Sunday, July 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ నయవంచనే

కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ నయవంచనే

- Advertisement -

అధికార పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే
నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటిఫికేషన్లే
మా పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయి
నిరుద్యోగులకు నేను తోడుంటా
ఇప్పటిదాకా ఒక లెక్క… ఇకపై మరో లెక్క
70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌
యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలొచ్చిన నిరుద్యోగులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను కాంగ్రెస్‌‌ పార్టీ దారుణంగా మోసం చేసిందనీ, నయవంచనకు గురిచేసిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ‌విమర్శిం చారు. ఉద్యోగాలను భర్తీ చేయని కాంగ్రెస్ పార్టీకి యువత ఇక డెత్ డిక్లరేషనే రాస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌‌లోని సరూర్‌‌నగర్‌ ‌స్టేడియంలో బీఆర్‌ఎస్‌ ‘యువ సంగ్రామ సదస్సు’ నిర్వహించింది. యువతీ, యువకులు వేలాదిగా తరలొచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ మాయమాటలతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ పెద్ద మోసమనీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఓ బురిడీ పత్రాన్ని విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేసిన మోసాన్ని యువత మార్చిపోదనీ, గుర్తుపెట్టుకుని కచ్చితంగా గుణపాఠం చెప్తుందని అన్నారు. మూడేండ్ల క్రితం అశోక్ నగర్ చౌరస్తాలో చాయ్ తాగుతూ నిరుద్యోగులతో దిగిన ఫొటోలు, ఇచ్చిన జూటా హామీలు గుర్తున్నాయా? అని రాహుల్ గాంధీని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో వేధింపులతో అవహేళనతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అణిచివేస్తున్నదని అన్నారు. ‘యూత్ డిక్లరేషన్’ హామీల పరిస్థితి ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జాబ్ క్యాలెండర్‌తోపాటు ‌నెలకు రూ.నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం పక్కనబెట్టి, ‘లూటీఫికేషన్’ (దోపిడీ) లో మునిగిపోయిందని ఆరోపించారు. జాబులు ఇవ్వడం లేదు కానీ రాహుల్‌‌గాంధీ జేబులు నింపుతున్నారని అన్నారు. అశోక్ నగర్, దిల్‌షు‌క్‌నగర్ వేదికగా కొలువులు అడుగుతున్న నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సర్కార్ లాఠీఛార్జీలు, అర్ధరాత్రి అరెస్టులతో దమనకాండ సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు అడిగితే “ఎండ్రిన్ తాగి చావండి, బావిలో దూకండి” అంటున్న సీఎం రేవంత్‌‌రెడ్డి అహంకారానికి, కాంగ్రెస్‌ ‌సర్కారుకు రాబోయే రోజుల్లో యువత ఘోరి కట్టడం ఖాయమని కేటీఆర్‌ ‌హెచ్చరించారు. హిట్లర్‌ ‌కంటే దారుణమైన ముగింపును చూస్తారని అన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరొ లెక్క
కాంగ్రెస్ చేస్తున్న మోసాలను చూస్తూ కూడా తెలంగాణ మేధావులు మౌనంగా ఉండడం ఆవేదన కలిగిస్తోందని కేటీఆర్‌ అన్నారు. “జీనా హై తో మర్నా సీఖో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో” అంటూ కొట్లాడిన యువతరం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే పాలకుల కుర్చీలు కూలిపోవడం, పీఠాలు కదిలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగానే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను నిరంతరం ఎండగడ తామని చెప్పారు.”యువతకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా, సోదరుడిగా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. 2028లో ఖచ్చితంగా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. రాబోయే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు న్యాయం చేసే బాధ్యత నాది” అని కేటీఆర్ అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్మాదం, అహంకారం తలకెక్కించుకున్న రేవంత్‌‌రెడ్డికి తగిన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
బీఆర్‌ఎస్‌ ‌హయాంలో 2,32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని కేటీఆర్‌ అన్నారు. దాదాపు 27 లక్షల ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. అయితే టీజీపీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరింత వేగంగా స్పందించాల్సి ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీక రించారు. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సవరించుకుంటామనీ, ఖచ్చిత ంగా వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో యువత ఆలోచనలకు, అవకా శాలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు.

2 కోట్ల ఉద్యోగాలేవీ?
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను, పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తన్నుకు పోతున్నదనీ, ఇదేనా జాతీయవాదమని బీజేపీని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు నిరుద్యోగులు నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్‌ నేతలు సభావేదిక చివరివరుసలో కూర్చుని, ముందు వరుసలో యువతను కూర్చోబెట్టడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -