Sunday, August 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రాణహితకు పునరుజ్జీవం

ప్రాణహితకు పునరుజ్జీవం

- Advertisement -

సెప్టెంబర్ 1న ఢిల్లీలో తెలంగాణ– మహారాష్ట్ర కీలక అంతర్రాష్ట్ర చర్చలు
సీడబ్ల్యూసీ చైర్మెన్‌ నేతృత్వంలో జల సంప్రదింపులు
152 మీటర్ల ఎత్తు సాధ్యమైతే సుందిళ్లకు 80 టీఎంసీల ప్రాణహిత జలాలు
ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డిలో కోల్పోయిన ఆయకట్టుకు భరోసా
రాష్ట్ర జల ప్రయోజనాల పరిరక్షణలో రాజీ లేదు : 
మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీ వింపజేసి, అసలు పథకంలో తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే తెలంగాణ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు 80 టీఎంసీల ప్రాణహిత జలాలను భారీ ఎత్తిపోతల అవసరం లేకుండా సహజ గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ–మహారాష్ట్ర మధ్య జరగనున్న కీలక అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం సాయంత్రం ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్‌బాబుతో పాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ సమావేశంలో తెలంగాణ తరఫున వినిపించాల్సిన సాంకేతిక, న్యాయపరమైన వాదనలు, 152 మీటర్ల బ్యారేజీ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, గురుత్వాకర్షణ ద్వారా నీటి తరలింపు సాధ్యాసాధ్యాలను కూలంకషంగా సమీక్షించారు. రెండు రాష్ట్రాల మధ్య అధికారిక చర్చలకు కేంద్రం వేదిక కల్పించిన నేపథ్యంలో తెలంగాణ జల ప్రయోజనాలను బలమైన సాంకేతిక ఆధారాలతో ప్రతిపాదించేందుకు ఈ సన్నాహక సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 1న జరిగే అంతర్రాష్ట్ర సమావేశానికి కేంద్ర జల సంఘం చైర్మెన్‌ అధ్యక్షత వహిస్తారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో పాటు సీడబ్ల్యూసీలోని కీలక డైరెక్టరేట్ల అధిపతులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అంతర్రాష్ట్ర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయని వెల్లడించారు.

తెలంగాణ–మహారాష్ట్ర మధ్య అధికారిక చర్చల ప్రక్రియ ప్రారంభం కావడమే ప్రాణహిత పునరుజ్జీవంలో ఒక కీలక ముందడుగని మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ కేంద్రంతో నిరంతరం జరిపిన సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాల ఫలితంగానే ఈ చర్చలకు మార్గం సుగుమమైందన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి మొదట ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

​152 మీటర్ల స్థాయిలో ‘తుమ్మిడిహెట్టి’ నిర్మాణానికి ప్రయత్నం
గత రాష్ట్ర ప్రభుత్వం 2016లో అంగీకరించిన 148 మీటర్ల స్థాయికి బదులుగా 152 మీటర్ల స్థాయిలో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ప్రయత్ని స్తుందని మంత్రి వెల్లడించారు. రెండు మీటర్ల అదనపు స్థాయి తెలంగాణకు జల వినియోగం, నీటి తరలింపు పరంగా గణనీయమైన సాంకేతిక ప్రయోజనాన్ని కల్పిస్తుం దని వివరించారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించిన సాంకేతిక అధ్యయనాల ప్రకారం 148 మీటర్ల స్థాయిలో మహారాష్ట్ర భూభాగంలో సుమారు 1,150 ఎకరాలు, 152 మీటర్ల స్థాయిలో 2,500 ఎకరాలకు పైగా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. “148 మీటర్ల వద్ద కూడా ముంపు ఉంది. 152 మీటర్ల వద్ద కూడా ముంపు ఉంటుంది. ముంపు అంశంపై మహారాష్ట్రతో సంప్రదింపులు అనివార్యమైనప్పుడు తెలంగాణకు సాంకేతికంగా అత్యధిక ప్రయోజనం కలిగించే 152 మీటర్ల స్థాయికి సమ్మతి సాధించేందుకు గత ప్రభుత్వం మరింత సమర్థవంతంగా చర్చించి ఉండాల్సింది. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను తగినంతగా పరిరక్షించకుండా 148 మీటర్లకు అంగీకరించడం వల్ల తెలంగాణ ఒక కీలక అవకాశాన్ని కోల్పోయింది” అని మంత్రి పేర్కొన్నారు.

ఈ నిర్మాణం సాధ్యమైతే సుందిళ్లకు 80 టీఎంసీల ప్రాణహిత జలాలు
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణం సాధ్యమైతే దాదాపు 80 టీఎంసీల ప్రాణహిత జలాలను సహజ గురుత్వాకర్షణతో సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. భారీ ఎత్తిపోతల వ్యవస్థల ద్వారా నీటిని తరలించేందుకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం, ఏటా భరించాల్సిన నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. గురుత్వాకర్షణ ఆధారిత నీటి తరలింపు సాగునీటి వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, ఆర్థికంగా సుస్థిరంగా మార్చగలదని పేర్కొన్నారు. ప్రాణహిత ప్రతిపాదనకు 1975, 1978 అంతర్రాష్ట్ర ఒప్పందాలు బలమైన న్యాయ, సంస్థాగత పునాదిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ప్రాణహిత ప్రాజెక్టును పరస్పర ప్రయోజనాల కోసం సంయుక్తంగా లేదా స్వతంత్రంగా అభివృద్ధి చేసుకునేందుకు ఆ ఒప్పందాలు అవకాశం కల్పించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రయత్నం కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదని, దశాబ్దాల క్రితం ఏర్పడిన అంతర్రాష్ట్ర అవగాహనకు అనుగుణంగా తెలంగాణ ప్రయోజనాలను సాధించే ప్రయత్నమని పేర్కొన్నారు. అసలు ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి పథకం సుమారు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపుదిద్దుకుందని మంత్రి గుర్తుచేశారు. అనంతరం జరిగిన ప్రాజెక్టు పునరాకల్పన, పునర్వ్యవస్థీకరణలో అసలు ప్రతిపాదిత ఆయకట్టులోని గణనీయమైన ప్రాంతాలు సాగునీటి ప్రయోజనాలకు దూరమయ్యాయని తెలిపారు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని దాదాపు రెండు లక్షల ఎకరాలకు సమర్థవంతమైన సాగునీటి వనరు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటినా అసలు ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా నీరందుతుందని ఆశించిన రైతుల నిరీక్షణ కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. “అసలు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన రైతులు పదేండ్లకుపైగా ఎదురుచూశారు. వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాణహిత పునరుజ్జీవం అంటే కేవలం ఒక బ్యారేజీ నిర్మించడం కాదు..సాగునీటి హామీ కోల్పోయిన ప్రాంతాలకు తిరిగి జలభరోసా కల్పించడం” అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘​ ప్రాణహిత–చేవెళ్ల ’లో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలు
ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలు కూడా అసలు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పునరాకల్పన చేసిన సమయంలో కీలక ప్యాకేజీలను తొలగించడంతో ఆయా ప్రాంతాలు తమకు ఉద్దేశించిన సాగునీటి వనరును కోల్పోయాయని పేర్కొన్నారు. అసలు ఆయకట్టులో ఉన్నప్పటికీ పునరాకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ప్రాంతాలకు తగిన జలభరోసా లభించలేదన్నారు. ​అందువల్ల ప్రస్తుత ప్రభుత్వ ప్రాణహిత పునరుజ్జీవన ప్రణాళిక తుమ్మిడిహెట్టి వద్ద ఒక బ్యారేజీ నిర్మాణానికే పరిమితం కాదనీ, పునరాకల్పనలో సాగునీటి ప్రయోజనాలు కోల్పోయిన ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతాలకు అసలు ప్రాజెక్టులో కల్పించిన ప్రయోజనాలను తిరిగి అందించడమే విస్తృత లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 1న జరిగే సమావేశంలో 152 మీటర్ల ప్రతిపాదిత బ్యారేజీ స్థాయి, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, అంతర్రాష్ట్ర అంశాలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తామని మంత్రి తెలిపారు. మహారాష్ట్రతో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతూనే తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నదీజల ప్రయోజనాల విషయంలో రాజీపడ బోమని స్పష్టం చేశారు. “తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరుపుతాం. గరిష్ఠ ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ, భారీ ఎత్తిపోతలపై ఆధారాన్ని తగ్గించి, రాష్ట్రంపై ఏటా పడే విద్యుత్ వ్యయభారాన్ని గణనీయంగా తగ్గించగల ప్రాణహిత ప్రాజెక్టును పునరుజ్జీవింపజేయడమే మా సంకల్పం. తెలంగాణ రైతాంగానికి ఒకప్పుడు ఇచ్చిన జలహామీని కార్యరూపంలోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -