Sunday, August 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

- Advertisement -

యాదాద్రికి గోదావరి జలాల వాటా కేటాయించాలి
పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులివ్వాలి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భువనగిరిలో పాదయాత్ర ప్రారంభం
జిల్లా కార్యదర్శి జహంగీర్‌ నేతృత్వంలో కదిలిన కామ్రేడ్స్
31న హైదరాబాద్‌‌లో మహాధర్నా..
సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున ప్రజా ఉద్యమం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య​

​నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
​​సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య విమర్శించారు. ఫ్యూచర్‌ సిటీపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా.. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులపై చూపాలని డిమాండ్‌ చేశారు. ​సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్‌ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన మూడు రోజుల మహా పాదయాత్ర శనివారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైంది. చివరిరోజు 31న హైదరాబాద్‌‌లో మహాధర్నా జరుగుతుంది. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్‌ నేతృత్వంలో ప్రారంభమైన పాదయాత్రకు కార్యకర్తలు భారీస్థాయిలో హాజరయ్యారు. వీరయ్య జెండా ఊపి మహా పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రకు ముందు శాసనమండలి మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్‌, తదితర నాయకులతో కలిసి డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో వీరయ్య మాట్లాడారు.

మానవ నాగరికత చరిత్రలో సాగు, తాగునీటికి కీలక స్థానం ఉందన్నారు. వ్యవసాయ రంగం బలోపేతమైతే రైతుల ఆదాయం, ప్రజల కొనుగోలు శక్తి పెరిగి చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు, పరిశ్రమలు, సేవా రంగం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నప్పటికీ ఏ ఒక్క ఏడాది కూడా మొత్తం భూమికి సాగునీరు అందలేదనన్నారు. 4 నుంచి 4.5 లక్షల ఎకరాలకు నీరందితే గొప్పగా భావించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం కరువు పరిస్థితుల నేపథ్యంలో కనీసం ఒకటి, రెండు లక్షల ఎకరాలకు నీరందుతుందో లేదో అనుమానంగా ఉందని అన్నారు.. ఏడు జిల్లాలతో ముడిపడి ఉన్న మూసీ నది ప్రక్షాళనకు గోదావరి జలాలను మళ్లించాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు గోదావరి జలాల వాటాను కేటాయించాలని కోరారు. ప్రభుత్వం హైదరాబాద్‌ సరిహద్దులు దాటి రాష్ట్ర అవసరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాలో పాల్గొని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు.

పెండింగ్‌.. ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు? : జహంగీర్‌
​యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, తాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటంపై సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్వాపురం, గంధమల్ల, చర్లగూడెం రిజర్వాయర్లతో పాటు పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాలువలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించి, గడువు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ​ బస్వాపురం ప్రాజెక్టు దాదాపు 19 ఏండ్లుగా పెండింగ్‌లో ఉందని, రూ.420 కోట్ల అంచనా వ్యయానికి ఇప్పటివరకు ప్రకటించిన నిధులు పూర్తికి సరిపోవని అన్నారు. రూ.450 కోట్ల గంధమల్ల ప్రాజెక్టుకు తాజాగా రూ.80 కోట్లు విడుదల చేస్తే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. రూ.6,200 కోట్ల చర్లగూడెం ప్రాజెక్టుకు ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్లే విడుదలయ్యాయని తెలిపారు. 2003లో చేపట్టిన ధర్మారెడ్డిపల్లి, 2005లో ప్రారంభమైన పిలాయిపల్లి, 2006లో చేపట్టిన బునాదిగాని కాలువలు ఇంకా పూర్తికాకపోవడం దారుణమన్నారు. మూసీ ప్రక్షాళనను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలోని ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని, గోదావరి జలాలను జిల్లాకు తీసుకురావడంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.​ నారాయణపూర్‌, చౌటుప్పల్‌ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు చేపట్టాలని, షామీర్‌పేట–కొండపోచమ్మసాగర్‌ జలాల ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నవాబ్‌పేట రిజర్వాయర్‌ కాలువలు పూడిపోయి నీరు అందకపోవడంపైనా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

​​​ఇరవై ఏండ్లుగా అదే నీటి గోస : చెరుపల్లి
ప్రభుత్వాలు మారుతున్నా యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారం కావడం లేదని శాసనమండలి మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. 2006లో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సుమారు 2,000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి సమస్యలను వివరించామని గుర్తుచేశారు. చిన్న ప్రాజెక్టులు పూర్తయితే ఆయకట్టు పెరిగి రైతుల ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, పైళ్ల ఆశయ్య, సీఐటియూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్‌, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, మద్దెల రాజయ్య, బొల్లు యాదగిరి, బొడ్డుపల్లి వెంకటేష్, గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, దోడ యాదిరెడ్డి, మద్దేపూరం రాజు, బోలగాని జయరాములు, అవ్వారు రామేశ్వరి, ఎంఎ ఇక్బాల్, వనం ఉపేందర్, గడ్డం వెంకటేష్, రాగీరు కిష్టయ్య, మల్లేపల్లి లలిత, బల్గూరి అంజయ్య, కోట రామచంద్రారెడ్డి, గోశిక కరుణాకర్, మేక అశోక్‌‌రెడ్డి, కూరెళ్ల నర్సింహచారి, మండల కార్యదర్శిలు ,జిల్లా ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -