Sunday, July 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమీ హయాంలో ఎన్నిఉద్యోగాలిచ్చారు ?

మీ హయాంలో ఎన్నిఉద్యోగాలిచ్చారు ?

- Advertisement -

బీజేపీ ఇస్తానన్న ఏడాదికి రెండు కోట్ల జాబులేవీ ?
నోటిఫికేషన్లు కాదు… ఉద్యోగాలు ఎందుకు ఆపారు?
పేపర్ లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? : టీపీసీసీ చీఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

గత బీఆర్ఎస్ సర్కార్ తన పదేండ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చింది. నోటిఫికేషన్లు జారీ చేశామంటే సరిపోదు… ఉద్యోగాలు ఎందుకు ఆపారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిందనీ, ఆ ఉద్యోగాలేవో చెప్పాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పడు కేంద్రంలో బీజేపీ సర్కారులో పేపర్ లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. గత రెండున్నరేండ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు రికార్డుల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకి లెక్కలు చెప్పడం లేదనీ, అన్ని కరెక్ట్ లెక్కలే చెబుతున్నామన్నారు. ఈ కార్ రేసింగ్ లో మంత్రులు స్కాం లు చేయలేదా? కాళేశ్వరం కూలిపోలేదా? బీఆర్ఎస్ లెక్కలు జనాలు తీర్చారు. ఇంకా ఏమి కావాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా బీఆర్ఎస్ భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటికో ఉద్యోగమిస్తామని కేసీఆర్ తన కుటుంబ సభ్యులందరికి ఉద్యోగాలిచ్చుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులను దోపిడీ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల మందికిపైగా ఉద్యోగ పత్రాలను బహిరంగంగా అందజేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ దుష్టపాలనను ప్రజలు మరిచిపోలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పథకాలు అద్భుతంగా అమలు అవుతున్నాయని కొనియాడారు. రూ.8 లక్షల కోట్ల అప్పులను భరిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. పదేండ్లలో ఇచ్చిన ఉద్యోగాల లెక్క చెప్పని బీఆర్ఎస్ నేతలకు విద్యార్థులు, నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. హామీ ఇచ్చినట్టుగానే ప్రతి నెల పది లోపు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకే బీఆర్ఎస్ భయపడితే, తాము నియామక పత్రాలను అందజేశామని వివరించారు. రాహుల్ గాంధీ హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు.

కులగణనకు మోడీ బ్రేక్‌ ‌వేస్తే రాహుల్‌‌గాంధీపై నిందలా?
​కుల గణన కు బ్రేక్ వేసింది ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయితే కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీకి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పెట్రోలు డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా? అని నిలదీశారు. మోడీ అపాయింట్మెంట్ తీసుకొస్తే కులగణనపై అందరం కలిసి వెళదామని సూచించారు. నరేంద్రమోడీని ప్రజలు నమ్మడం లేదనీ, దేశానికి భవిష్యత్ రాహుల్ గాంధీయేనని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగతుర్తి , ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై నివేదిక అందినట్టు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -