బీఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీక్‌లు…కోర్టు కేసులు
నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు
ఇప్పుడు మాకు సుద్దులు చెప్పేందుకు వస్తున్నారు
వారికి మళ్లీ అధికారం కల్ల : అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
.‘‘మేం నోటిఫికేషన్లు ఇచ్చినం. రేవంత్‌రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారే తప్ప ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగుల్ని గత పాలకులు ఏనాడూ మనుషుల్లా చూడలేదు. మానవీయ కోణం ప్రదర్శించలేదు. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ గురించి ‘గురువింద గింజ’ మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అప్రతిష్ట చేశారు. ఇంటర్ బోర్డును భ్రష్టు పట్టించారు. ఏ నోటిఫికేషన్ సక్కగా ఇచ్చారో యువకులే చెప్పాలి. లీకులు, కోర్టులు తప్ప బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులను పట్టించుకున్నదే లేద’’ అని సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాకే అడ్డంకులన్నీ తొలగించి ఏడాదిలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. గత పాలకులను గజ్వేల్‌లో రాజకీయ సమాధి చేసే బాధ్యతను యువకులే చూసుకుంటారని స్పష్టంచేశారు. కవి, రచయిత, గాయకుడు అందెశ్రీ జయంతి నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో అందెశ్రీ స్మృతి వనానికి శనివారం సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ తులసివనంలో అలాంటి గంజాయి మొక్కను మొలకెత్తనివ్వమనీ, . బీఆర్‌ఎస్ మోసాలను, ఆగడాలను తెలంగాణ సమాజం మరచిపోలేదని అన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలన ఇంకా ప్రజల కండ్ల ముందు నుంచి చెరిగిపోలేదని గుర్తుచేశారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. అందెశ్రీని గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం చేసిందని, ప్రజాగాయకులు గద్దర్‌ను కూడా ప్రజాభవన్ గేటు బయట నిలబెట్టి అవమానించారని గుర్తుచేశారు. తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారన్నారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ తనకు స్ఫూర్తిగా నిలబడేవారని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరపిరంగులై గడీలను బద్దలు కొట్టాయనీ, అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించామనీ, కానీ ఆనాటి పాలకులు కుట్రలు పన్ని దాన్ని చరిత్ర నుంచి తొలగించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్బంధాల మధ్యే పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయంటూ దొర అహంకారంపై గళం ఎత్తారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జయ జయహే తెలంగాణ గేయాన్ని తెలంగాణ ప్రతి బడిలో, ప్రతి గడపలో వినిపించేలా చేశామన్నారు. తెలంగాణను ఎవరూ చెరబట్టలేరనీ, ఆ ప్రయత్నం చేస్తే అందెశ్రీ పాటగా మళ్లీ తిరిగొస్తారని చెప్పారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో ప్రాణం కోల్పోయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించామనీ, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా, కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేశామని తెలిపారు.
నోటిఫికేషన్లు ఇచ్చి…ఉద్యోగాలెందుకు ఇవ్వలే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



