ఎగ్జాటిక్ పెంపుడు జంతువుల మార్కెట్ విలువ 2024లో 4.26 కోట్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.360 కోట్లకు పైగా)గా అంచనా. 2030 నాటికి ఇది 7.58 కోట్ల డాలర్లకు (రూ.640 కోట్లకు పైగా) పెరిగే అవకాశం ఉంది. 2020లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద వెల్లడింపు పథకం (వాలంటరీ డిస్‌క్లోజర్ స్కీం-వీడీఎస్) కింద 2021 ఫిబ్రవరి నాటికి దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా (యూటీ)ల్లో 40 వేల మంది తమ వద్ద ఉన్న విదేశీ జంతువులను నమోదు చేశారు. అయితే ఇది చట్టబద్ధంగా నమోదైన జంతువుల వివరాలే. వీటితో పాటు అక్రమంగా విదేశాల నుంచి దేశంలోకి తీసుకొస్తున్న జంతువుల వ్యాపారం కూడా పెద్దఎత్తున సాగుతోందని నివేదిక పేర్కొంది. ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ సేకరించిన వివరాల ప్రకారం.. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 202 వన్యప్రాణి నేరాలు వెలుగుచూశాయి. అందులో 151 కేసులు దేశీయ వన్యప్రాణుల అక్రమ వేట, అక్రమ రవాణాకు సంబంధించినవైతే, మిగిలిన 51 కేసులు ఆగ్నేయాసియా దేశాల నుంచి సజీవ విదేశీ జంతువులను స్మగ్లింగ్ చేసి పెంపుడు జంతువుల మార్కెట్‌కు తరలించే ప్రయత్నాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి.
స్మగ్లింగ్‌కు రెండు ప్రధాన మార్గాలు
భారత్‌లోకి విదేశీ జంతువుల అక్రమ రవాణాకు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల మీదుగా ఈశాన్య రాష్ట్రాల గుండా భూభాగ మార్గం ఒకటైతే.. రెండోది చెన్నై, బెంగళూరు, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వైమానిక మార్గం. ఈ మూడు విమానాశ్రయాలు దేశంలోకి వచ్చిన జంతువులను ఇతర రాష్ట్రాలకు పంపించే కేంద్రాలుగా కూడా మారాయని నివేదిక పేర్కొంది. ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు విదేశీ జంతువులను భారీ సంఖ్యలో పెంచుతూ.. ప్రయివేటు జూలను తలపించే స్థాయికి చేరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
చట్టాల్లో ప్రధాన లోపాలివే…
నివేదిక ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు పలు కీలక అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. దిగుమతి సమయంలో మాత్రమే ఆరోగ్య పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు అమలవుతున్నాయి. ఆ తర్వాత జంతువుల ఆరోగ్యంపై తప్పనిసరి పర్యవేక్షణ లేదు. వెటర్నరీ వైద్యులు ప్రమాదకర అంటువ్యాధులు గుర్తించినా.. వాటి గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిన చట్టబద్ధ బాధ్యత లేదు. అటవీశాఖ, రక్షణ సిబ్బంది తగిన రక్షణ పరికరాలు (పీపీఈ), ప్రత్యేక శిక్షణ లేకుండానే స్వాధీనం చేసుకున్న జంతువులను నిర్వహిస్తున్నారు. దేశంలో పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ఆక్రమణ జాతుల (ఒక విదేశీ జాతి స్థానిక జాతులకు హాని చేసి, వాటి స్థానాన్ని ఆక్రమించేవి) సమగ్ర అధికారిక జాబితా ఇప్పటికీ లేకపోవడం కూడా మరో ప్రధాన లోపమని నివేదిక పేర్కొంది.
ప్రజారోగ్యానికి ముప్పు
విదేశీ జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రత్యేకించి రెడ్-ఇయర్డ్ స్లైడర్ తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా ఆక్రమణ జాతిగా మారాయని పేర్కొంది. ఇవి సహజ జీవావరణంలో స్థానిక జాతులను తరిమివేయడమే కాకుండా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలను కూడా వ్యాపింపజేస్తాయని నివేదిక వెల్లడించింది. అలాగే రాకూన్లు, మీర్‌క్యాట్లు, స్క్విరెల్స్ వంటి అనేక జంతువులు కూడా భారత మార్కెట్లలోకి చేరుతున్నాయనీ, ఇవి అనేక రకాల వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
నివేదిక సూచించిన ముఖ్యమైన సిఫారసులు
తాజా నివేదిక పలు కీలక సిఫారసులు చేసింది. ఇందులో భాగంగా… విదేశీ పెంపుడు జంతువులను వదిలించుకోవాలనుకునే యజమానుల కోసం జాతీయ సరెండర్ విధానం రూపొందించాలి. ఆక్రమణ జాతుల దిగుమతి, వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిషేధించే చర్యలు చేపట్టాలి. మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులు, ద్వితీయ శ్రేణి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో క్వారంటైన్ సదుపాయాలను విస్తరించాలి. నేషనల్ వన్ హెల్త్ మిషన్ పరిధిలో విదేశీ జంతువుల వ్యాపారంతో కలిగే ఆరోగ్య ముప్పులను చేర్చాలి. స్వాధీనం చేసుకున్న విదేశీ జంతువులను స్వదేశాలకు పంపించే విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో అమలు చేయాలి.
ప్రత్యేక జాతీయ చట్టాలు అవసరం
అంతర్జాతీయంగా ప్రమాదంలో ఉన్న జాతుల వ్యాపారాన్ని నియంత్రించే ‘సిటీస్’ (అంతరించిపోతున్న అడవి జంతువులు, మొక్కల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం) పరిధిలో లేని అనేక విదేశీ జాతులు ప్రస్తుతం భారత మార్కెట్లోకి వస్తున్నాయని పరిశోధకురాలు కృతికా బాలాజీ తెలిపారు. ‘సిటీస్’ అనేది అంతర్జాతీయ వన్యప్రాణి వ్యాపారాన్ని నియంత్రించే వ్యవస్థ మాత్రమేనని, భారత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక జాతీయ చట్టాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘దేశంలోకి వస్తున్న విదేశీ జంతువుల సంఖ్య, వైవిధ్యం ఇప్పటివరకు ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. ఏ విదేశీ జాతులను దేశంలో పెంచడానికి అనుమతించాలి? వేటిని పూర్తిగా నిషేధించాలి? అవి మన పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఎంత ప్రమాదకరం? అనే అంశాలపై ఇప్పుడు చట్టపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కృతికా బాలాజీ సూచించారు.
అప్రమత్తం కాకపోతే ప్రమాదమే!
భారత్‌లో విదేశీ జంతువులను పెంచుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారుతున్నా.. వాటి వెనుక దాగి ఉన్న ప్రజారోగ్య, పర్యావరణ, జీవవైవిధ్య, జంతు సంక్షేమ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. 2022లో కేంద్రం వన్యప్రాణి సంరక్షణ చట్టంలో సవరణలు చేసినప్పటికీ.. జూనోటిక్ వ్యాధులు, ఆక్రమణ జాతులు, జంతు సంక్షేమం, అక్రమ వ్యాపారం వంటి కీలక అంశాల్లో ఇంకా గణనీయమైన లోపాలు ఉన్నాయని పేర్కొంది. చట్టాలు, అమలు వ్యవస్థలు వెంటనే బలోపేతం కాకపోతే భవిష్యత్తులో ఈ వ్యాపారం దేశానికి కొత్త జీవప్రమాదాలు, పర్యావరణ సంక్షోభాలను తీసుకురావచ్చని నివేదిక హెచ్చరించింది.


