ప్రతి మనిషి ఒక పుస్తకం. బయట కనిపించేది కేవలం ముఖచిత్రం మాత్రమే. లోపల వందల పేజీల అనుభవం ఉంటుంది. చదవని బాధ ఉంటుంది. చెప్పని ప్రేమ ఉంటుంది. పంచుకోని ఓటమి ఉంటుంది. దాచుకున్న గాయం ఉంటుంది. మనం ముఖచిత్రం చూసి మొత్తం పుస్తకం గురించి తీర్పు చెప్పేస్తాం. ఇదే మన అజ్ఞానం. మన అహంకారం.
నిజమైన నాగరికత రోడ్ల వెడల్పులో ఉండదు. మనసుల విశాలతలో ఉంటుంది. ఎత్తైన భవనాల్లో ఉండదు. ఎత్తైన విలువల్లో ఉంటుంది. ఒక సమాజం ఎంత అభివద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ధనవంతులను చూడాల్సిన అవసరం లేదు. అది బలహీనులను ఎలా చూస్తుందో చూడాలి. ఒక వృద్ధుడు అక్కడ ఎంత గౌరవంగా బతుకుతున్నాడు? ఒక వికలాంగుడు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడు? ఒక ట్రాన్స్‌జెండర్ ఎంత భయంలేకుండా నవ్వగలుగుతున్నాడు? ఒక వితంతువు ఎంత ఆత్మగౌరవంతో జీవిస్తోంది? ఒక కార్మికుడి చెమటకు ఎంత విలువ ఉంది? ఈ ప్రశ్నలే నాగరికతకు నిజమైన కొలమానాలు.
ఈ కాలం మనిషిని మనిషిగా చూడడం కంటే, ఒక పాత్రగా చూడడం ఎక్కువగా నేర్చుకుంది. ఇంట్లో అతను తండ్రి. కార్యాలయంలో ఉద్యోగి. రాజకీయాల్లో ఓటు. మార్కెట్‌లో వినియోగదారుడు. బ్యాంకుకు ఖాతాదారు. ప్రభుత్వానికి ఒక సంఖ్య. సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రొఫైల్. ఈ పాత్రలన్నింటి వెనుక కొట్టుకుంటున్న ఒక హదయం ఉందన్న విషయాన్ని మనం మరిచిపోతున్నాం. అతను అలసిపోతాడు, విరిగిపోతాడు, ఏడుస్తాడు. అతనికీ ఓదార్పు కావాలి. ఒక చేయూత కావాలి. వేగం కోసం పరుగులు తీస్తున్న ఈ ప్రపంచానికి అతని హదయ స్పందన వినిపించడం లేదు. మనిషి విలువను అతని ఉత్పాదకతతో కొలిచే నాగరికత, అతని మానవత్వాన్ని నెమ్మదిగా హరించేస్తోంది. నేడు మనిషి చుట్టూ జనాలు చాలామంది ఉన్నారు. కానీ మనుషులే చాలా తక్కువ. వేలాది పరిచయాలు ఉన్నాయి. బాధను పంచుకునే ఒక్క మనసు దొరకడం లేదు. ఒకప్పుడు ఇళ్లు చిన్నవిగా, మనసులు పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు ఇళ్లు పెద్దవయ్యాయి. గోడలు ఎత్తయ్యాయి. గదులు పెరిగాయి. మనుషుల మధ్య దూరం కూడా పెరిగింది. మాటలు తగ్గిపోయాయి.
సందేశాలు పెరిగాయి. స్పర్శ తగ్గిపోయింది. స్పందనలు ఎమోజీలుగా మారిపోయాయి. ఒక బటన్ నొక్కితే ప్రపంచంతో మాట్లాడగలుగుతున్నాం. పక్కనే కూర్చున్న మనిషి మౌనాన్ని వినలేకపోతున్నాం. ఇదే ఆధునిక ఒంటరితనం. జనసందోహం మధ్య ఒంటరిగా మిగిలిపోయిన మనిషి ఈ శతాబ్దపు అతి పెద్ద విషాదం.
మార్కెట్ మనిషికి అవసరాలను మాత్రమే సృష్టించలేదు. కొత్త గుర్తింపులను కూడా సృష్టించింది. ఏ ఫోన్ వాడుతున్నావు? ఏ బ్రాండ్ దుస్తులు ధరిస్తున్నావు? ఏ కారు నడుపుతున్నావు? ఎక్కడ ఇల్లు ఉంది? ఎంత సంపాదిస్తున్నావు? ఈ ప్రశ్నలే ఇప్పుడు మనిషి విలువను కొలిచే కొలమానాలుగా మారిపోయాయి. వస్తువులను ఉపయోగించాల్సిన మనిషి, చివరికి వస్తువుల ద్వారానే తనను నిరూపించుకోవాల్సిన స్థితికి చేరుకున్నాడు. మార్కెట్ అతని అవసరాలను తీర్చలేదు. అతని అసంతృప్తిని పెంచింది. అతని మనసును వినియోగదారుడిగా మార్చింది. వినియోగదారుడిగా మారిన మనిషి, మానవుడిగా ఉండే సున్నితత్వాన్ని క్రమంగా కోల్పోతున్నాడు.
అయినా ఆశ పూర్తిగా చనిపోలేదు. ప్రతి విపత్తు వచ్చినప్పుడు మనిషిలోని అసలు మనిషి బయటకు వస్తూనే ఉన్నాడు. వరదల్లో ఒక అపరిచితుడు మరొక అపరిచితుడిని భుజాన మోస్తాడు. ప్రమాదాల్లో రక్తదానం చేసే చేయి ముందుగా కులాన్ని అడగదు. ఆకలితో ఉన్న బిడ్డకు అన్నం పెట్టే చేయి మతాన్ని ప్రశ్నించదు. ప్రాణం కాపాడే వైద్యుడు రోగి రాజకీయాలను చూడడు. అంటే మనిషిలో మానవత్వం ఇంకా బతికే ఉంది. అది చనిపోలేదు. దుమ్ము కప్పుకుంది అంతే. ఆ దుమ్మును దులిపేయాల్సిన బాధ్యత మనందరిదీ. సానుభూతి అంటే జాలి కాదు. పై నుంచి కిందికి చూసే దయ కాదు. ‘నీ బాధను పూర్తిగా అనుభవించలేనేమో, కానీ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను’ అని చెప్పగల ధైర్యం. అదే మానవత్వానికి మొదటి అక్షరం. మరొకరి బాధను తీర్పు లేకుండా వినగలగడం, మరొకరి విజయాన్ని అసూయ లేకుండా ఆనందించగలగడం, మరొకరి గౌరవాన్ని తన గౌరవంగా భావించగలగడం. ఇవే నాగరికతకు అసలు పునాదులు.
ప్రపంచాన్ని చివరికి మార్చేది గొప్ప నినాదాలు మాత్రమే కావు. నిశ్శబ్దంగా జరిగే చిన్న చిన్న మానవ చర్యలే. ఆకలితో ఉన్న మనిషితో తన అన్నం పంచుకునే చేయి, పడిపోయిన వృద్ధుడిని లేపే భుజం, భయంతో వణుకుతున్న చిన్నారిని ఓదార్చే మాట, అవమానానికి గురైన మనిషి పక్కన నిలబడే ధైర్యం ఇవి కదా సమాజానికి కావల్సింది. ఇవే మానవత్వం రాసుకునే నిశ్శబ్ద కావ్యాలు. చరిత్రను చివరికి రాజులు రాయరు. ప్రజలే రాస్తారు. రాజప్రాసాదాలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ ఒక తల్లి తన బిడ్డకు నేర్పిన ప్రేమ, ఒక రైతు దున్నిన నేల, ఒక కార్మికుడు కట్టిన ఇల్లు, ఒక ఉపాధ్యాయుడు వెలిగించిన జ్ఞానం, ఒక కవి రాసిన ఆశ. ఇవే.. ఇవే కాలాన్ని దాటుకుని నిలుస్తాయి. మనిషి విశ్వంలో ఒక చిన్న ధూళికణం కావచ్చు. కానీ అదే మనిషి ఈ విశ్వానికి అర్థం ఇచ్చే ఏకైక జీవి కూడా..!
మామిండ్ల రమేష్ రాజా, 7893230218



