8 మంది మృతి- పలువురికి తీవ్రగాయాలు
లైసెన్స్ రద్దయినా కొనసాగిన ఫ్యాక్టరీ
గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలెన్నో..
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రామోల్ ప్రాంతంలోని ఆర్‌ఏఎఫ్ (ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) శిబిరం వెనుక మెహమద్‌పురాలో నడుస్తున్న అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి, గుజరాత్ సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఫ్యాక్టరీ లోపల భారీ శబ్దంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పేలుడు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని వస్త్రాల్ ఆర్‌ఏఎఫ్ శిబిరానికి చెందిన జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండ టంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తు న్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు చిన్నా రులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల పూర్తి వివరాలు, వారి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
లైసెన్స్ రద్దయినా కొనసాగిన ఫ్యాక్టరీ
సెక్టార్-2 జాయింట్ పోలీస్ కమిషనర్ జయపాల్ సింగ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం, మెహుల్ దోడియా అనే వ్యక్తి ఈ బాణాసంచా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. గతంలోనే అతని లైసెన్స్ రద్దు అయినప్పటికీ అక్రమంగా ఫ్యాక్టరీ కొనసాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై రామోల్ పోలీస్ స్టేషన్‌లో హత్యతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, బాధితులకు అవసరమైన అన్ని వైద్య, సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బాణాసంచా పరిశ్రమలో పేలుడు
- Advertisement -
- Advertisement -



