15 రాష్ట్రాల్లో దాడులు, 49 మంది అరెస్ట్
పకడ్బందీగా నేరస్థుల గుట్టు రట్టు చేసిన
హైదరాబాద్ క్రైమ్ పోలీస్
గత నెలలో 98.89 లక్షల నగదు రికవరీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత నెల నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, ఏకంగా 70 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. జులై నెల ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా 25 ప్రధాన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్ ఇలా మొత్తం15 రాష్ట్రాల్లో విస్తృత దాడులు నిర్వహిం చారు. సైబర్ నేరస్థుల ముఠాలోని 49 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ. 98,89,202 రికవరీ చేసిన పోలీసులు బాధి తులకు అందించారు.
పాత నాణేల కొనుగోలు, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలు
సైబర్ నేరస్థులు మాయమాటలతో ప్రజలకు గాలం వేస్తున్నారు. ఇలా మోసాలకు పాల్పడిన నిందితుల్లో ట్రేడింగ్ మోసాల్లో 29 మందిని అరెస్టు చేసిన పోలీసులు, సోషల్ మీడియా నేరాల్లో ఐదుగురిని అరెస్టు చేశారు.
డిజిటల్ అరెస్టు కేసుల్లో 3, వాట్సప్ డీపీ ఫ్రాడ్‌లలో 3, మ్యాట్రిమోనియల్ మోసాల్లో 2, ఏపీకే ఫ్రాడ్, క్రిప్టో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఉద్యోగ మోసాలు, పోక్సో, పాత నాణేల కొనుగోలు మోసాల్లో ఒక్కొక్కరిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 25 డెబిట్ కార్డులు, 23 మొబైల్ ఫోన్లు, 9 చెక్ బుక్కులు, 7 పాస్ బుక్కులు, 5 రబ్బర్ స్టాంపులు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 పాన్ కార్డులు, 2 రెంటల్ అగ్రిమెంట్లు, యూఏఈ రెసిడెంట్ ఐడీ కార్డ్, క్రెడిట్ కార్డ్, పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
231 జీరో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు
సైబర్ పెట్రోలింగ్ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అశ్లీల కంటెంట్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్లను ప్రచారం చేస్తున్న 128 ప్రొఫైళ్లు, 36 పెయిడ్ యాడ్‌లను పోలీసులు గుర్తించి బ్లాక్ చేయించారు. ఇప్పటివరకు నిరంతర నిఘా ద్వారా 1,086 ప్రొఫైళ్లు, 2,553 ప్రకటనలను తొలగించి, 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ‘సి-మిత్ర’ ద్వారా 1,537 మంది బాధితులకు సహాయం అందించడమే కాకుండా 231 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బాధితులు బ్యాంకులు, విచారణాధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా కేంద్ర హోం శాఖ ‘మనీ రీస్టోరేషన్ మోడ్యూల్’ (ఏంఆర్‌ఏం), ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్’ (జీఆర్‌ఏం) పోర్టళ్లను అందుబాటులోకి తెచ్చారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి: సీపీ
ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సీనియర్ అధికారుల పేరుతో వచ్చే నకిలీ సందేశాలను నమ్మొద్దని, సోషల్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపులను నమ్మకుండా కేవలం ‘ఎస్‌ఈబీఐ’ ఆమోదిత యాప్‌లనే వాడాలని సూచించారు. బ్యాంకులు ఎప్పుడూ ఏపీకే ఫైళ్లను పంపవని, చట్టంలో “డిజిటల్ అరెస్ట్” అనేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు లేదా వెబ్‌సైట్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లపై పోలీసుల మెరుపు దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



