Sunday, July 19, 2026
E-PAPER
Homeజాతీయంవాంగ్‌చుక్‌ అరెస్టు

వాంగ్‌చుక్‌ అరెస్టు

- Advertisement -

సామాజిక కార్యకర్తను ఎత్తుకెళ్లిన పోలీసులు
అడ్డొచ్చిన సీజేపీ కార్యకర్తలనూ నెట్టివేసిన వైనం
దేశ రాజధానిలో పోలీసుల క్రూరత్వం
జంతర్ మంతర్ వద్దకు తరలి వచ్చిన వేలాది మంది
అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష
ఆయనపై సంఘ్ పరివార్ మద్దతుదారుడు సిరాతో దాడి
ఎస్ఎఫ్ఐ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
పోలీసుల చర్యను ఖండించిన సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​ నీట్ ప్రశ్నా పత్రం లీక్‌ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష‍ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామునే వందలాది మంది పోలీసులు మఫ్టీలో జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకుని దీక్షా శిబిరంపై దాడికి పాల్పడ్డారు. సీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నా వారిని పక్కకు నెట్టి సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా తెల్లటి వస్ర్తం కప్పి ఎత్తుకెళ్లారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రాథమిక అవసరాల కోసం గదిలోకి వెళ్లిన సమయంలో పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. అభిజీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాంగ్‌చుక్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులను అభిజీత్ ఆర్ఎస్ఎస్ గూండాలతో పోల్చారు. వాంగ్‌చుక్‌ను పోలీసులు కిడ్నాప్ చేశారని, తనను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనతో జంతర్‌మంతర్‌ వద్దకు వేలాది మంది తరలివచ్చారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్‌కుమార్, సీనియర్ నాయకురాలు బృందా కరత్, ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ జంతర్ మంతర్‌కు చేరుకుని పోలీసుల చర్యలను ఖండించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ వేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ పట్ల ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. సఫ్దర్ జంగ్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న వాంగ్ చుక్ వద్దకు పోలీసులు అనుమతించటం లేదని అన్నారు. దీంతో ఆ ఆస్పత్రి డైరెక్టర్ కవిత రాణి శర్మతో మాట్లాడి వాంగ్‌చుక్‌ రిపోర్టులు పరిశీలించామని తెలిపారు. సోనమ్ వాంగ్ చుక్ ను బలవంతంగా ఎత్తుకు పోవటాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.



వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులను, వైద్యులను సంప్రదించకుండానే పోలీసులు ఈ చర్య తీసుకున్నారని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో అన్నారు. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్‌ పోటాషియం స్థాయి 2.9గా ఉందనీ, శుక్రవారం 4.3గా ఉన్నట్టు ఆమె చెప్పారు. దీనిపై అనుమానం ఉందని, మరో ల్యాబ్‌లో పరీక్ష చేయడానికి వారు అనుమతించలేదని తెలిపారు.

అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష
సోనమ్‌ వాంగ్‌చుక్‌ను దీక్ష‍ా శిబిరం నుంచి పోలీసులు ఎత్తుకెళ్లడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన నిరసనకారులకు అభివాదం చేస్తుండగా, సంఘ్ పరివార్ మద్దతుదారుడు ఒకరు అభిజీత్‌పై సిరా చల్లారు. సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించిన విద్యార్థి కార్యకర్తలు కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఎస్ఎఫ్ఐ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
​వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా జంతర్ మంతర్ వద్ద ఉన్న ‘క్రాంతి కార్నర్’ వద్ద ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్షను ప్రారంభించింది. అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వాంగ్‌చుక్‌ను విడుదల చేసే వరకు తమ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు ప్రకటించారు. విద్యా రంగంలో వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ తన యూనిట్లకు పిలుపునిచ్చింది. “ఇది భారతదేశ భవిష్యత్తును కాపాడే పోరాటం. పోలీసులు ఎంత అణచివేయడానికి ప్రయత్నించినా మేము అంగుళం కూడా వెనక్కి తగ్గం. దేశవ్యాప్తంగా వందలాది క్రాంతి కార్నర్‌లను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నిర్ణయించింది. ఈ ప్రదేశాలలో నిరవధిక సమ్మె ప్రారంభించబడుతుంది. ఇతర విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా ఇందులో చేరతాయని భావిస్తున్నాము.” అని ఆదర్శ్ ఎం సాజి అన్నారు.



ఐషీ ఘోష్ మాట్లాడుతూ ​“జూలై 18 ఉదయం జరిగినది ఆమోదయోగ్యం కాదు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ, కనీసం కదలలేని స్థితిలో ఉన్న, నిశ్శబ్దంతో న్యాయం కోరుతున్న వ్యక్తిని అపహరించారు. ఒక్క వాంగ్‌చుక్‌ను అడ్డుకుంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ లక్షలాది మంది ముందుకు వస్తారు” అని అన్నారు.
సీజేపీ నేత సౌరవ్ దాస్ మాట్లాడుతూ … హైకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని మాత్రమే ఆదేశించిందని, ఆయనను ఎత్తుకెళ్లమని చెప్పలేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలను ఢిల్లీ పోలీసులు ఉల్లంఘించారని విమర్శించారు. గత రోజులకు భిన్నంగా శనివారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. నిరసనను అణచివేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్‌ను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఈ మార్పు వెనుక ప్రధాని మోడీ ఉన్నట్టు ఆప్ ఆరోపించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండ్రోజుల ముందే జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు, యువత చేస్తున్న సీజేపీ ఆందోళన, వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష‍ను అణచివేసేందుకు కేంద్రం కుట్రలకు దిగింది.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -