Sunday, July 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరం నుంచి నీళ్లివ్వాల్సిందే

కాళేశ్వరం నుంచి నీళ్లివ్వాల్సిందే

- Advertisement -

ప్రజా ప్రయోజనాలే ముఖ్యం సాగు, తాగునీటి కొరత రానివ్వొద్దు
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి
నిర్లక్ష్యం వహిస్తే సహించం..పోరాడుతాం
ఆ ప్రాజెక్టుపై అఖిల పక్షంతో చర్చించండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
కన్నెపల్లి పంపు హౌస్‌‌ను పరిశీలించిన బృందం

నవతెలంగాణ-భూపాలపల్లి
“రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. కాళేశ్వరం నుంచి నీళ్లివ్వాల్సిందే. రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత రానివ్వొద్దు. నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరే మిటో స్పష్టం చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితు లేర్పడ్డాయి. సాగునీటికే కాదు తాగునీటి ఎద్దడీ ఏర్పడబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్చించేందుకు అఖిల పక్షాన్ని పిలవండి. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. ప్రజల పక్షాన పోరాటాలకు శ్రీకారం చుడతాం” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. శనివారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహ దేవపూర్ మండలం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్ట్‌లను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ వచ్చిందన్నారు. రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయన్నారు. ఇప్పటికే కరువు పరిస్థితి నెలకొన్నదని, సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. కరువు పరిస్థితులున్నందున రైతులు పంటలు వేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే పంటలేసిన రైతులు వర్షాలు లేక నష్టపోతున్న పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో సాగునీటి సమస్యనేకాక, తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. ఇలాంటి పరిస్థితిలో నీటి వనరుల్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో తెలుసుకునేందుకు ప్రాజెక్టును సందర్శించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైన పద్ధతిలో జరిగిందా లేదా? చేసిన ఖర్చులో దుర్వినియోగం జరిగిందా ? అవినీతికి పాల్పడ్డారా ? లేకపోతే ఇక్కడ కట్టడం సరైందా కాదా ? అనే విషయాలపై గతంలో చర్చలు జరిగాయన్నారు. ఇప్పుడు ఆ అంశాలనే పరిశీలిస్తున్నామన్నారు. కన్నెపల్లి దగ్గర ఉండే నీటి వనరులను ఉపయోగించు కోవడానికి అవకాశం ఉందన్నారు. కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్‌కు లిఫ్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కన్నెపల్లి దగ్గర ఉండే నీటిని అన్నారం బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ చేయగలిగితే, ఇక్కడ మొత్తం దీని కెపాసిటీ ఎంత ఉందో, అన్నారం బ్యారేజ్‌లో వాటిని నిలిపి 2 నుంచి 3 టీఎంసీల నీటిని అక్కడ నిల్వ ఉంచినట్లయితే మిగతా వాటికి ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ రోజూ దాదాపు ఒకటిన్నర టీఎంసీ నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రభుత్వం జాగ్రత్తపడి ఉంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండేవి కావన్నారు. అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోవడంతో ఇప్పటికే టీఎంసీన్నర నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. కన్నెపల్లి దగ్గర ఆపేసి, వాటి ద్వారా ఇక్కడ కనీసం మూడు టీఎంసీలకు తగ్గకుండా లిఫ్ట్ చేయగలిగితే, హైదరాబాద్‌కు కూడా నీటి సమస్య తీరేదన్నారు. మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కూలిపోయి, ఇక్కడ ఉపయోగించుకోవడానికి అవకాశం లేదనే పేరుతో దీన్ని వాడకపోయినా, అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెబుతున్నారన్నారు. అక్కడ లీకేజీలు ఉన్నాయని, ఎక్కడో మధ్యలో కొంత గుంట ఏర్పడి ఉందనే విషయాలు గతంలో చెప్పారన్నారు. అది ఇప్పటికీ ఉందా లేదా అనేది స్పష్టం కావాలంటే, కొంత నీటిని అక్కడ నింపితే, లీకేజీలు ఏమున్నాయి..? అలాగే నీటి వృధా అక్కడ ఆపడానికి సాధ్యం కానంతగా కిందికి వెళ్లిపోయే పరిస్థితి ఉందా, లేకపోతే కంట్రోల్ చేసుకొని పైకి వాడుకోవడానికి అవకాశం ఉందా అనేది కూడా స్పష్టం అయ్యే అవకాశం ఉందన్నారు. కానీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం ఏమీ చేయడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలేశ్వరం అనే దాని మీద దృష్టి పెట్టింది తప్ప వాటిలోనూ ఏయే అవకాశాలు ఉన్నాయి, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన చేయట్లేదని జాన్‌వెస్లీ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నీటిని వాడుకోవడానికి ఉన్న అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తెలిపారు. రాజకీయ అంశాలపై పెడుతున్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై చూపడం లేదన్నారు. లోపాలను సరిచేయడానికి రెండున్నరేండ్లలో ఏలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి సమస్య పరిష్కరించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం క్యాబినెట్‌లో చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నీటిని వాడుకోవడానికి ఏ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినా సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 75.5 అడుగుల నీళ్లు ఉన్నాయని, 91.5 మినిమమ్ బేస్ లెవెల్‌‌గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాలుగు మీటర్ల ఎత్తులో నీళ్లు ఉన్నాయని, పంప్ హౌస్ లోకి నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అక్కడి నుంచి పంపులు ఆన్ చేసి, అన్నారం బ్యారేజ్ లోకి పంపించే అవకాశం ఉందని స్పష్టంగా అర్ధమవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన ప్రయత్నం చేయడానికి సిద్ధపడటం లేదన్నారు.
​ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవగాహన కలిగిన వాళ్లు , అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళు ఒక అభిప్రాయాన్ని, ఒక సూచనని ప్రభుత్వానికి చేసినప్పుడు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ దగ్గర ఏ ఒక్క గేటును కూడా మూయకుండానే నీళ్లు తోడుకునే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఇప్పుడు నీళ్లు తోడకపోతే, వ్యవసాయం దెబ్బతింటుందని, దాని వల్ల రైతాంగానికే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ కాళేశ్వరం పై రాజకీయాలు చేయొద్దన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మున్న నాగేశ్వరరావు, నాయకులు జంగారెడ్డి , సుధాకర్ రెడ్డి , కారం పుల్లయ్య, వర్ణ కట్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి వాసుదేవ్ రెడ్డి, జిల్లా నాయకులు పోలేం పెద్ద రాజేందర్, గుర్రం దేవేందర్, పోలేం చిన్న రాజేందర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దామెర కిరణ్, కుమ్మరి రాజుకుమార్, బొడ్డు స్మరణ్, కేవీపీఎస్ నాయకులు ఇసునం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష‍ాల అభిప్రాయాలూ తీసుకోవాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రజల డబ్బుతో పాటు విపరీతమైన అప్పులు చేసిన పాలకులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఒక భారీ ప్రాజెక్టు నిర్మి స్తున్న క్రమంలో ఏ ప్రభుత్వమైనా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ సంప్రదించి వారి అభిప్రాయాలు సేకరించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. కానీ గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఎవరికి వారే నిర్ణయాలు తీసుకొని, తమ రాజకీయ, సొంత ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తు న్నాయని విమర్శించారు. బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రాజెక్టులు,అభివృద్ధి కోసం చేసిందేమిలేదన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -