‘విక్రమ్-1’ విజయవంతం
శ్రీహరికోట : భారత అంతరిక్ష రంగంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్ ’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1 ’ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఉదయం 11.30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసి.. శాస్త్రవేత్తలు పరిశీలనలు చేపట్టారు. ఇంధన ప్రక్రియలో సమస్య ఉన్నట్టు గుర్తించి దాన్ని సరిచేశారు. 35 నిమిషాల తర్వాత రాకెట్‌ను ప్రయోగించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యను చేరుకుంది. ‘హలో స్పేస్.. విక్రమ్-1 వచ్చేసింది’ అంటూ ప్రయోగం విజయంపై స్కైరూట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈ రాకెట్.. సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోడీ తన చేతిరాతతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్‌కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్‌వర్క్, విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా నింగిలోకి పంపారు. దీనిపై సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మరూపాలను చెక్కారు. అంతేగాక, ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్కైరూట్ బృంద సభ్యులు, ఇస్రో మాజీ చైర్మె న్లు, శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్‌కార్డులను సైతం ప్రత్యేక పేలోడ్ బాక్స్‌లో భద్రపరిచారు.
‘మిషన్ ఆగమన్’..
‘మిషన్ ఆగమన్’ పేరుతో స్కైరూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రయివేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్‌కు చెందిన ‘స్కోప్’ను రోదసిలోకి పంపించారు. ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంతో భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.సుమారు ఏడు అంతస్తుల భవనం ఎత్తుతో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణం తో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్(ఎల్‌ఈఓ)లో ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగి ఉంది. 2022లో విక్రమ్-ఎస్ ద్వారా భారత తొలి ప్రయివేట్ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్.. ఇప్పుడు విక్రమ్-1తో దేశపు తొలి ప్రయివేట్ ఆర్బిటాల్ ప్రయోగం చేపట్టడం విశేషం.
రోదసిలో స్కైరూట్ చరిత్ర
- Advertisement -
- Advertisement -



