Sunday, August 30, 2026
E-PAPER
Homeమానవికళలు మన జీవితంలో ఓ భాగం

కళలు మన జీవితంలో ఓ భాగం

- Advertisement -

​అన్నపూర్ణ మడిపడిగ… ఓ ఆర్టిస్ట్‌, క్యూరేటర్‌ అయిన ఆమె హైదరాబాద్ నగరాన్ని కళలకు మరో కొత్త వేదికగా మార్చేందుకు ఏక్‌చిత్ర ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. పెయిటింగ్, శిల్పకళ, సెరామిక్స్, ఇన్స్టాలేషన్స్, ఫొటోగ్రఫీ, మిక్స్డ్ మీడియా, వివిధ కళారూపాల సమ్మేళంతో పాటు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ గ్యాలరీ ఉపయోగపడుతుంది. వర్ధమాన కళాకారులతోపాటు ప్రఖ్యాత కళాకారులకూ అనువైన వేదికగా ఈ ఏక్‌చిత్ర గ్యాలరీని రూపొందించిన ఆమె గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం…

అన్నపూర్ణ హైదరాబాద్‌‌లో పుట్టి పెరిగారు. ​తండ్రి రోహిణీ కుమార్, తల్లి భాగ్యలక్ష్మి. తండ్రి ఆర్టిస్టు కావడంతో అన్నపూర్ణ తన చిన్నతనం నుండి వాటినే చూస్తూ పెరిగారు. ఇంట్లో ఎప్పుడూ కళల గురించే చర్చ జరగుతుండేది. తండ్రితో కలిసి ఎన్నో ఆర్ట్‌ ‌గ్యాలరీలకు వెళుతుండేవారు. దాంతో అన్నపూర్ణ కూడా మంచి ఆర్టిస్టు కావాలని కలలు కనేది. తండ్రి ప్రోత్సాహంతో తన చదువు కూడా కళల చుట్టూనే సాగింది. తర్వాత కాలంలో కళే ఆమె జీవితంగా మారిపోయింది. ‘నాన్న నుండి నేను నేర్చుకుంది ఎవరైనా ఏమైనా చేస్తే దాన్ని మెచ్చుకోవడం. అందుకే ఆర్ట్‌ అప్రియేషన్‌ ‌కోర్సును చేశాను. వాస్తవానికి అది నాకు సహజంగానే వచ్చింది. నేను పెయింటింగ్‌ ‌వేయడం కంటే ఇతరుల కళను ప్ర‌పంచానికి చూపించాలని క్యూరేషన్‌ వైపుకు వెళ్లాను. ఇది నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. మన కళలను మరింత ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఏక్‌ ‌చిత్ర ఆర్ట్‌ ‌గ్యాలరీ ప్రారంభించాను’ అంటున్నారు అన్నపూర్ణ.

​పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో
మొదటి నుండి మన జీవితంలోనే కళ ఓ భాగంగా ఉంది. కానీ ఇప్పుడు బిజీ జీవితంలో ఇదేదో మనకు సంబంధించిన పని కాదు అని చాలా మంది అనుకుంటున్నారు. అటువంటి వారికి మళ్లీ మన కళలను పరిచయం చేయాలి అని అన్నపూర్ణ బలంగా భావించారు. ఆ ఆలోచనల నుండి పుట్టిందే ఏక్‌ ‌చిత్ర ఆర్ట్‌ ‌గ్యాలరీ. ఈ గ్యాలరీలో ప్రింట్ మేకింగ్‌ను ఒక ప్రత్యేక కళారూపంగా మార్చడంతో పాటు దాన్ని ప్రోత్సహించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే కళాకారులను ఈ మాధ్యమంతో అనుసంధానించడం కూడా వీరి ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు శిక్షణ, ప్రయోగాలు, వర్క్ షాప్స్, స్క్రీనింగ్స్, డిబేట్స్, ఆర్ట్ ఎక్స్చేంజ్ మొదలైన అంశాల్లో కూడా కళాకారులకు ఈ గ్యాలరీ ఒక వేదికగా ఉపయోగపడనుంది.

​సరికొత్త కార్యక్రమాలకు వేదిక
‘ఈ ఏక్‌చిత్ర గ్యాలరీ ప్రదర్శనలు, భాగస్వామ్యాలు, సంభాషణలతో పాటు కళాకారులు, ప్రేక్షకుల మధ్య ఏర్పడిన సంబంధాల వల్లే అభివృద్ధి చెందింది. ఎగ్జిబిషన్లకు వేదికగా మాత్రమే కాకుండా కళాకారులు, కళల మధ్య అనుబంధాలను పెంచుతూ.. సంభాషణలు, వర్క్ షాపులు వంటి సరికొత్త కార్యక్రమాలకు వేదిక కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం. వీటన్నింటికీ మా ఆర్ట్ గ్యాలరీ ఉపయోగపడాలని, దాన్నొక అవసరంగా మేము భావించాం’ అని అంటున్నారు అన్నపూర్ణ. ఈ గ్యాలరీ కళకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్, పరిశోధకులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో పలు అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు అన్నపూర్ణ అన్నారు.

మొదటి ప్రదర్శన : ట్రాన్సిషన్
​ఏక్‌చిత్ర న్యూ గ్యాలరీలో ‘ట్రాన్సిషన్ : ఎ కంటిన్యుటీ టు చేంజ్ – యాన్ ఓడ్ టు ఐడెంటిటీస్ ఇన్ ఫ్లక్స్’ అనే ఎగ్జిబిషన్‌తో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. శిల్పకళ, పెయింటింగ్, సెరామిక్స్, ప్రింట్ మేకింగ్ మొదలైన విభిన్న కళారూపాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తమ కళారూపాలతో వీళ్లంతా మన దేశ వారసత్వ సంపదలను ప్రపంచానికి చాటుతున్నారు. గతంలో వేర్వేరు భాగాలుగా మారిన ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్, డెకరేటివ్ కళలన్నింటినీ ఒక దగ్గర చేర్చిన ఘనత ఈ గ్యాలరీకే దక్కింది.

​ఫౌండర్ కమ్ క్యురేటర్
​హైదరాబాద్‌ ‌మహానగరంలో ఇంత పెద్ద ఆర్ట్‌ ‌గ్యాలరీని స్థాపించిన అన్నపూర్ణ స్వయంగా ఓ ఆర్టిస్ట్, క్యురేటర్. హైదరాబాద్ కేంద్రంగా కళ, కథనం, జ్ఞాపకం, సంస్కృతి, ప్రాంతీయతలను ఒకచోటకు చేర్చే కృషి చేస్తున్నారు. క్యురేటోరియర్ వేదికగా ఈ ఏక్ చిత్రను స్థాపించారు. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో ఆమె ఇప్పటివరకు 25కు పైగా ప్రధాన ప్రదర్శనలకు క్యురేటర్‌గా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల కళా చరిత్ర, జీవన సంప్రదాయాలతో ఏక్‌చిత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆర్కిటెక్చర్, సాహిత్యం, చిత్రకళ, సంగీతం, హస్తకళలు, దేవాలయ సంప్రదాయాలు, దక్కనీ ప్రభావాలు, జానపద కళారూపాలు వంటి అంశాలపై కూడా ఆమె దృష్టి సారిస్తున్నారు.

లివింగ్ టెంపుల్ నుంచి బావ్లీ ఆర్ట్ సంగం
​అన్నపూర్ణ తన ఏక్‌చిత్ర ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించవలసిన కార్యకలాపాలపై పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. లివింగ్ టెంపుల్ – ఎడిషన్ 2 పేరుతో వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక వేదికలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కళ, ఆర్కిటెక్చర్, సంప్రదాయ వ్యక్తీకరణ, ప్రజల భాగస్వామ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే కీర్తనం.. ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల కళా చరిత్రకు అంకితం చేసే విధంగా రూపొందించనున్నారు. కళా చరిత్రలు, సాంస్కృతిక కథనాలకు అధిక ప్రాధాన్యం అందించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. బావ్లీ ఆర్ట్ సంగం.. దీనిద్వారా హైదరాబాద్‌లోని చారిత్రక మెట్ల బావులను కళా వేదికలుగా మార్చే ఆలోచనను ఆచరణలోకి తీసుకురాబోతున్నారు. మెట్ల బావులను కేంద్రంగా చేసుకుని ప్రదర్శనలు, వర్క్ షాపులు, హెరిటేజ్ వాక్స్, టాక్స్ వంటి వాటిని ప్రోత్సహించాలనుకుంటున్నారు. వారసత్వం, నీరు, ఆర్కిటెక్చర్‌లకు సమకాలీన కళను అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఇటువంటి విభిన్న, అద్భుత ప్రాజెక్టులతో ఈ ఏక్‌చిత్ర ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ కళారంగానికి మరో చిరునామాగా మారనుంది.

– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -